హెచ్చుతగ్గుల మార్కెట్
- ఆర్‌బీఐ పాలసీ నేపథ్యంలో ఇన్వెస్టర్ల ముందు జాగ్రత్త
- 40 పాయింట్ల లాభంతో 25,864కు సెన్సెక్స్
- 23 పాయింట్ల లాభంతో 7,869కు నిఫ్టీ
ముంబై: వచ్చే వారం ఆర్‌బీఐ పాలసీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచి తూచి వ్యవహరించారు. దీంతో ఒడిదుడుకులమయంగా సాగిన ట్రేడింగ్‌లో గురువారం స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాలతో గట్టెక్కింది. బీఎస్‌ఈ సెనెక్స్ 40 పాయింట్ల లాభంతో 25,864 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 23 పాయింట్ల లాభంతో 7,869 పాయింట్ల వద్ద ముగిశాయి. సెప్టెంబర్ నెల డెరివేటివ్స్ కాంట్రాక్టు ముగింపు ప్రభావం పెద్దగా కనిపించలేదు. డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడంతో ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వంటి ఐటీ, టెక్నాలజీ, ఫార్మా షేర్లు లాభపడ్డాయి, ఆయిల్, క్యాపిటల్ గూడ్స్, కొన్ని లోహ షేర్లు పతనమయ్యాయి.
రోల్ ఓవర్స్ సానుకూల ప్రభావం...
సెన్సెక్స్ 279 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. సెప్టెంబర్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టుల రోల్ ఓవర్లు అక్టోబర్‌కు స్వల్పంగా పెరగడంతో సెంటిమెంట్ మెరుగుపడిందని మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. కాగా ఈ వారంలో సెన్సెక్స్ 355 పాయింట్లు(1.35 శాతం), నిఫ్టీ 113 పాయింట్లు(1.42%) చొప్పున నష్టపోయాయి. గత మూడు వారాల్లో ఈ రెండు సూచీలు నష్టపోవడం ఇదే మొదటిసారి.
లాభ నష్టాలు...
నొముర, క్రెడిట్ సూచీ బ్రోకరజ్ సంస్థలు లుపిన్ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేయడంతో లుపిన్ షేర్ 3.5 శాతం ఎగిసి రూ. 1,990 వద్ద ముగిసింది. సెన్సెక్స్ షేర్లలో అత్యధికంగా లాభపడ్డ షేర్ ఇదే, 30 సెన్సెక్స్ షేర్లలో 16 షేర్లు లాభాల్లో ముగిశాయి. 1,442 షేర్లు లాభాల్లో, 1,245 షేర్లు నష్టాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.2,567 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ ఈక్విటీ విభాగంలో రూ.19,830 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.5,58,242 కోట్లుగా నమోదైంది.
నేడు మార్కెట్లకు సెలవు
బక్రీద్ పర్వదినం సందర్భంగా స్టాక్‌మార్కెట్‌కు నేడు(శుక్రవారం) సెలవు. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలతో పాటు ఫారెక్స్, మనీ, ప్రధాన కమోడిటీ మార్కట్లు పనిచేయవు.