పాలసీకి అటూ..ఇటూ హెచ్చుతగ్గులు | RBI monetary policy review | Sakshi
Sakshi News home page

పాలసీకి అటూ..ఇటూ హెచ్చుతగ్గులు

Published Wed, Apr 8 2015 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 11:59 PM

పాలసీకి అటూ..ఇటూ హెచ్చుతగ్గులు

పాలసీకి అటూ..ఇటూ హెచ్చుతగ్గులు

మెప్పించని ఆర్‌బీఐ పాలసీ
  వడ్డీ రేట్ల ప్రభావిత షేర్లు కుదేల్
  12 పాయింట్ల లాభంతో 28,517కు సెన్సెక్స్
  8,660 పాయింట్లకు చేరిన నిఫ్టీ

 
 ఆర్‌బీఐ ద్రవ్య పరపతి సమీక్ష వెలువడకముందు స్టాక్ మార్కెట్ ఎలాగైతే ఒడిదుకులకు గురైందో, పాలసీ వెలువడిన తర్వాత కూడా అంతే స్థాయి ఒడిదుడుకులకు  గురైంది. మొత్తం మీద కొంచెం సేపు లాభాల్లో, మరికొంచెం సేపు నష్టాల్లో తారాట్లాడిన బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు 12 పాయింట్ల లాభంతో 28,517 పాయింట్ల వద్ద ముగిసింది. కీలక రేట్లను తగ్గించకపోవడంతో ఆర్‌బీఐ పాలసీ స్టాక్ మార్కెట్‌ను మెప్పించలేకపోయింది.  సెన్సెక్స్ ట్రేడింగ్ లాభంతోనే మొదలైంది. ఆ తర్వాత 105 పాయింట్ల లాభంతో 28,641 పాయింట్లకు ఎగసింది. ఆర్‌బీఐ పాలసీలో మెరుపులేమీ లేకపోవడంతో 28,274 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఆర్‌బీఐ నిర్ణయాన్ని మార్కెట్ ముందుగానే అంచనా వేసిందని, ఈ ప్రభావం ఇప్పటికే డిస్కౌంట్ అయిందని బొనంజా పోర్ట్‌ఫోలియో అసోసియేట్ ఫండ్ మేనేజర్ హీరేన్ ధకన్ చెప్పారు. చివర్లో బ్లూ చిప్ షేర్లలో కొనుగోళ్ల కారణంగా సెన్సెక్స్ స్వల్పంగా 12 పాయంట్లు లాభపడింది. నిఫ్టీ 8,694-8,587 గరిష్ట, కనిష్ట స్థాయిల మధ్య కదలాడి 0.4 పాయింట్ల లాభంతో 8,660 పాయింట్ల వద్ద ముగిసింది.
 
 ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణ
 సూక్ష్మ రుణ సంస్థలు రుణ గ్రహీతలకు ఇచ్చే రుణాల పరిమితులను రూ.50,000 నుంచి లక్షకు పెంచడంతో ఈ రంగంలో ఉన్న ఎస్‌కేఎస్ మైక్రో ఫైనాన్స్ 8.5 శాతం, ఎస్‌ఈ ఇన్వెస్ట్‌మెంట్స్ 8 శాతం చొప్పున పెరిగాయి. ఆర్‌బీఐ పాలసీ నేపథ్యంలో వడ్డీరేట్ల ప్రభావిత బ్యాంక్, రియల్టీ, వాహన షేర్లు కుదేలయ్యాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. కీలక రేట్లను తగ్గించకపోవడంతో వడ్డీరేట్లు తగ్గవని, ఫలితంగా గృహ రుణ వృద్ధి కుంటుపడుతుందన్న అంచనాలతో హౌసింగ్ ఫైనాన్స్, రియల్టీ షేర్లు పతనమయ్యాయి.  ఎన్‌బీసీసీ, ఒబెరాయ్ రియల్టీ, ఫీనిక్స్, గోద్రేజ్ ప్రోపర్టీ, యూనిటెక్, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్, శోభా డెవలపర్స్, డీఎల్‌ఎఫ్, ప్రెస్జీజ్ ఎస్టేట్స్ 3 -2 శాతం రేంజ్‌లో తగ్గాయి.
 
 బ్యాంక్ షేర్లలో యాక్సిస్ బ్యాంక్   షేర్ 1.6 శాతం క్షీణించింది. ఐసీఐసీఐ బ్యాంక్ 1.2 శాతం, ఎస్‌బీఐ 0.9 శాతం చొప్పున నష్టపోయాయి.
 
 30 సెన్సెక్స్ షేర్లలో 16 లాభాల్లో, 13 నష్టాల్లో ముగిశాయి. ఐటీసీ షేర్ సోమవారం నాటి ధరకే ముగిసింది. టాటా స్టీల్ 4.8 శాతం, సెసా స్టెరిలైట్ 3.1 శాతం, బజాజ్ ఆటో 3.1 శాతం, బజాజ్ ఆటో 3 శాతం, ఎన్‌టీపీసీ 2.7 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 2 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 1.9శాతం, హిందాల్కో 1.6 శాతం, టాటా పవర్ 1.6 శాతం చొప్పున పెరిగాయి. ఇక క్షీణించిన షేర్ల విషయానికొస్తే సన్ ఫార్మా 1.42 శాతం, టాటా మోటార్స్ 1.3 శాతం, ఐసీఐసీఐ బ్యాంఖ్ 1.2 శాతం, హీరో మోటొకార్ప్1.19 శాతం, చొప్పున తగ్గాయి. 1,653 షేర్లు లాభాల్లో, 1,096 షేర్లు నష్టాల్లో ముగిశాయి.
 
 టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.3,304 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.18,094 కోట్లుగా, డెరివేటివ్స్ విభాగంలో రూ.2,45,728 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.144 కోట్ల నికర కొనుగోళ్లు జరపగా, దేశీ ఇన్వెస్టర్లు రూ.326 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. సోమవారం అమెరికా స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగియడంతో అన్ని ఆసియా మార్కెట్లు కూడా లాభాల్లోనే ముగిశాయి. యూరోప్ మార్కెట్లు కూడా లాభాల్లోనే ట్రేడవుతున్నాయి.
 
 క్యాపిటల్ మార్కెట్‌లో లావాదేవీలు
 బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ, ఎంసీఎక్స్-ఎస్‌ఎక్స్ ట్రేడింగ్
 విభాగం    తేదీ         కొనుగోలు    అమ్మకం    నికర విలువ
 డీఐఐ :    07-04    1,260    1,586     -326    
 06-04    1,667    1,837     -170
 ఎఫ్‌ఐఐ: 07-04    3,719    3,575    144        
 06-04    4,438    3,501    937    
     (విలువలు రూ.కోట్లలో)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement