న్యూఢిల్లీ: వడ్డీరేట్లపై ఆర్‌బీఐ వెల్లడించే పాలసీ నిర్ణయం, స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలు ఈ వారం మార్కెట్ల గమనాన్ని నిర్దేశిస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) ట్రేడింగ్ కార్యకలాపాలపై కూడా ఇన్వెస్టర్లు దృష్టిసారిస్తారని పేర్కొన్నారు. కాగా, బుధవారం మహావీర్ జయంతి అలాగే శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా మార్కెట్లు పని చేయవు. ట్రేడింగ్ మూడు రోజులకు మాత్రమే పరిమితం కానుంది.
ఆర్‌బీఐ పాలసీపై ఫోకస్...
ఆర్‌బీఐ పాలసీ నిర్ణయం ఏప్రిల్ 6న వెలువడనుంది. దీనిపై ఈ వారం మార్కెట్ ప్రధానంగా దృష్టి పెడుతుందని స్వస్తికా ఇన్వెస్ట్‌మెంట్ సీనియర్ టెక్నికల్ ఎనలిస్ట్ ప్రవేశ్ గౌర్ పేర్కొన్నారు. మళ్లీ నికర కొనుగోలుదారులుగా మారుతున్న ఎఫ్‌పీఐల పెట్టుబడులపై అలాగే దేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (డీఐఐ)పై కూడా ఫోకస్ ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇక గతేడాది రికార్డు స్థాయి వాహన విక్రయాలను సాధించిన ఆటోమొబైల్ రంగంపైగా మార్కెట్ దృష్టి సారిస్తుందన్నారు. ఈసారి ఆర్‌బీఐ రెపో రేటును పావు శాతం పెంచే అవకాశం ఉందని బ్యాంకింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
పీఎంఐ గణాంకాలు..
ఆర్‌బీఐ చర్యలతో పాటు ఏప్రిల్3న ఎస్‌అండ్‌పీ గ్లోబల్ తయారీ రంగ పీఎంఐ గణాంకాలు, ఏప్రిల్ 5న సేవల రంగ పీఎంఐ గణాంకాలు వెలువడనున్నాయి. ‘దేశీయ అంశాలకు తోడు ప్రపంచ పరిణామాలు, విదేశీ నిధుల ప్రవాహ ధోరణులు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపుతాయి’ అని రెలిగేర్ బ్రోకింగ్ టెక్నికల్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా వ్యాఖ్యానించారు. సమీప కాలంలో చూస్తే మార్కెట్ దృష్టి అంతా ఆర్‌బీఐ పాలసీపైనే ఉంటుందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు. ఆర్‌బీఐ నిర్ణయం, పీఎంఐ డేటా కోసం ఇన్వెస్టర్లు వేచిచూస్తున్నారని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రీసెర్చ్‌హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు.
గతవారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,462 పాయింట్లు (2.54%) దూసుకెళ్లింది. శుక్రవారం ఒక్కరోజే 1,031 పాయింట్లు ఎగబాకడం విశేషం. బ్యాంకింగ్ సంక్షోభ భయాలు నెమ్మదిగా సద్దుమణుగుతుండటంతో ఆసియా, యూరప్, అమెరికా సూచీలు సైతం గత శుక్రవారం సానుకూలంగా ముగిశాయి.
ఆర్‌బీఐ పాలసీ, ప్రపంచ పరిణామాలు కీలకం
Published Mon, Apr 3 2023 4:35 AM | Last Updated on Mon, Apr 3 2023 4:35 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment