ముంబై: రానున్న ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో జీడీపీ 7.5 శాతం స్థాయిలో వృద్ధి చెందుతుందని, దీనికి తక్కువ బేస్ కారణమని, ఆ తర్వాతి ఆరు నెలల్లో 7 శాతానికి తగ్గిపోతుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్‌లించ్ పేర్కొంది. వృద్ధి రేటు పుంజుకున్నా గానీ, వాస్తవ సామర్థ్యం కంటే ఒక శాతం తక్కువగానే ఉంటుందని అంచనా వేసింది.
‘‘2017–18లో నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావాలతో వృద్ధి కనిష్టానికి (తక్కువ బేస్) చేరినందున 2018–19 ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో జీడీపీ 7.5 శాతానికి పుంజుకుంటుంది. అయితే, రెండో అర్ధభాగంలో 7 శాతానికి తగ్గుతుంది. అయినప్పటికీ పాత జీడీపీ సిరీస్ ఆధారంగా మా అంచనాల కంటే ఒక శాతం తక్కువే’’ అని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్‌లించ్ పేర్కొంది.
సేవల రంగం స్పీడ్ జనవరిలో 3 నెలల గరిష్టం: పీఎంఐ
దేశంలో సేవల రంగం జనవరి నెలలో మంచి పనితీరును కనబరిచింది. నికాయ్ సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ ప్రకారం, జనవరిలో సూచీ 51.7గా నమోదయ్యింది. గడచిన మూడు నెలల్లో సూచీ ఈ స్థాయిలో నమోదు కావటం ఇదే తొలిసారి. కొత్త ఆర్డర్లు పెరగడం దీనికి కారణమని సర్వే పేర్కొంది. డిసెంబర్‌లో సూచీ 50.9గా ఉంది. నవంబర్‌లో క్షీణతలో 48.5 వద్ద సూచీ ఉంది. నికాయ్ సూచీ 50 పైన ఉంటే వృద్ధిగా ఆ దిగువన క్షీణతగా భావించడం జరుగుతుంది.
రేపు ఆర్‌బీఐ పాలసీ నిర్ణయం
ధరల పెరుగుదల రిస్క్ నేపథ్యంలో ఆర్‌బీఐ రేట్ల కోత నిర్ణయం తీసుకుంటుందన్న అంచనాలు లేవు. ఈ నెల 7న జరిగే సమావేశంలో యథాతథ స్థితినే కొనసాగిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. గత డిసెంబర్‌లో ద్రవ్యోల్బణం 5.2 శాతానికి చేరగా, జనవరిలో ఇది 5 శాతానికి చల్లబడుతుందని భావిస్తున్నారు. మధ్యకాలానికి ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయిలో కొనసాగించాలన్నది ఆర్‌బీఐ, కేంద్రలక్ష్యం.
Comments
Please login to add a commentAdd a comment