15 నెలల గరిష్టానికి నిఫ్టీ ఆర్బీఐ పాలసీ నేడు
♦ ఈ నేపథ్యంలో ఆశావహ కొనుగోళ్లు
♦ కలసివచ్చిన సానుకూల అంతర్జాతీయ సంకేతాలు
♦ 104 పాయింట్ల లాభంతో 28,183కు సెన్సెక్స్
♦ 28 పాయింట్ల లాభంతో 8,711కు నిఫ్టీ
ఆర్బీఐ పాలసీ మంగళవారం వెలువడనుండటంతో ఇన్వెస్టర్ల ఆశావహ కొనుగోళ్ల కారణంగా సోమవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటం కూడా కలసి రావడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్28వేల పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 8,700 పాయింట్ల ఎగువన ముగిశాయి. సెన్సెక్స్ 104 పాయింట్ల లాభంతో 28,183 పాయింట్లకు, నిఫ్టీ 28 పాయింట్ల లాభంతో 8,711 పాయింట్లకు చేరాయి. నిఫ్టీకి ఇది 15 నెలల గరిష్ట స్థాయి. గత మూడు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 485 పాయింట్లు లాభపడింది.
రోజంతా లాభాల్లోనే
శుక్రవారం వెలువడిన ఉద్యోగ గణాంకాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో అమెరికా సూచీలు రికార్డ్ స్థాయిలో ముగిశాయి. చైనా పారిశ్రామికోత్పత్తి గణాంకాలు బలహీనంగా ఉన్నప్పటికీ, అమెరికా మార్కెట్లు రికార్డ్ స్థాయిలో ముగియడంతో సోమవారం ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియడం, యూరప్ మార్కెట్లు లాభాలతో ప్రారంభం కావడంతో స్టాక్ సూచీలు రోజంతా లాభాల్లోనే కొనసాగాయి. ఆర్‌బీఐ గవర్నర్‌గా రఘురామ్ రాజన్ వెల్లడించే నేటి పాలసీలో రేట్లు యథాతథంగానే ఉంటాయన్న అంచనాలున్నాయి. అయినప్పటికీ, అంతర్జాతీయ సానుకూల సంకేతాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు పొజిషన్లు బిల్డప్ చేసుకుంటున్నారని విశ్లేషకులంటున్నారు. హీరో మోటొకార్ప్ నికర లాభం ఈ క్యూ1లో 18 శాతం పెరగడం, విదేశీ పెట్టుబడులు జోరు కొనసాగుతుండడం, ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు ఊపునిచ్చింది.
హిందాల్కో 4 శాతం వరకూ అప్..:అమెరికా అనుబంధ కంపెనీ నొవాలిస్ మంచి ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో హిందాల్కో షేర్4 శాతం వరకూ పెరిగి రూ. 149 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్ ఏడాది గరిష్ట స్థాయి, రూ.152ను తాకింది. నికర లాభం 9 శాతం పెరగడంతో బ్రిటానియా ఇండస్ట్రీస్ షేర్ 9 శాతం పెరిగి రూ. 3,152 వద్ద ముగిసింది. కోల్గేట్ పామోలివ్ నికర లాభం 9 శాతం వృద్ధి చెందడంతో ఈ షేర్ 6 శాతం లాభపడి రూ.1,016 కు చేరింది. ఇంట్రాడేలో ఈ షేర్ ఏడాది గరిష్ట స్థాయి, రూ.1,032ను తాకింది.