బాంబే స్టాక్ ఎక్సేంజీ, నేషనల్ స్టాక్ ఎక్సేంజీల్లోకి పెట్టుబడుల వరద వస్తోందని, ఇన్వెస్టర్ల జేబుల్లో కనక వర్షం కురుస్తుందంటూ ఇటీవల వార్తలు పుంఖాను పుంఖాలుగా వస్తున్నాయి. దేశీ సూచీల బుల్ జోరు రేపుతున్న దుమ్ములో బ్రోకరేజీ సంస్థల ఆగడాలు, వాటి వల్ల నష్టపోతున్న ఇన్వెస్టర్ల సంగతులు బయటకు రావడం లేదు. దీనిపై స్టాక్‌మార్కెట్ విజిల్ బ్లోయర్ సుచేతా దలాల్ తొలిసారిగా గళమెత్తారు.
నాణేనికి మరోవైపు
అంతర్జాతీయ వ్యవహరాలు, దేశీయంగా నెలకొన్న పరిస్థితులతో సంబంధం లేకుండా స్టాక్‌మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు గరిష్టాలను నమోదు చేస్తున్నాయి. ఒక సెషన్‌ని మించి మరో సెషన్‌లో బుల్‌జోరు కొనసాగుతోంది. వారాల వ్యవధిలోనే వేల పాయింట్లు దాటేస్తున్నాయి. ఇదంతా నాణేనికి ఒకవైపయితే మరోవైపు ఇన్వెస్టర్ల నగదుకి మార్కెట్‌లో గ్యారెంటీ లేకుండా పోతోంది. నమ్మిన వాళ్లను నట్టేట ముంచుతున్నాయి కొన్ని స్టాక్‌మార్కెట్ బ్రోకరేజీ సంస్థలు.
మోసాలు.. నిషేధాలు
ఇటీవల ఇన్వెస్టర్లకు నగదు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేయడం, స్టాక్ మార్కెట్ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా పని చేస్తున్న బ్రోకరేజీ సంస్థలపై ఇటు బీఎస్‌ఈ, అటు ఎన్‌ఎస్‌ఈలు కొరడా ఝులిపిస్తున్నాయి. రెండు నెలల కాలంలోనే ఏకంగా 30కి పైగా బ్రోకరేజీ సంస్థలను నిషేధించాయి. తాజాగా ఫస్ట్ ఫ్యూచర్స్ అండ్స్ స్టాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను నిషేధిస్తూ ఎన్‌ఎస్‌ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. దీన్ని ఉదహరిస్తూ సుచేతా స్టాక్ మార్కెట్‌లను ప్రశ్నించారు.
వాళ్ల సంగతేంటి ?
స్టాక్ మార్కెట్ సూచీలు గరిష్టాలను టచ్ చేస్తున్నాయి. బుల్ జోరు కొనసాగుతోంది. కొత్తగా డీమ్యాట్ అకౌంట్లు తెరుస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది అనే విధంగా ప్రచారం జరుగుతుంది తప్పితే. బ్రోకరేజీ సంస్థలు మోసాలకు పాల్పడిన సమయంలో ఇన్వెస్టర్లకు ఏ తరహా సాయం అందుతుంది. వారు నష్టపోకుండా ఏం చేస్తున్నారు అనే విషయంపై స్టాక్ ఎక్సేంజీలు ఎందుకు చొరవ చూపించడం లేదు అన్నట్టుగా ఆమె ప్రశ్నించారు. మోసాలకు పాల్పడిన వారిని నిషేధిస్తే సరిపోతుందా ? నష్టపోయిన వారి సంగతేంటంటూ నిలదీస్తూ ట్వీట్ చేశారు.
కంటి తుడుపు సాయం
ఎన్‌ఎస్‌ఈ ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్‌లో ఫస్ట్ ఫ్యూచర్ అండ్స్ స్టాక్స్ ప్రైవేట్ లిమిడెట్ బ్రోకరేజీ సంస్థ వల్ల నష్టపోయిన వారికి ఇన్వెస్టర్ ప్రొటెక‌్షన్ ఫండ్ కింద రూ. 25 లక్షల వంతున పరిహారం అందిస్తామని ప్రకటించింది. అయితే దీనిపై ఇన్వెస్టర్ల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. కోట్ల రూపాయలు నష్టపోతే కేవలం రూ. 25 లక్షలు చెల్లించి చేతులు దులుపుకోవడం సరికాదంటూ చెబుతున్నారు. దీనికి ఉదాహారణగా కేవలం ఆరుగురు ఇన్వెస్టర్లకే ఈ బ్రోకరేజీ వల్ల రూ. 6 కోట్ల నష్టం వాటిల్లిందని, ఇలాంటి వారు ఎందరో ఉన్నారని చెబుతున్నారు.
This must be 30 brokers expelled in past 2 years. #SEBI Coll with it! Probably thinks @NSEIndia is purging system! No talk of investors. Maybe NSE should celebrate these numbers like it celebrates NIFTY highs? Or turnover? @FinMinIndia @nsitharaman ?? pic.twitter.com/7lcUo9fqcw
— Sucheta Dalal (@suchetadalal) October 19, 2021
ఎవరీ సుచేతా దలాల్
ఇక స్టాక్‌మార్కెట్ విజిల్ బ్లోయర్ సుచేతా దలాల్ విషయానికి వస్తే... 1992లో హర్షద్ మెహతా స్కామ్‌ని తొలిసారిగా వెలుగులోకి తెచ్చిన బిజినెస్ జర్నలిస్ట్‌గా ఆమె దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. స్టాక్‌మార్కెట్ వ్యవహరాలు, అక్కడ జరుగుతున్న అవకతవకలపై ఆమె తరచుగా స్పందిస్తూ ఇన్వెస్టర్లను హెచ్చరిస్తుంటారు. తాజాగా బ్రోకరేజీ సంస్థల వల్ల ఇన్వెస్టర్లకు జరుగుతున్న నష్టంపై ఆమె చేసిన ట్వీట్ మార్కెట్ వర్గాల్లో చర్చకు దారి తీసింది.
చదవండి :ఎలన్‌మస్క్ నంబర్ 1 ధనవంతుడయ్యాడంటే కారణమిదే - ఆనంద్ మహీంద్రా
Comments
Please login to add a commentAdd a comment