కరోనా ఎంతోమంది జీవితాల్ని తలకిందులు చేసేసింది. బయటకు వెళ్లలేని పరిస్థితి. ఉన్న ఉద్యోగాలు ఊడిపోయాయి. ఆదాయ మార్గాలు అడుగంటాయి. ఈ తరుణంలో ఉన్నకొద్ది డబ్బులతో ఇంట్లో కూర్చుని ఎలాగోలా నాలుగు రూపాయలు సంపాదించడానికి చాలామంది ఎంచుకున్న ఆదాయ మార్గం స్టాక్ మార్కెట్. అది కూడా ఆప్షన్స్ ట్రేడింగ్(Option Trading). మార్కెట్‌పై సరైన నాలెడ్జ్ లేకపోవడం, అరాకొరా పరిజ్ఞానంతో అడుగుపెట్టడం వంటి కారణాలతో ఎంతోమంది ట్రేడర్లు మునిగిపోయారు. ముఖ్యంగా తక్కువ డబ్బులతోనే ఎక్కువ సంపాదించవచ్చనే దురాశ, చేసిన తప్పులే చేస్తూండడం, డబ్బు పోగొట్టుకున్నా మళ్లీ సంపాదించవచ్చులే అనే ఉద్దేశంతో అప్పు చేసి మరిన్ని డబ్బులు పెట్టడం.. అవి కూడా పోగొట్టుకోవడం..జీవితంలో కోలుకోలేని దెబ్బ తినడం.. చాలామంది ఎదుర్కొన్న, ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదే. ఇలా డబ్బులు పోగొట్టుకున్న వాళ్లలో అధిక శాతం ఆప్షన్స్ ట్రేడర్లే.
నిజంగా అంత ప్రమాదమా..?
నిజంగా ఆప్షన్స్ అంత ప్రమాదకరమా..? పెట్టే డబ్బులన్నీ పోవాల్సిందేనా..? ఈ ప్రశ్నలకు ఒకటే సమాధానం. ఆప్షన్స్ తో గేమ్ లాడొద్దు. ఆదమరిస్తే మునిగిపోతారు. మీరు ఆప్షన్స్‌లో ట్రేడ్ చేయాలి అనుకుంటే కనీస పరిజ్ఞానం ఉండి తీరాలి. ఈక్విటీ(Equity)ల్లో అయితే లాట్ కొనుగోలు చేసి లాభం వచ్చేంత వరకు కొన్ని రోజులపాటు హోల్డ్ చేసే అవకాశం ఉంటుంది. ఆప్షన్స్ అలా కాదు. ఏమాత్ర ఏమరపాటుగా ఉన్నా క్యాపిటల్ అంతా పోగొట్టుకోవాల్సిందే. అసలు ఆప్షన్స్ ట్రేడింగ్ చేయాలి అనుకునే ముందు ఏయే అంశాలు తెలిసి ఉండాలో చూద్దాం.
అండర్ లయింగ్ అసెట్
కాల్స్
పుట్స్
స్ట్రైక్ ప్రైస్
ఆప్షన్స్ చైన్
ఓపెన్ ఇంటరెస్ట్
చేంజ్ ఇన్ ఓపెన్ ఇంటరెస్ట్
వాల్యూమ్
ఇంటరెన్సిక్ వేల్యూ
డెల్టా, గామా, తీటా, వెగా, ఆర్‌హెచ్‌ఓ
అండర్ లయింగ్ అసెట్ అంటే మనం కొనాలనుకుంటున్న షేర్ విలువ. దీన్ని ఆధారం చేసుకునే ఆప్షన్స్ ట్రేడింగ్‌కు ప్రీమియంలు నిర్ధారితమవుతాయి. ఎఫ్ అండ్ ఓలో ఏది కొన్నా లాట్‌ల్లోనూ కొనుగోలు చేయాలి. ఫ్యూచర్స్(Futures)లో కూడా ఇంచుమించు షేర్ ధర అదే స్థాయిలో ఉంటుంది. ఉదాహరణకు మీరు రిలయన్స్ షేర్ కొనాలి అనుకున్నారు. ప్రస్తుత షేర్ ధర రూ.1240 దగ్గర ఉంది. ఇది అండర్ లయింగ్ అసెట్ అవుతుంది. ఫ్యూచర్స్ & ఆప్షన్స్‌లో మనం లాట్స్ రూపంలోనే షేర్లు కొనాలి అని చెప్పుకున్నాం కదా. ఒక లాట్ కొనాలి అంటే కనీసం 500 షేర్లు తీసుకోవాలి. ఈక్విటీల్లో కొనాలి అంటే దాదాపు రూ.6,20,000 పెట్టుబడి పెట్టాలి. ఇదే ఫ్యూచర్స్‌లో అయితే రూ.1,10,000 ఉంటే సరిపోతుంది. అదే ఆప్షన్స్‌లో అయితే రూ.1240 కాల్ కొనాలి. ఇది రూ.27 లో ఉంది. అంటే రూ.13,500 (రూ.27X500)ఉంటే చాలు కొనేయగలం. పెట్టుబడి తక్కువగా ఉంటుంది కాబట్టి అందరూ ఈ మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు.
