
పాలసీ.. బ్లూచిప్స్ ఫలితాలు కీలకం!
న్యూఢిల్లీ: ఆర్‌బీఐ పాలసీ, కీలక కంపెనీల క్యూ3 ఫలితాలు ఈ వారం మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, ప్రపంచ స్టాక్ మార్కెట్ల పోకడ, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం, డాలర్‌తో రూపాయి కదలికలు.. తదితర అంశాల ప్రభావం కూడా ఉంటుందని వారంటున్నారు. ఈ నెల 8న(బుధవారం) జరిగే ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ(మోనిటరీ పాలసీ కమిటీ–ఎంపీసీ) రేట్లను తగ్గించాలా, వద్దా అనే విషయమై నిర్ణయం తీసుకుంటుంది. ఆర్‌బీఐ పాలసీతో పాటు ఈ వారంలో వెలువడే కంపెనీల ఆర్థిక ఫలితాలపై కూడా మార్కెట్ గమనం ఆధారపడి ఉంటుందిన ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ డైరెక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో జరిగే పరిణామాల ప్రభావం కూడా మార్కెట్‌పై ఉంటుందని పేర్కొన్నారు. పెద్ద కరెన్సీ నోట్ల ప్రభావం ఎలా ఉంటుందో నిర్ధారించడానికి ఈ వారంలో వెలువడే కొన్ని కంపెనీల ఆర్థిక ఫలితాలు ముఖ్యమని కోటక్ సెక్యూరిటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీపేన్ షా చెప్పారు. పలు కీలక కంపెనీలు తమ క్యూ3 ఫలితాలను వెల్లడించాల్సి ఉందని, ఈ ఫలితాలను బట్టి స్టాక్ సూచీల కదలికలు ఉంటాయని అమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ రీసెర్చ్ హెడ్ అబ్నిశ్ కుమార్ సుధాంశు చెప్పారు. ఈ వారంలో టాటా స్టీల్, భెల్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సిప్లా, హీరో మోటొకార్ప్, ఎన్‌టీపీసీ, లుపిన్, మహీంద్రా అండ్ మహీంద్రా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా పవర్‌లు తమ తమ క్యూ3 ఆర్థిక ఫలితాలను వెల్లడిస్తాయి. పంజాబ్, గోవా, ఉత్తర ప్రదేశ్, ఉత్తరఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల ట్రెండ్.. మార్కెట్ ఎటు కదలాలో నిర్దేశిస్తుందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
10న ఐఐపీ గణాంకాలు..,
ఈ నెల 10న(శుక్రవారం) గత ఏడాది డిసెంబర్‌కు సంబంధించి పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) గణాంకాలు వెలువడుతాయి.
మళ్లీ విదేశీ కొనుగోళ్ల జోరు...
గత నాలుగు నెలలుగా అమ్మకాలు జరుపుతున్న విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో కొనుగోళ్లు మొదలుపెట్టారు. ఈ నెలలో ఇప్పటివరకూ(మూడు ట్రేడింగ్ సెషన్లలో) విదేశీ ఇన్వెస్టర్లు మన క్యాపిటల్ మార్కెట్లో నికరంగా రూ.2,300 కోట్లు పెట్టుబడులు పెట్టారు. స్టాక్ మార్కెట్లో రూ.1,246 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.1,098 కోట్ల వరకూ ఇన్వెస్ట్ చేశారు. విదేశీ ఇన్వెస్టర్లకు సంబంధించి పన్ను అంశాల్లో ఊరట లభించడమే దీనికి కారణమని నిపుణులంటున్నారు.