ఆర్బీఐ పాలసీకి ‘ముందు జాగ్రత్త’ | Sensex drops most in 2 weeks, Nifty holds 8200 ahead of RBI policy | Sakshi
Sakshi News home page

ఆర్బీఐ పాలసీకి ‘ముందు జాగ్రత్త’

Published Tue, Jun 7 2016 12:52 AM | Last Updated on Mon, Sep 4 2017 1:50 AM

ఆర్బీఐ పాలసీకి ‘ముందు జాగ్రత్త’

ఆర్బీఐ పాలసీకి ‘ముందు జాగ్రత్త’

66 పాయింట్ల నష్టంతో 26,777కు సెన్సెక్స్
20 పాయింట్లు క్షీణించి 8,201కు నిఫ్టీ

 ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగిన సోమవారం నాటి ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. నేడు (మంగళవారం) ఆర్‌బీఐ పాలసీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచి, తూచి వ్యవహరించారు. బీఎస్‌ఈ సెన్సెక్స్ 66 పాయింట్లు నష్టపోయి 26,777 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 20 పాయింట్ల నష్టంతో 8,201 పాయింట్ల వద్ద ముగిశాయి. ఐటీ, కన్సూమర్ డ్యూరబుల్స్, ఫార్మా, ఆయిల్, గ్యాస్, ప్రైవేట్ బ్యాంక్‌లు, టెలికం షేర్లు నష్టపోగా, ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు, కొన్ని మౌలిక రంగ కంపెనీల షేర్లు లాభపడ్డాయి.

 లాభాల స్వీకరణ..

 బీఎస్‌ఈ సెన్సెక్స్ లాభాల్లోనే ప్రారంభమైంది. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరుతో మరింతగా పెరిగింది. గత రెండు వారాల్లో స్టాక్ సూచీలు  6 శాతం వరకూ లాభపడటంతో ఆర్‌బీఐ పాలసీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ చేశారు.  రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకునే కీలకమైన అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం, యూరోజోన్‌లో బ్రిటన్ కొనసాగే విషయమై రిఫరెండమ్.. ఈ రెండు కీలక అంతర్జాతీయ అంశాలు ఈ నెలలోనే జరగనుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. కాగా వర్షాలు సాధారణం కంటే అధికంగానే కురుస్తాయన్న అంచనాలు, జీడీపీ జోరుగా ఉండడం వంటి సానుకూలాంశాలు నష్టాలను పరిమితం చేశాయి. గత ఆర్థిక సంవత్సరంలో 7.6 శాతం జీడీపీ సాధించడంతో ఆర్‌బీఐ కీలక రేట్లలో యథాతథ స్థితి కొనసాగించే అవకాశాలున్నాయని పలువురు స్టాక్ బ్రోకర్లు అంచనా వేస్తున్నారు.

 లాభాల్లో ప్రభుత్వ బ్యాంక్ షేర్లు...

 మొండి బకాయిల సెటిల్మెంట్‌కు బ్యాంక్‌లకు మరిన్ని అధికారాలు, మరిన్ని నిధులు ఇస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొనడంతో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎస్‌బీఐ, అలహాబాద్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్ వంటి ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు 2.85 శాతం వరకూ లాభపడ్డాయి. రూ.2,161 కోట్ల విలువైన కాంట్రాక్టులు లభించడంతో లార్సెన్ అండ్ టుబ్రో షేర్ 0.5 శాతం పెరిగింది.

 నష్టాల్లో టెలికం షేర్లు..: నెట్‌వర్క్ ట్రయల్స్ కోసం ఆసక్తి ఉన్నవాళ్ల పేర్లను రిలయన్స్ జియో  తీసుకోవడం ప్రారంభించడంతో టెలికం షేర్లు-భారతీ ఎయిర్‌టెల్, ఐడియా, రిలయన్స్ కమ్యూనికేషన్స్ 2 శాతం వరకూ తగ్గాయి. జీవీకే పవర్ అండ్ ఇన్‌ఫ్రా, ఇప్కా ల్యాబొరేటరీస్, ఐనాక్స్ విండ్, పంజ్ లాయిడ్, ట్రీ హౌస్ ఎడ్యుకేషన్ అండ్ యాక్సెసరీస్, జేపీ ఇన్‌ఫ్రాటెక్, సన్‌రైజ్ ఏషియన్ తదితర షేర్లు ఇంట్రాడేలో  ఏడాది కనిష్ట స్థాయికి పడిపోయాయి.  డాలర్ బలహీనపడడంతో టీసీఎస్, విప్రో వంటి ఐటీ షేర్లు నష్టపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement