వడ్డీ రేట్ల కోతకు చాన్స్..!
పెట్టుబడులకు ఊతమిచ్చేలా
ఆర్‌బీఐ పాలసీ నిర్ణయం ఉండొచ్చు..
రేపటి పరపతి విధాన సమీక్షపై బ్యాంకర్ల అంచనా
న్యూఢిల్లీ: ఆర్‌బీఐ రేపు(మంగళవారం) చేపట్టనున్న పరపతి విధాన సమీక్షలో కీలక పాలసీ వడ్డీరేటు(రెపో)ను తగ్గించే అవకాశాలున్నాయని బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం దిగిరావడంతో పెట్టుబడులకు ఊతమిచ్చి.. తద్వారా ఆర్థిక వ్యవస్థను మరింత జోరందుకునేలా చేయడంపై ఆర్‌బీఐ దృష్టిపెట్టొచ్చనేది వారి అభిప్రాయం. గత కొద్ది నెలలుగా మైనస్‌లోనే కొనసాగుతున్న టోకు ధరల ద్రవ్యోల్బణం... ఏప్రిల్‌లో కొత్త కనిష్టాన్ని(మైనస్ 2.65%) తాకిన సంగతి తెలిసిందే.
ఇక రిటైల్ ద్రవ్యోల్బణం కూడా క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఏప్రిల్ నెలలో 4.87 శాతానికి తగ్గింది. మరోపక్క, ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో(2014-15) ద్రవ్యలోటును జీడీపీలో 4 శాతానికి కట్టడి చేయడంతో పాలసీ సమీక్షలో ఆర్‌బీఐ రేట్ల తగ్గింపునకు ఆస్కారం కలిగించే అంశమని బ్యాంకింగ్ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం రెపో రేటు 7.5 శాతం, రివర్స్ రెపో 6.5 శాతం, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్) 4 శాతంగా ఉన్నాయి. గత సమీక్ష(ఏప్రిల్7న)లో ఆర్‌బీఐ కీలక రేట్లను యథాతథంగానే కొనసాగించిన విషయం విదితమే.
సీఆర్‌ఆర్ తగ్గిస్తే బెటర్..
ద్రవ్యోల్బణం మైనస్‌లో కొనసాగుతున్న నేపథ్యంలో పాలసీ రేట్లలో మార్పులకు అవకాశాలున్నాయని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) చైర్మన్ టీఎం భాసిన్ పేర్కొన్నారు. యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ, సీఈఓ పి. శ్రీనివాస్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘రిటైల్ ద్రవ్యోల్బణం కూడా ఇప్పుడు చాలా తగ్గింది. దీంతో రెపో రేటు పావు శాతం తగ్గించేందుకు వీలుంది. వృద్ధికి చేయూతనివ్వాలంటే ఆర్‌బీఐ సానుకూల నిర్ణయం అవసరం. ఇప్పుడు గనుక వడ్డీరేట్లను తగ్గించకపోతే.. ఎల్‌నినో ప్రభావంవల్ల వర్షాలు సరిగ్గా కురవని పక్షంలో రానున్న నెలల్లో రేట్లకోత కష్టతరంగా మారొచ్చు’ అని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.
కాగా, సీఆర్‌ఆర్ కోత వల్ల కూడా రుణాలపై వడ్డీరేట్లను తగ్గించేందుకు బ్యాంకులు ముందుకొచ్చే అవకాశం ఉందని భాసిన్ చెప్పారు. ‘ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థలో అవసరానికి మించి ద్రవ్యలభ్యత(లిక్విడిటీ) ఉంది. రుణ వృద్ధి తగినంతగా లేకపోవడమే దీనికి కారణం. బ్యాంకుల నుంచి ఇప్పుడు మేం స్వల్పకాలిక రుణాలను తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో రెపో విండో(సదుపాయం) వల్ల బ్యాంకులకు అదనపు ప్రయోజనం ఉండదు. సీఆర్‌ఆర్ తగ్గింపు ద్వారానే బ్యాంకుల వ్యయం దిగొచ్చేందుకు దోహదం చేస్తుంది. కనీసం సీఆర్‌ఆర్‌ను అర శాతం తగ్గించాలనేది మా విజ్ఞప్తి. దీనివల్ల వ్యవస్థలోకి రూ.40 వేల కోట్లు వచ్చే అవకాశం ఉంటుంది’ అని భాసిన్ పేర్కొన్నారు. రానున్న కాలంలో ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే అవకాశాలుండటంతో పావు శాతానికి మించి ఆర్‌బీఐ రేట్ల కోతకు ఆస్కారం లేదని బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్, ఎండీ వీఆర్ అయ్యర్ అభిప్రాయపడ్డారు.