రాజన్.. రెండో 'సారీ'!
ముంబై: రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ వరుసగా రెండో విడత వడ్డీరేట్ల వాతపెట్టారు. ధరల కట్టడికే అధిక ప్రాధాన్యం ఇస్తూ... కీలక పాలసీ రేట్లను మరోసారి పెంచారు. దీంతో వాహన, గృహ, కార్పొరేట్ రుణాలు మరింత భారమయ్యే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో వడ్డీరేట్ల పెంపు సంకేతాలు-డిమాండ్ తగ్గింపు-తద్వారా ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంగా ఆర్‌బీఐ మంగళవారంనాటి రెండో త్రైమాసిక పరపతి విధాన సమీక్షలో నిర్ణయం తీసుకుంది. రెపోరేటును పావుశాతం పెంచింది.
దీనితో ఈ రేటు 7.75 శాతానికి చేరింది. అదే సమయంలో వృద్ధికి కావాల్సిన నిధులు వ్యవస్థలో అందుబాటులో ఉండే చర్యలనూ తీసుకుంది. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ(ఎంఎస్‌ఎఫ్) రేటును పావుశాతం తగ్గించింది. దీంతో ఈ రేటు 8.75%కి దిగివచ్చింది. తద్వారా లిక్విడిటీ(ద్రవ్య లభ్యత)కి ఎలాంటి ఇబ్బందీ తలెత్తకుండా చర్యలుంటాయని సంకేతాలు ఇచ్చింది. దీనితోపాటు వ్యవస్థలో ఎటువంటి ద్రవ్యలభ్యత సమస్యా తలెత్తకుండా 7, 14 రోజుల రెపోలకు సంబంధించి తమ నగదు పొజిషన్లపై (ఎన్‌డీటీఎల్) బ్యాంకుల రుణ పరిమితిని రెట్టింపు (0.5%కి) చేస్తూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. మిగిలిన రేట్లు, నిష్పత్తుల్లో ఎటువంటి మార్పులూ చేయలేదు.
అంచనాలకు అనుగుణంగానే...: మొత్తంమీద దాదాపు మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే ఆర్‌బీఐ పాలసీ విధానం కొనసాగింది. సెప్టెంబర్ 4న ఆర్‌బీఐ గవర్నర్‌గా రఘురామ్ రాజన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి అదేనెల 20న నిర్వహించిన మధ్యంతర పాలసీ సమీక్ష సందర్భంగా అందరి అంచనాలను తలకిందులుచేస్తూ ఆర్‌బీఐ రెపోరేటును పావుశాతం పెంచింది. వరుసగా రెండవసారి రాజన్ రెపో రేటు పెంపునకే ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యాంశం. ఇది ఆయనకు పూర్తిస్థాయి త్రైమాసిక ద్రవ్య, పరపతి విధాన సమీక్ష. కాగా తాజా ఆర్‌బీఐ చర్యల వల్ల కార్పొరేట్, వినియోగ రుణ రేట్లు రానున్న రోజుల్లో మరింత పెరగొచ్చనేది విశ్లేషకుల అంచనా.
ముఖ్యాంశాలు ఇవీ...
స్వల్పకాలిక రుణ రేటు రెపో పావుశాతం పెంపు. దీనితో బ్యాంకులకు ఆర్‌బీఐ ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు 7.75%కి పెరిగింది. బ్యాంకులపై రుణ భారం పెరగడం వల్ల అవి ఖాతాదారుల నుంచి వసూలుచేసే వడ్డీరేట్లూ పెరిగే అవకాశాలు ంటాయి.
మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్‌ఎఫ్) రేటు 0.25% తగ్గింపు. దీనితో ఇది 8.75 శాతానికి చేరిక. బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) సమస్య తలెత్తకుండా చూసే పరిస్థితులను ఇది కల్పిస్తుంది.
వృద్ధి రేటు 5.5 శాతం నుంచి 5 శాతానికి కుదింపు.
ప్రస్తుతస్థాయికన్నా అధికంగా టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ- సెప్టెంబర్‌లో 6.46%) ఆధారిత ద్రవ్యోల్బణం ఉంది. దీని కట్టడికి తగిన పాలసీ చర్యలు అవసరమే. రిటైల్ ద్రవ్యోల్బణం 9 శాతం స్థాయిలో కొనసాగుతుంది.
బ్యాంకులు తమ మొత్తం డిపాజిట్లలో ఆర్‌బీఐ వద్ద ఉంచాల్సిన పరిమాణం...నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్) 4%లో మార్పులేదు.
కొత్త బ్యాంక్ లెసైన్సులపై జలాన్ కమిటీ నవంబర్ 1 వతేదీన మొదటి సమావేశం. దేశీయ బ్యాం కుల హోదాతో దాదాపు సమానంగా విదేశీ బ్యాంకులూ కార్యకలాపాల నిర్వహణకు త్వరలో మార్గదర్శకాలు.
ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యం..
పెరుగుతున్న ధరల ఒత్తిడిని నియంత్రించడమే విధాన చర్యల వైఖరి, లక్ష్యం. వృద్ధి బలహీన పరిస్థితుల నేపథ్యంలో ఈ పాలసీ చర్యలు తీసుకుంటున్నాం. స్థూల ఆర్థిక వ్యవస్థ, ద్రవ్య స్థిరత్వాన్ని పరిరక్షిస్తూ, వృద్ధి వాతావరణాన్ని పటిష్టం చేయడానికి ఈ చర్యలు దోహదపడతాయి. వృద్ధి అవకాశాలకు ఏమాత్రం విఘాతం కలగకుండా ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకుంటూ, ద్రవ్యోల్బణం ఇబ్బందులను రిజర్వ్ బ్యాంక్ ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తుంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు పరిస్థితులు మెరుగుపడవచ్చు.
- రఘురామ్ రాజన్, ఆర్‌బీఐ గవర్నర్