
ఏడు నెలల తర్వాత 27 వేలకు..
♦ అంచనాలకనుగుణంగానే ఆర్‌బీఐ పాలసీ
♦ కలిసొచ్చిన జానెట్ వ్యాఖ్యలు
♦ 232 పాయింట్ల లాభంతో 27,010కు సెన్సెక్స్
♦ 65 పాయింట్లు లాభపడి 8,266కు నిఫ్టీ
ముంబై: కీలక రేట్ల విషయంలో సర్దుబాటు ధోరణితో వ్యవహరించాలన్న ఆర్‌బీఐ నిర్ణయం స్టాక్ మార్కెట్‌కు మంగళవారం లాభాలు తెచ్చిపెట్టింది. రేట్ల పెంపు ఈ నెలలో ఉండకపోవచ్చని అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్‌పర్సన్ జానెట్ యెలెన్ సూచనప్రాయంగా వెల్లడించడంతో ప్రపంచ మార్కెట్లతో పాటు మన మార్కెట్ కూడా పెరిగింది. అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు, ముడి చమురు ధరలు పెరగడం వంటి సానుకూలతలు కూడా తోడవడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 27 వేల పాయింట్లపైన, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 8,250 పాయింట్ల పైన ముగిశాయి.
స్టాక్ సూచీలు రెండూ ఏడు నెలల గరిష్ట స్థాయికి చేరటం గమనార్హం. సెన్సెక్స్ 232 పాయింట్లు లాభంతో 27,010 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 65 పాయింట్లు లాభపడి 8,266 పాయింట్ల వద్ద ముగిశాయి. అన్ని రంగాల నిఫ్టీ సూచీలూ లాభాల్లోనే ముగిశాయి. బ్యాంక్, రియల్టీ షేర్లు జోరుగా పెరిగాయి. ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు నష్టపోవడం, ట్రేడింగ్ చివర్లో కొన్ని షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో లాభాలకు కళ్లెం పడింది.
యథాతథ రేట్లు... ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భాగంగా బ్యాంక్ రేటు(7 శాతం), రెపో రేటు(6.5 శాతం), రివర్స్ రెపో రేటు(6 శాతం), నగదు నిల్వల శాతం(సీఆర్‌ఆర్-4 శాతం)ల్లో అంచనాలకనుగుణంగానే యథాతథ స్థితిని కొనసాగించాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. ద్రవ్యోల్బణం రిస్క్‌తో ఈ నిర్ణయం తీసుకున్నామని గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. అంచనాలకనుగుణంగా వర్షాలు కురిసి ద్రవ్యోల్బణం దిగొస్తే రేట్లను తగ్గిస్తామని చెప్పారు.