ఆర్‌బీఐ పాలసీ, ఐఐపీ డేటాలతో తీవ్ర హెచ్చుతగ్గులు
న్యూఢిల్లీ: రిజర్వుబ్యాంక్ వెల్లడించబోయే పరపతి విధానం, పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) గణాంకాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఈ వారం మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని, ఈ మూడు అంశాలు మార్కెట్‌ను తీవ్ర హెచ్చుతగ్గులకు గురిచేయవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 7న వెలువడబోయే ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష మార్కెట్‌కు కీలకమని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ హితేశ్ అగర్వాల్ అన్నారు. ఆర్‌బీఐ పాలసీ తర్వాత ఏప్రిల్ 10న వెలువడబోయే ఫిబ్రవరి పారిశ్రామికోత్పత్తి గణాంకాలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను శాసించవచ్చన్నది అంచనా.
ఈ రెండు ఘటనలతో వడ్డీ రేట్ల ప్రభావిత రంగాలైన బ్యాంకింగ్, ఆటోమొబైల్, రియల్టీలకు చెందిన షేర్లు భారీ హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని రిలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం అమెరికాలో వెలువడిన జాబ్స్ డేటాకు తొలుత ఈ సోమవారం మన మార్కెట్లు స్పందిస్తాయి. మార్చి నెలలో అమెరికాలో ఉద్యోగాల సంఖ్య 1.5 లక్షలకు తగ్గినట్లు డేటా వెలువడింది. ఈ సంఖ్య అక్కడి అంచనాలకంటే బాగా తక్కువ. ఆ దేశపు ఆర్థిక వ్యవస్థ నెమ్మదించినట్లు ఈ డేటా సూచిస్తోంది.
తదుపరి ట్రిగ్గర్ కార్పొరేట్ ఫలితాలు.
అటు తర్వాత మార్కెట్ ట్రెండ్‌ను కార్పొరేట్ల క్యూ4 ఆర్థిక ఫలితాలు నిర్దేశిస్తాయి. 2015 మార్చితో ముగిసే త్రైమాసికపు ఆర్థిక ఫలితాలకు ఐటీ దిగ్గజం టీసీఎస్ ఏప్రిల్ 16న శ్రీకారం చుడుతుంది. మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ ఏప్రిల్ 24న ఫలితాలు వెల్లడిస్తుంది. ఇటీవల వరుసగా కేంద్ర బడ్జెట్, అమెరికా ఫెడరల్ రిజర్వ్ కమిటీ సమావేశం, ఆర్‌బీఐ వడ్డీ రేట్ల కోత వంటి అంశాల తర్వాత ర్యాలీకి అవసరమైన ట్రిగ్గర్ల కోసం మార్కెట్ వేచి చూస్తున్నదని అషికా స్టాక్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ పరాస్ బోథురా చెప్పారు. గత వారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 2.91 శాతం ర్యాలీ జరిపింది.