అసలు సమస్య ఇదే..
తక్కువకు వస్తుందని పరిస్థితులు తెలుసుకోకుండా ఆప్షన్స్ ఎంచుకుంటే షేర్ ధర రూ.1240 దాటి పెరుగుతున్నంత సేపూ ఈ కాల్ కూడా పెరుగుతూ ఉంటుంది. తద్వారా లాభాలు సంపాదించొచ్చు. అదే షేర్ ధర పడిపోతూ ఉంటే కాల్ కూడా పడిపోతూ ఉంటుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఆప్షన్స్ కాల పరిమితి కేవలం నెల రోజులే. ఈ నెల రోజుల్లో షేర్ ధర పెరగకపోయినా, అక్కడక్కడే కదలాడుతూ ఉన్నా నెలాఖరుకి మన పెట్టుబడి సున్నా అయిపోతుంది. అంటే మొత్తం రూ.13,500 పోతాయి. షేర్ ధర కంటిన్యూగా పెరుగుతూ ఉంటే వచ్చే లాభం మాత్రం అపరిమితంగా ఉంటుంది. ఇక్కడ టైం డికే (కాల వ్యవధి తగ్గిపోతూ ఉండటం) చాలా కీలకం.
ఇప్పుడేం చేయాలి..
షేర్ ధర పడిపోతుంది అనుకున్నప్పుడు పుట్స్ కొనాలి. పైన తెలిపిన ఉదాహరణనే తీసుకుంటే.. రిలయన్స్ షేర్ ధర రూ.1240 కంటే పడిపోతుంది అని భావిస్తే రూ.1240 ఫుట్ కొనాలి. ఇది రూ.22 లో ఉంది. (500X22 = 11000) షేర్ ధర పడిపోతున్న కొద్దీ మనకొచ్చే లాభం పెరుగుతూనే ఉంటుంది. అలా కాకుండా షేర్ రూ.1240 దాటి పెరుగుతూ వెళ్లినా, అక్కడక్కడే కదలాడిన నెలాఖరుకి మన ప్రీమియం హరించుకుపోయి చివరికు జీరో అవుతుంది. నెల రోజులకు మించి ఈ ఆప్షన్స్‌ను కొనసాగించే అవకాశం ఉండదు. కాబట్టి సాధ్యమైనంత తొందరగా తగిన లాభాల్ని ఎప్పటికప్పుడు బుక్ చేసుకుంటూ బయటకు వచ్చేయడం ఉత్తమం.
ఇదీ చదవండి: ఆర్థిక మోసాలకు చెక్ పెట్టేలా పరిష్కారాలు
గుర్తు పెట్టుకోవాల్సినవి..
షేర్ ధర పెరిగేటప్పుడు పెరిగేవి కాల్స్
షేర్ ధర పడిపోయేటప్పుడు పెరిగేవి పుట్స్
ఒక కంపెనీ షేర్ ధర మనం కొనాలనుకునే ఆప్షన్స్‌కు అండర్ లయింగ్ అసెట్ అవుతుంది.
షేర్ ధరకు అనుగుణంగా మనం తీసుకునే కాల్/పుట్ (ఉదా: రూ.1230, 1240, 1250, 1260... ఇలా)నే స్ట్రైక్ ప్రైస్ అంటారు.
వీటికి తోడు ఆప్షన్స్ చైన్, అందులో ఓపెన్ ఇంటరెస్ట్, ఓపెన్ ఇంటరెస్ట్‌లో చోటు చేసుకునే మార్పులు, వాల్యూమ్, ఇంటరెన్సిక్ వ్యాల్యూ వంటివి ఆప్షన్స్ ట్రేడింగ్‌లో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవేగాక ఇన్ ది మనీ (ఐటీఎమ్), ఎట్ ది మనీ (ATM), అవుట్ అఫ్ ది మనీ (ఓటీఎం) ఆప్షన్స్ ట్రేడింగ్‌లో ఈ మూడింటి గురించి తదుపరి ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకుందాం.
- బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు
Comments
Please login to add a commentAdd a comment