రాజన్‌వైపు మార్కెట్ చూపు
ఆర్‌బీఐ పాలసీ నిర్ణయం ఆధారంగా ట్రెండ్
* నిపుణుల అంచనా
న్యూఢిల్లీ: సెప్టెంబర్ 29నాటి రిజర్వుబ్యాంక్ ద్రవ్య విధాన సమీక్ష వైపు మార్కెట్ చూపు వుందని, వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ గవర్నర్ తీసుకోబోయే నిర్ణయంపై ఆధారపడి ఈ వారం మార్కెట్ ట్రెండ్ వుంటుందని విశ్లేషకులు చెప్పారు. కీలక రెపో రేటును పావుశాతం తగ్గించవచ్చన్న మెజారిటీ అంచనాలు మార్కెట్లో వున్నాయని రిలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ అన్నారు.
ఆగస్టు నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.66 శాతం కనిష్టస్థాయికి తగ్గడం, జీడీపీ వృద్ధి 7 శాతానికి పరిమితం కావడం వంటి అంశాలవల్ల రేట్ల కోత అంచనాలు ఊపందుకున్నాయని ఆయన వివరించారు. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ గతవారం వడ్డీ రేట్ల పెంపు నిర్ణయాన్ని వాయిదావేయడం, స్థానికంగా ద్రవ్యోల్బణం తగ్గడం వంటి అంశాలతో ఇక్కడ ఆర్‌బీఐ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు పెరిగాయని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ హితేశ్ అగర్వాల్ అన్నారు.
ఆర్‌బీఐ పాలసీతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, రూపాయి మారకపు విలువ హెచ్చుతగ్గులు మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయని క్యాపిటల్‌వయా రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా చెప్పారు. గాంధీ జయంతి కారణంగా వచ్చే శుక్రవారం మార్కెట్లకు సెలవు. దాంతో ఈ వారం మార్కెట్లో ట్రేడింగ్ నాలుగురోజులకే పరిమితమవుతుంది. కాగా, సెప్టెంబర్ నెలలో ఇప్పటివరకూ దేశీయ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు నికరంగా రూ. 6,000 కోట్లు వెనక్కు తీసుకున్నారు. గత నెలలో విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ మార్కెట్ నుంచి రికార్డుస్థాయిలో రూ. 17,000 కోట్లకుపైగా పెట్టుబడుల్ని ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే.
గతవారం మార్కెట్..
గతవారం యూరప్ మార్కెట్లు బాగా క్షీణించడంతో ఇక్కడ బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సిటివ్ ఇండెక్స్ 355 పాయింట్లు తగ్గింది. చివరకు 25,863 పాయింట్ల వద్ద ముగిసింది.