ఇకపైనా ఫలితాలే కీలకం
న్యూఢిల్లీ: ఇప్పటికే ద్రవ్యోల్బణం, ఐఐపీ వంటి ఆర్థిక గణాంకాలతోపాటు, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఆర్‌ఐఎల్ వంటి బ్లూచిప్స్ ఫలితాలు వెలువడ్డ నేపథ్యంలో ఇకపై మార్కెట్లను క్యూ3 ఫలితాలే నడిపిస్తాయని విశ్లేషకులు పేర్కొన్నారు. అక్టోబర్-డిసెంబర్ కాలానికి(క్యూ3) మార్టిగేజ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ, క్యాపిటల్ గూడ్స్ దిగ్గజం ఎల్‌అండ్‌టీ పనితీరు ఈ వారంలో వెల్లడికానుంది.
కాగా, ఈ నెల 28న రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) పరపతి సమీక్షను చేపట్టనుంది. ఈ అంశాల కారణంగా ఇన్వెస్టర్లు అప్రమత్తతతో వ్యవహరించే అవకాశమున్నదని నిపుణులు పేర్కొన్నారు. గత వారం మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ గత నాలుగు వారాల్లోలేని విధంగా 305 పాయింట్లు(1.5%) ఎగసి 21,064 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వారం కొంతమేర లాభాల స్వీకరణ కోసం ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టే అవకాశాలున్నాయనేది కొందరు నిపుణుల అభిప్రాయం.
6,350 వద్ద అమ్మకాలు!
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) పెట్టుబడులు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు ఈ వారం కీలకంగా నిలవనున్నాయని పలువురు నిపుణులు పేర్కొన్నారు. వీటికితోడు అంతర్జాతీయ సంకేతాలు కూడా సెంటిమెంట్‌పై ప్రభావాన్ని చూపుతాయని తెలిపారు. ఇకపై ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు, బ్యాంకింగ్, ఫార్మా, క్యాపిటల్ గూడ్స్ రంగాల పనితీరును నిశితంగా గమనించాల్సి ఉన్నదని రెలిగేర్ సెక్యూరిటీస్‌కు చెందిన రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ వివరించారు. మార్కెట్లు స్థిరీకరణ దిశలో కదులుతాయని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.
ఎన్‌ఎస్‌ఈ ప్రధాన సూచీ నిఫ్టీకి 6,350 పాయింట్ల వద్ద అమ్మకాల ఒత్తిడి(రెసిస్టెన్స్) ఎదురుకావచ్చునని అభిప్రాయపడ్డారు. అయితే 6,150-6,100 పాయింట్ల స్థాయిలో నిఫ్టీకి పటిష్ట మద్దతు లభించవచ్చునని తెలిపారు. ఈ స్థాయిలో కొనుగోళ్లు పుంజుకుంటాయని చెప్పారు. సాంకేతికంగా నిఫ్టీ బుల్లిష్ ధోరణిని కనబరుస్తున్నదని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా పేర్కొన్నారు. 6,360 స్థాయి వద్ద ఎదురయ్యే అమ్మకాల ఒత్తిడి(రెసిస్టెన్స్)ని తట్టుకుని ముందుకెళ్తే మరింత ఊపందుకుంటుందని అంచనా వేశారు.
ఈ నెలాఖరున ఆర్‌బీఐ పాలసీ సమీక్ష నేపథ్యంలో మార్కెట్లలో అప్రమత్తత కనిపిస్తుందని వెరాసిటీ బ్రోకింగ్ రీసెర్చ్ హెడ్ జిగ్నేష్ చౌదరి చెప్పారు. గత పాలసీ సమీక్షలో రెపో రేటును యథాతథంగా కొనసాగించిన ఆర్‌బీఐ ద్రవ్యోల్బణం ఉపశమనంతో ఇదే స్థితిని కొనసాగించే అవకాశమున్నదని అభిప్రాయపడ్డారు. ఈ నెల 28 నుంచి అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్వహించనున్న రెండు రోజుల సమావేశంపై ట్రేడర్లు దృష్టి పెడతారని నిపుణులు పేర్కొన్నారు.
ఈ వారంలో ప్రధాన ఫలితాలు
హెచ్‌డీఎఫ్‌సీ
ఎల్ అండ్ టీ
అల్ట్రాటెక్ సిమెంట్
కెయిర్న్ ఇండియా
గ్లెన్‌మార్క్ ఫార్మా
అశోక్ లేలాండ్
సెన్సెక్స్ షేర్లలో ఎఫ్‌ఐఐల జోరు
మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్‌కు ప్రాతినిధ్యం వహించే అత్యధిక శాతం కంపెనీలలో ఎఫ్‌ఐఐల పెట్టుబడులు పుంజుకున్నాయి. క్యూ3లో 21 సెన్సెక్స్ షేర్లలో విదేశీ పెట్టుబడుల జోరు పెరిగింది. సెన్సెక్స్‌లో 30 బ్లూచిప్ కంపెనీలు ప్రాతినిధ్యం వహిస్తుండగా, బజాజ్ ఆటో, భెల్, ఓఎన్‌జీసీ, గెయిల్, టాటా పవర్, సెసా స్టెరిలైట్, హీరో మోటో, టాటా మోటార్స్, మారుతీ, హిందాల్కో, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, విప్రో, డాక్టర్ రెడ్డీస్, ఎంఅండ్‌ఎం తదితరాల్లో ఎఫ్‌ఐఐల వాటా పెరిగింది.
పెట్టుబడులు తగ్గిన వాటిలో హెచ్‌యూఎల్, ఐటీసీ, కోల్ ఇండియా, ఎస్‌బీఐ, ఎయిర్‌టెల్, ఎన్‌టీపీసీ, యాక్సిస్ బ్యాంక్ ఉన్నాయి. కాగా, కొత్త ఏడాదిలో ఎఫ్‌ఐఐలు డెట్ మార్కెట్లకే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. జనవరి 1-17 మధ్య నికరంగా రూ. 16,152 కోట్ల(260 కోట్ల డాలర్లు) విలువైన రుణ సెక్యూరిటీలను కొన్నారు. షేర్లలో రూ. 2,148 కోట్ల(34.8 కోట్ల డాలర్లు) నికర పెట్టుబడులు పెట్టారు.