ఎకానమీ మిశ్రమ గణాంకాలు
నాలుగు నెలల కనిష్టానికి ఫిబ్రవరి రిటైల్ ధరలు
3.8 శాతానికి పరిమితమైన జనవరి పారిశ్రామిక ఉత్పత్తి
న్యూఢిల్లీ: భారత్ స్థూల ఆర్థిక రంగానికి సంబంధించి మంగళవారం మిశ్రమ ఫలితాలు వెలువడ్డాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ కీలక రెపో రేటు (ప్రస్తుతం 6.5 శాతం) నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 5.09 శాతంగా నమోదయ్యింది. గడచిన నాలుగు నెలల్లో ఇంత తక్కువ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న వాస్తవిక లక్ష్యానికి (ప్లస్ 2 లేదా మైనస్ 2తో 4 శాతం) ఇంకా అధికంగా ఉన్నప్పటికీ.. నాలుగు నెలల కనిష్టానికి సూచీ దిగిరావడం గమనార్హం.
అలాగే గరిష్ట లక్ష్యానికన్నా (6 శాతం) దిగువన ఉండడం హర్షణీయ పరిణామం. కాగా, జనవరిలో 8.3 శాతంగా ఉన్న ఫుడ్ బాస్కెట్ ధర, సమీక్షా నెల ఫిబ్రవరిలో 8.66 శాతానికి ఎగసింది. ఇక పారిశ్రామిక ఉత్పత్తికి సంబంధించిన సూచీ (ఐఐపీ) వృద్ధి 2024 జనవరిలో 3.8 శాతానికి మందగించింది. 2023 ఇదే నెలలో ఈ వృద్ధి రేటు 5.8 శాతంగా ఉంది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో 70 శాతం వెయిటేజ్ ఉన్న తయారీసహా మైనింగ్, విద్యుత్ రంగాలు పేలవ పనితనాన్ని ప్రదర్శించినట్లు గణాంకాలు ,కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ విడుదల చేసిన లెక్కలు తెలిపాయి. 2023 డిసెంబర్‌లో ఐఐపీ వృద్ధి రేటు 4.2 శాతంకాగా, నవంబర్‌లో 2.4 శాతం.
Comments
Please login to add a commentAdd a comment