రేట్లలో కోత లేదు.. రెపో 6.5శాతమే
ముంబై: మెజారిటీ విశ్లేషకులు అంచనా వేసిన మాదిరిగానే ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ నిర్ణయం వెలువడింది. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను 6.5 శాతంగానే ఉంచుతున్నట్టు వెల్లడించారు. ఈ రేటుపై ఎలాంటి కోత విధించలేదని పేర్కొన్నారు. అలాగే సీఆర్ఆర్ 4 శాతంగా ఉంది. మంగళవారం జరిగిన ప్రస్తుత ఆర్థిక సంవత్సర మొట్టమొదటి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ గవర్నర్ ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
అయితే రాజన్ వెలువరిచిన ఈ పాలసీని విశ్లేషకులు, మార్కెట్ వర్గాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సెప్టెంబర్ తో రాజన్ పదవి ముగియనుండటం, మరో మారు ఆర్బీఐ గవర్నర్ గా రాజన్ నే కొనసాగించాలని చర్చనీయాంశాలు జోరు అందుకోవడంతో, ఆర్ బీఐ పాలసీ ఎలా ఉండబోతుందనే దానిపై ఎక్కువగా దృష్టిసారించారు.
2013 సెప్టెంబర్ లో ఆర్బీఐ గవర్నర్ గా రాజన్ మూడేళ్ల బాధ్యతలు చేపట్టారు. ఒకవేళ రాజన్ పదవిని కొనసాగించకపోతే నేడు వెలువరించిన పాలసీనే రాజన్ కు ఆఖరిదని విశ్లేషకులంటున్నారు. రాజన్ మూడేళ్ల బాధ్యతలు చేపట్టిన తర్వాత క్రమంగా రుణ బెంచ్‌మార్క్ రేటు- రెపో రేటును 7.25 శాతం నుంచి 8 శాతానికి పెంచారు. అటుతర్వాత ఆర్థికశాఖ, పరిశ్రమల నుంచి వచ్చిన ఒత్తిడులు, ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో క్రమంగా రెపో రేటును 1.50 శాతం తగ్గించారు. దీనితో ఈ రేటు ప్రస్తుతం 6.5 శాతానికి దిగివచ్చింది. ప్రస్తుతం కొనసాగుతున్న రెపో రేటును ఏ మాత్రం మార్పుల చేయలేదు.
నేడు వెలువరిచిన ఆర్ బీఐ ద్రవ్యపరపతి సమీక్ష సందర్భంగా తెలుసుకోవాల్సిన అంశాలు...
- ఈ రేటును ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ, విశ్లేషకులు నిర్ణయించారు. తర్వాతి పాలసీ ఆగస్టులో వెలువడే వరకూ ఈ రేట్లే అమలుల్లో ఉండనున్నాయి.
- ఈ రేటుపై నిర్ణయం తీసుకున్న ద్రవ్యవిధాన కమిటీ ఏర్పాటు బిల్లుకు పార్లమెంటులో ఆమోదం లభించింది. ఆరుగురు సభ్యులున్న ఈ కమిటీలో ముగ్గురిని కేంద్రప్రభుత్వం నామినేట్ చేస్తోంది. మరో ముగ్గురు ఆర్ బీఐకి చెందిన వ్యక్తులుంటారు. ఆర్ బీఐ గవర్నర్ ఓటింగ్ అధికారం కలిగి ఉంటారు.
- నేడు వెలువరించిన ద్రవ్యవిధాన పాలసీలో ఎక్కువగా ఆర్ బీఐ గవర్నర్ గా రాజన్ నే కొనసాగిస్తారా..? అనే అంశంపైనే అందరూ దృష్టిసారించారు. ప్రతి ఆర్ బీఐ గవర్నర్ పదవి ముగుస్తుందనగా.. వారికి పదవిని రెండేళ్లు పొడిగించేవారు. మరి రాజన్ కు ఏ నిర్ణయం తీసుకోబోతుందన్నదే చర్చనీయాంశం.
- బీజేపీలో ఫైర్ బ్రాండ్ గా ఉన్న నేత సుబ్రహ్మణ్య స్వామి, రాజన్ పదవి కొనసాగింపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వడ్డీరేట్లు తగ్గించకపోవడం వల్లే ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మానసికంగా రాజన్ భారతీయుడు కాదని వ్యాఖ్యానిస్తున్నారు. అమెరికా జారీచేసిన గ్రీన్ కార్డ్ ను ఆయన ఇంకా రెన్యూవల్ చేప్పించుకుంటున్నారని ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు.
- సెప్టెంబర్ లో రాజన్ పదవి ముగుస్తుండటంతో, అప్పుడే దీనిపై నిర్ణయం తీసుకుంటామని, ప్రస్తుతం దీనిపై ఎలాంటి చర్చ వద్దని మోదీ ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు రాజన్ పదవి పొడిగింపుకు మోదీకి ఎలాంటి అభ్యతరం లేదని సంకేతాలు వెలువడుతున్నాయి. నెట్ సిటిజన్లు, మెజార్టి విశ్లేషకుల నుంచి కూడా రాజన్ కు ఆదరణ గణనీయంగా పెరుగుతోంది.
- బ్యాంకులకు ఆర్ బీఐ ఇచ్చే రుణాలపై రేటు.. రెపోను 6.50గానే ఉంచుతుందని మెజార్టి విశ్లేషకులు భావించారు. మార్చిలో 4.83శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్ లో 5.39శాతంగా పెరగడం దీనికి కారణంగా చూపారు. 2017 మార్చిలో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 5శాతం కంటే తక్కువ స్థాయికి తీసుకురావడమే ఆర్ బీఐ ప్రధాన లక్ష్యం.
- ఇటీవల ఆయిల్ ధరలు పెరగడం వల్ల రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగిందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. 7వ వేతన సంఘ సిఫారసులను అమలుచేయడం వల్ల, కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు వేతనాలు పెరిగాయని, దీంతో ధరలు ఎగబాకాయని చెబుతున్నారు.
- రేట్లలో కోత విధింపు అంశం రుతుపవనాల వల్ల కురిసే వర్షాలపై ఆధారపడి ఉంటుందని, రాజన్ కూడా రేటు కోత విధించకుండా రుతుపవనాల కోసం వేచిచూస్తున్నారని ఈ నిర్ణయంతో వెల్లడైంది.. వాతావరణ నిపుణులు ఈ ఏడాది రుతుపవనాలు బాగుంటాయని అంచనావేస్తున్నారు. రెండేళ్ల కరువు అనంతరం ఈ ఏడాది రుతుపవనాలు ఆర్థికవ్యవస్థకు మేలు చేకూర్చబోతున్నాయని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. మంచి రుతుపవనాలు, గ్రామీణ వినియోగాన్ని పెంచుతుందంటున్నారు.
-
అమెరికా సెంట్రల్ బ్యాంక్- ఫెడ్ ఫండ్ రేటుపై ఈ నెల 15-16 తేదీల్లో నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో ఆర్‌బీఐ తాజా సమీక్ష జరుగుతుండటం విశేషం.