ఆర్‌బీఐ పాలసీ, గణాంకాలు కీలకం | RBI policy and statistics are crucial | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ పాలసీ, గణాంకాలు కీలకం

Published Mon, Oct 2 2017 2:40 AM | Last Updated on Mon, Oct 2 2017 2:40 AM

RBI policy and statistics are crucial

ఆర్‌బీఐ ద్రవ్య, పరపతి పాలసీ, తయారీ, సేవల రంగ గణాంకాలు ఈ వారం మార్కెట్‌పై తగినంత ప్రభావాన్ని చూపుతాయని మార్కెట్‌ విశ్లేషకులంటున్నారు. వీటితో పాటు ప్రపంచ మార్కెట్ల పోకడ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం, డాలర్‌తో రూపాయి మారకం కదలికలు.. తదితర అంశాలు కూడా ఈ వారం మార్కెట్‌పై తగినంతగా ప్రభావం చూపుతాయని నిపుణులంటున్నారు. నేడు (సోమవారం) గాంధీ జయంతి సందర్భంగా స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితం కానున్నది.  

రేట్ల కోత ఉండకపోవచ్చు..!
ఆర్‌బీఐ రేట్ల కోత ఉండకపోవచ్చని పలువురు అంచనా వేస్తున్నారు. ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశం ఈ నెల 3(మంగళ వారం) ప్రారంభమై. 4న(బుధవారం) ముగియనున్నది. ఈసారి రేట్ల కోత అవకాశాల్లేవని నిపుణులు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరగడం, రుణాలకు డిమాండ్‌ బలహీనంగా ఉండడం వల్ల రేట్ల విషయమై యథాతథ స్థితి కొనసాగవచ్చని వారంటున్నారు. రెపో రేటు6 శాతం స్థాయిలో ఉందని, మరింత తగ్గించడానికి అవకాశాలున్నాయని, అయితే రానున్న నెలల్లో రిటైల్‌ ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలుండటంతో రేట్ల కోత ఉండకపోవచ్చని ఇక్రా ఎండీ నరేశ్‌ టక్కర్‌ చెప్పారు. కాగా ఈ ఏడాది జూలైలో 2.36 శాతంగా ఉన్న రిటైల్‌ ద్రవ్యోల్బణం ఈ ఏడాది ఆగస్టులో 5 నెలల ›గరిష్ట స్థాయి, 3.36 శాతానికి పెరిగింది.  

ముందుంది మరింత పతనం...!  
స్టాక్‌ మార్కెట్‌పై పలు అంశాలు ప్రభావం చూపుతున్నాయని, మరింత క్షీణత తప్పదని రెలిగేర్‌ సెక్యూరిటీస్‌ ప్రెసిడెంట్‌(రిటైల్‌ డిస్ట్రిబ్యూషన్‌) జయంత్‌ మాంగ్లిక్‌ పేర్కొన్నారు. అయితే పతనం నెమ్మదిగా ఉంటుందని, అయితే ట్రేడర్లకు మాత్రం మరింత దెబ్బ తప్పదని వివరించారు. మార్కెట్‌ పెరిగినప్పుడల్లా విక్రయాలు జరపడం మేలని, తాత్కాలిక ట్రేడింగ్‌ కోసం సూచీ ప్రధాన షేర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

దేశీయంగా ఆర్థిక సంబంధిత గణాంకాలు ఆశావహంగా లేవని, జీఎస్‌టీ సమస్యలు మరికొంత కాలం కొనసాగుతాయని ఫలితంగా స్టాక్‌ సూచీల కన్సాలిడేషన్‌ మరి కొంత కాలం కొనసాగుతుందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. కమోడిటీ ధరలు తక్కువగా ఉండడం, ద్రవ్యోల్బణం కూడా తక్కువ స్థాయిలో ఉండడం వల్ల ఆర్థిక వ్యవస్థ బాగానే ఉన్నట్లు ఇప్పటిదాకా అనిపించిందని, ఇక నుంచి పరిస్థితులు తల్లకిందులు కాబోతున్నాయని ఆయన హెచ్చరిస్తున్నారు.  మార్కెట్‌ పడిన ప్రతిసారీ కొనుగోళ్లు చేయాలని, పోర్ట్‌ఫోలియోను రీబ్యాలన్స్‌ చేసుకోవాలని ఐసీఐసీఐ డైరెక్ట్‌డాట్‌కామ్‌ రీసెర్చ్‌ హెడ్‌ ధర్మేశ్‌ షా పేర్కొన్నారు. అక్టోబర్‌ రెండో వారం నుంచి మొదలయ్యే సెప్టెంబర్‌ క్వార్టర్‌ ఫలితాలు బాగా ఉంటేనే మార్కెట్‌ కోలుకుంటుందని విశ్లేషకులంటున్నారు.  

గణాంకాలు..
తయారీ రంగానికి సంబంధించిన నికాయ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌(పీఎంఐ) గణాంకాలు మంగళవారం(3న) వస్తాయి. సేవల రంగ పీఎంఐ గణాంకాలు 5న (గురువారం) వెల్లడవుతాయి. గత నెలలో వాహన విక్రయాలు బాగా ఉండటంతో వాహన షేర్లు ఎగబాకే అవకాశాలున్నాయి. అమ్మకాలు బాగా ఉంటాయనే అంచనాలతోనే గత శుక్రవారం వాహన సూచీ 1% లాభపడింది.  

కొనసాగుతున్న విదేశీ విక్రయాలు..
విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగుతున్నాయి. గత వారంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ.9,079 కోట్ల విలువైన పెట్టుబడులను ఈక్విటీ మార్కెట్‌ నుంచి వెనక్కి తీసుకున్నారు. ఈ నెల 19 నుంచి విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్‌ మార్కెట్లో విక్రయాలు కొనసాగిస్తూనే ఉన్నారు. కంపెనీల క్యూ2 ఫలితాలు బాగా ఉంటే మళ్లీ విదేశీ ఇన్వెస్టర్లు భారీగా మన మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేసే అవకాశాలున్నాయని అరిహంత్‌ క్యాపిటల్‌ మార్కెట్స్‌ హోల్‌టైమ్‌ డైరెక్టర్‌ అనితా గాంధీ చెప్పారు.

మంగళవారం ఎస్‌బీఐ లైఫ్‌ లిస్టింగ్‌..
ఈ నెల 3న(మంగళవారం) ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ షేర్లు స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ కానున్నాయి. ఈ ఐపీఓకు ఇష్యూ ధరగా కంపెనీ రూ.700ను నిర్ణయించింది. గత నెల 20–22 మధ్య వచ్చిన ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.8,400 కోట్లు సమీకరించింది. రూ.1,157 కోట్ల గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌ ఐపీఓ ఈ నెల 4న ప్రారంభం కానున్నది. రూ.450–460 ధర శ్రేణిగల ఈ ఐపీఓ ఈ నెల 6న(శుక్రవారం) ముగియనున్నది. ఇక ఈ నెల 6న ఆరంభమయ్యే మాస్‌ ఫైనాన్షియల్‌సర్వీసెస్‌ ఐపీఓ ఈ నెల 10న ముగుస్తుంది. ఈ ఐపీఓ ప్రైస్‌బాండ్‌ రూ.456–459 గా ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement