ఆర్‌బీఐ పాలసీ ఈ వారం మార్కెట్‌కు కీలకం కానున్నదని నిపుణులంటున్నారు. ఈ వారంలో వెలువడే తయారీ, సేవల రంగాల గణాంకాలు, ప్రపంచ మార్కెట్ల పోకడ, విదేశీ, దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, డాలర్‌తో రూపాయి మారకం కదలికలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం, ఐసీఐసీఐ బ్యాంక్ సంక్షోభం తదతర అంశాలు స్టాక్ మార్కెట్‌పై తగిన ప్రభావం చూపుతాయని వారంటున్నారు.
ఆర్‌బీఐ పరపతి ద్రవ్య విధాన కమిటీ సమావేశం ఈ నెల 4న ప్రారంభమై, 5న ముగుస్తుంది. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి ద్రవ్య పాలసీని 5వ తేదీన ఆర్‌బీఐ ప్రకటిస్తుంది. తయారీ, సేవల రంగాల పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎమ్‌ఐ) గణాంకాలు వెలువడతాయి. నేడు తయారీ రంగం, బుధవారం సేవల రంగం పీఎమ్‌ఐ గణాంకాలు వస్తాయి. ఇక గత నెలకు సంబంధించిన వాహన విక్రయ వివరాల వెల్లడి కారణంగా వాహన షేర్లు వెలుగులోకి రావచ్చు.
మెల్లగా పుంజుకోనున్న మార్కెట్..!
ఈ నెలలో మార్కెట్ మెల్లమెల్లగా పుంజుకోగలదని శామ్‌కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోదీ చెప్పారు. కంపెనీల ఆర్థిక ఫలితాలు బాగా ఉంటాయనే అంచనాలతో మార్కెట్ ప్రస్తుతమున్న స్థాయిల నుంచి పెరిగే అవకాశాలున్నాయని వివరించారు. ఇక నిఫ్టీ సూచీలో అంబుజా సిమెంట్స్, అరబిందో ఫార్మా, బాష్ షేర్ల స్థానాల్లో బజాజ్ ఫిన్‌సర్వ్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, టైటాన్ కంపెనీలను చేరుస్తున్నారు. నేటి నుంచే ఈ మార్పులు అమల్లోకి వస్తాయి.
సగానికి తగ్గిన విదేశీ ఈక్విటీ పెట్టుబడులు...
విదేశీ ఇన్వెస్టర్ల ఈక్విటీ పెట్టుబడులు గత ఆర్థిక సంవత్సరంలో బాగా తగ్గాయి. మన షేర్ల వేల్యూయేషన్‌లు అధికంగా ఉండడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ అంచనాల కంటే త్వరితంగానే రేట్ల పెంపు చేపట్టవచ్చన్న అంచనాల కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు సగానికి తగ్గాయి. 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.55,700 కోట్లుగా ఉన్న విదేశీ పెట్టుబడులు గత ఆర్థిక సంవత్సరంలో రూ.26,000 కోట్లకు పడిపోయాయి.
2015–16 ఆర్థిక సంవత్సరంలో మాత్రం విదేశీ ఇన్వెస్టర్లు రూ.14,000 కోట్ల మేర పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరంలో డెట్ మార్కెట్లో మాత్రం పెట్టుబడులు జోరుగా వచ్చాయి. 2016–17లో డెట్ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు రూ.7,300 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకోగా, గత ఆర్థిక సంవత్సరంలో మాత్రం రూ.1.2 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు.
రూపాయి నిలకడగా ఉండడం, ద్రవ్యోల్బణ పరిగణనాంతర రాబడులు అధికంగా ఉండడం దీనికి ప్రధాన కారణాలని నిపుణులంటున్నారు. మొత్తం మీద గత ఆర్థిక సంవత్సరంలో మన క్యాపిటల్ మార్కెట్లో (ఈక్విటీ, డెట్ మార్కెట్లు కలిపి)విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు నికరంగా 1.45 లక్షల కోట్లుగా ఉన్నాయి. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఇదే అత్యుత్తమ నికర పెట్టుబడులు.
మన క్యాపిటల్ మార్కెట్లోకి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులను అనుమితించినప్పటి (1992) నుంచి చూస్తే, మొత్తం విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఈక్విటీ మార్కెట్లోకి రూ.8.86 లక్షల కోట్లకు, డెట్ మార్కెట్లోకి రూ.4.2 లక్షల కోట్లకు, మొత్తం క్యాపిటల్ మార్కెట్లోకి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు రూ.13 లక్షల కోట్లకు చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment