repo
-
రెపో లావాదేవీల్లో ఫండ్స్ పెట్టుబడులకు గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: కార్పొరేట్ బాండ్ మార్కెట్‌కు ప్రోత్సాహకంగా సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. కమర్షియల్ పేపర్లు, సర్టిఫికెట్ ఆఫ్ బాండ్లు తదితర సెక్యూరిటీల రెపో లావాదేవీల్లో పెట్టుబడులకు మ్యూచువల్ ఫండ్స్‌ను అనుమతించింది. ఏఏ, అంతకు మించి రేటింగ్ కలిగిన కార్పొరేట్ డెట్ సెక్యూరిటీల రెపో లావాదేవీల్లో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు పెట్టుకోవ చ్చని సెబీ స్పష్టం చేసింది. రెపో లావాదేవీలను రెపో అని లేదంటే విక్రయ–కొనుగోలు ఒప్పందంగా పరిగణిస్తారు. సెక్యూరిటీలను విక్రయించిన సంస్థే అంగీకరించిన రేటుపై తిరిగి వాటిని కొనుగోలు చేస్తుంది. నూతన ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని సెబీ ప్రకటించింది. -
ఆర్బీఐ రెపో వడ్డింపు మరోసారి ఖాయమే!
ముంబై: ఆర్బీఐ ఎంపీసీ ద్వైమాసిక పరపతి సమీక్ష బుధవారం ప్రారంభం కానుంది. ఇందులో తీసుకున్న నిర్ణయాలను ఈ శుక్రవారం (30న) ఉదయం ఎంపీసీ ప్రకటించనుంది. గరిష్టంగా 0.50 శాతం వరకు రెపో రేటును పెంచొచ్చని మెజారిటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గరిష్ట పరిమితి అయిన 6 శాతానికి పైనే ఏడు నెలలుగా ద్రవ్యోల్బణం కొనసాగుతోంది. ఆగస్ట్ నెలకు కూడా 7 శాతానికి పైనే నమోదైంది. దీంతో ద్రవ్యోల్బణం కట్టడికి రేట్ల పెంపు అనివార్యమే అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది మే నుంచి మూడు విడతల్లో ఆర్బీఐ రెపో రేటును 1.4 శాతం మేర పెంచడంతో అది 5.4 శాతానికి చేరింది. యూఎస్ ఫెడ్ కూడా ప్రతి పర్యాయం 0.75 శాతం మేర రేట్లను పెంచుతూ వస్తుండడం తెలిసిందే. అంతేకాదు రానున్న సమీక్షల్లోనూ రేట్ల పెంపు ఉంటుందని సంకేతాలు ఇచ్చింది. అటు యూకే, ఈయూ కూడా రేట్ల పెంపు బాటలోనే నడుస్తున్నాయి. ఇది రూపాయి మారకం విలువపై ప్రభావం చూపిస్తోంది. తాజా సమీక్షలో రూపాయి మారకం, ద్రవ్యోల్బణం, ఆర్ధిక వృద్ధిపై ఎంపీసీ కీలక చర్చ నిర్వహించనుంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని రేట్ల పెంపు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం (ప్లస్ 2, మైనస్ 2) పరిధిలో నియంత్రించాలన్నది ఆర్బీఐ లక్ష్యం. పెంపు తప్పదు.. 50 బేసిస్ పాయింట్ల (0.50 శాతం) పెంపు ఉంటుందని ఇక్రా ముఖ్య ఆర్థిక వేత్త అదితి నాయర్ అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందిన దేశాలు సైతం రేట్ల పెంపు నిర్ణయాలు తీసుకుంటున్నందున.. ఆర్బీఐ నుంచి మరిన్ని రేటు పెంపు చర్యలు కొనసాగుతాయని భావిస్తున్నట్టు మాజీ గవర్నర్ సి.రంగరాజన్ సైతం ఇటీవలే అభిప్రాయం వ్యక్తం చేశారు. రిటైల్, టోకు ధరల ద్రవ్యోల్బణం అధిక స్థాయిల్లోనే కొనసాగుతుండడాన్ని బార్క్లేస్ సెక్యూరిటీస్ ఇండియా ముఖ్య ఆర్థికవేత్త రాహుల్ బజోరియా గుర్తు చేశారు ఈ నేపథ్యంలో ఆర్బీఐ ఈ నెల చివర్లో జరిగే సమీక్షలో 0.50 శాతం మేర రేటు పెంపు ఉంటుందన్నారు. సెప్టెంబర్ 30న ఆర్బీఐ రెపో రేటును 0.35 శాతం మేర పెంచొచ్చని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. జపాన్ బ్రోకరేజీ సంస్థ అయిన నోమురా సైతం ఈ నెల చివర్లో 0.35 శాతం, డిసెంబర్ సమీక్షలో 0.25 శాతం చొప్పున రేట్ల పెంపు ఉంటుందని అంచనాతో ఉంది. -
ఫ్లోటింగ్ రేట్ రుణాలకు రెపోనే ప్రాతిపదిక
ముంబై: తమ చర వడ్డీ (ప్లోటింగ్) రుణాలు అన్నింటికీ రెపో రేటే ప్రామాణికంగా ఉంటుందని ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రకటించింది. అక్టోబర్ 1వ తేదీ నుంచీ ఈ నిర్ణయం అమలవుతుందని స్పష్టం చేసింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వసూలు చేసే వడ్డీరేటే రెపో. ప్రస్తుతం ఇది 5.4 శాతంగా ఉంది. ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా... బ్యాంకింగ్ రుణ రేట్లు అన్నీ రెపోసహా ద్రవ్య విధాన నిర్ణయ రేట్లకు, ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ రేట్లకు అనుసంధానం కావాల్సిందేనని బ్యాంకులకు ఈ నెలారంభంలో ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలలకు ఒకసారి ఇందుకు సంబంధించి సమీక్షలు, అనుసంధాన నిర్ణయాలు (రిసెట్) జరగాలని ఆర్బీఐ నిర్దేశించింది. వ్యక్తిగత లేదా గృహ, ఆటో అలాగే లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) ఇచ్చే కొత్త ఫ్లోటింగ్ (చర వడ్డీరేటు) రేట్లు ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచీ తప్పనిసరిగా రెపో సహా ద్రవ్య, పరపతి విధాన నిర్ణయ రేట్లకు, ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ రేట్లకు తప్పనిసరిగా అనుసంధానం చేయాల్సి ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. దీనివల్ల ఆర్బీఐ రెపో తగ్గిస్తే, ఆ ప్రయోజనం త్వరితగతిన కస్టమర్‌కు అందుబాటులోనికి రావడానికి వీలు కలుగుతుంది. బ్యాంకులు తమకు లభించిన రెపో రేటు ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయిండచం లేదని, ఆర్థిక మందగమనానికి ఇది ఒక కారణమనీ వస్తున్న విమర్శల నేపథ్యంలో ఆర్బీఐ తాజా ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా బ్యాంకింగ్ చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుత పరిస్థితిపై నిరుత్సాహం... ప్రస్తుతం నిధుల సమీకరణ–వ్యయ మిగులు ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్) విధానాన్ని బ్యాంకులు అనుసరిస్తున్నాయి. అయితే వివిధ కారణాల వల్ల ఆర్బీఐ విధానపరమైన రేటు నిర్ణయ బదలాయింపు ప్రక్రియ ఎంసీఎల్ఆర్ మార్గంలో ఆలస్యం అవుతోంది. రెపో గడచిన నాలుగు ద్వైమాసికాల్లో 1.1 శాతం తగ్గింది. అయితే ఆగస్టు వరకూ రెపో 0.75 బేసిస్ పాయింట్లు తగ్గితే, (అటు తర్వాత 35 బేసిస్ పాయింట్లు) బ్యాంకులు మాత్రం 0.30 శాతం మాత్రమే ఈ రేటును కస్టమర్లకు బదలాయించాయని ఆర్బీఐ స్వయంగా పేర్కొంది. -
2018లో రేటు పెరుగుదల లేనట్లే!
ముంబై: ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ, 2018లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణ రేటు– రెపో (ప్రస్తుతం 6 శాతం)ను తగ్గించే అవకాశాలు కనిపించడం లేదని పలువురు విశ్లేషిస్తున్నారు. ♦ బడ్జెట్లో ఆహార ధాన్యాలకు కనీస మద్దతు ధర పెంపు – ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే 2018–19 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీసే అవకాశం ఉందని జపాన్ బ్రోకరేజ్ సంస్థ– నొమురా అభిప్రాయపడింది. ♦ పారిశ్రామిక వృద్ధి రేటు మెరుగుపడిన నేపథ్యంలో వచ్చే ఆరు నెలల్లో ఆర్బీఐ రేటు తగ్గింపునకు అవకాశం లేదని దేశీయ క్రెడిట్ రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ పేర్కొంది. వినియోగ డిమాండ్, గృహ అద్దె అలవెన్సులు, క్రూడ్ ధరల పెరుగుదల వంటి అంశాల వల్ల రిటైల్ ద్రవ్యోల్బణం 2018–19లో సగటున 4.6 శాతం నమోదయ్యే అవకాశం ఉందని క్రిసిల్ అంచనా వేస్తోంది. ♦ సింగపూర్ బ్యాంక్ డీబీఎస్ కూడా రేటు తగ్గింపునకు అవకాశం లేదని తన తాజా విశ్లేషణలో వివరించింది. రేటు పావుశాతం పెరగవచ్చు: కేర్ రేటింగ్స్ కాగా రెపోను 2018లో పావుశాతం పెంచే అవకాశం ఉందని కేర్ రేటింగ్స్ తన తాజా నివేదికలో పేర్కొంది. ద్రవ్యోల్బణం అధిక శ్రేణికి పెరిగే అవకాశం ఉండడమే దీనికి కారణమని పేర్కొంది. ప్రభుత్వ ఆదాయ వ్యయాలకు సంబంధించిన నికర వ్యత్యాసమైన ద్రవ్యలోటు పెరుగుతోందని, చమురు ధరల తీవ్రత, వ్యవసాయ వృద్ధి తగ్గడం వంటివి ధరల పెరుగుదలకు దారితీసే అవకాశం ఉందని అభిప్రాయపడింది. 2 శాతం ప్లస్, 2 శాతం మైనస్‌తో 4 శాతం వద్ద ద్రవ్యోల్బణం ఉండాలన్నది ఆర్బీఐ లక్ష్యం. అయితే ఈ శ్రేణికి మించి ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని కేర్ తన నివేదికలో వెల్లడించింది. బీఓఏఎంఎల్ భిన్నం... కాగా, ఆగస్టులో పాలసీ రేటును పావుశాతం తగ్గిస్తుందని అంతర్జాతీయ బ్యాంకింగ్ సేవల దిగ్గజం– బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిలించ్ (బీఓఏఎంఎల్) అంచనావేస్తోంది. ‘ద్రవ్యోల్బణం పెరిగినా... ఆర్బీఐ ఫ్రేమ్‌వర్క్ రేంజ్‌లోనే కొనసాగే అవకాశం ఉంది. ఇదే రేటు తగ్గింపు నిర్ణయానికి దోహదపడే కారణ మవుతుందని భావిస్తున్నాం’’అని తన నివేదికలో పేర్కొంది. -
రేట్ల కోతకు ‘సానుకూల’ అంకెలు
♦ పారిశ్రామిక ఉత్పత్తి మందగమనం.. ♦ మేలో కేవలం 1.7 శాతం వృద్ధి ♦ చరిత్రాత్మక కనిష్టంలో రిటైల్ ధరల స్పీడ్ ♦ జూన్‌లో 1.54 శాతం ♦ ఆగస్టు ఆర్బీఐ పాలసీపై దృష్టి ముంబై: రెపో, రివర్స్ రెపో వంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ రేట్లను మరింత తగ్గించాలన్న డిమాండ్‌కు బలం చేకూరే స్థూల ఆర్థిక గణాంకాలు బుధవారం వెలువడ్డాయి. పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) సూచీ మే నెలలో కేవలం 1.7 శాతం (2016 ఇదే నెలతో ఉత్పత్తితో పోల్చితే) నమోదయ్యింది. ఇక జూన్‌లో వినియోగ ధరల (సీపీఐ) సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం చరిత్రాత్మక కనిష్ట స్థాయి 1.54 శాతంగా నమోదయ్యింది. ద్రవ్యోల్బణం కట్టడిలో ఉన్న నేపథ్యంలో అటు ప్రభుత్వం నుంచీ ఇటు పారిశ్రామిక వర్గాల నుంచీ రేటు తగ్గింపునకు ఆర్బీఐకి విజ్ఞప్తులు అందుతున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల ఒకటి, రెండు తేదీల్లో ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానం నేపథ్యంలో బుధవారం ఆయా శాఖలు విడుదల చేసిన గణాంకాల వివరాల్లో ముఖ్యాంశాలు చూస్తే... ఐఐపీ... 8 నుంచి 1.7 శాతానికి డౌన్ ⇔ 2016 మే నెలలో (2015 మే నెలతో పోల్చితే) పారిశ్రామిక ఉత్పత్తి 8%గా నమోదయ్యింది. అయితే తాజా దిగువ ధోరణికి కారణం– కీలకమైన తయారీ, మైనింగ్ వంటి విభాగాల పేలవ పనితీరే. ⇔ మొత్తం సూచీలో దాదాపు 70% వాటా కలిగిన తయారీ రంగంలో వృద్ధి రేటు 8.6 శాతం నుంచి 1.2 శాతానికి పడిపోయింది. ⇔ భారీ వస్తు ఉత్పత్తికి, డిమాండ్, పెట్టుబడులకు సూచిక అయిన క్యాపిటల్ గూడ్స్‌లో అసలు వృద్ధిలేకపోగా – 3.9% క్షీణత నమోదయ్యింది. 2016 మే నెలలో ఈ విభాగంలో వృద్ధి భారీగా 13.9%. ⇔ కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగంలోనూ క్షీణత నమోదయ్యింది. ⇔ మైనింగ్ రంగం 5.7% క్షీణత నుంచి 0.9% క్షీణతకు జారింది. ⇔ విద్యుత్ రంగంలో ఉత్పాదకత వృద్ధి మాత్రం 6.1 శాతం నుంచి 8.7 శాతానికి ఎగసింది. ఏప్రిల్–మే నెలల్లోనూ దిగువకే... 2016 ఏప్రిల్–మే నెలల్లో ఐఐపీ 7.3 శాతం నుంచి 2.3 శాతానికి పడిపోయింది. ఈ కాలంలో తయారీ రంగం వృద్ధి రేటు 7.1 శాతం నుంచి 1.8 శాతానికి, మైనింగ్ రంగానికి సంబంధించి ఈ శాతం 6.2 శాతం నుంచి 1.1 శాతానికి, విద్యుత్ రంగంలో ఉత్పత్తి వృద్ధి రేటు 10.1 శాతం నుంచి 7.1 శాతానికి తగ్గింది. తగ్గిన రిటైల్ ‘ధర’ వేగం ⇔ 2016 జూన్ నెలతో పోల్చితే 2017 జూన్‌లో రిటైల్ ధరల పెరుగుదల వేగం గణనీయంగా తగ్గిపోయింది. చరిత్రాత్మక కనిష్ట స్థాయిలో 1.54 శాతంగా నమోదయ్యింది. ⇔ ఆహార ఉత్పత్తులు: కూరగాయల ధరల్లో అసలు పెరుగుదల లేకపోగా ధరలు 17% తగ్గాయి. పప్పులు, సంబంధిత ప్రొడక్టుల ధరలు కూడా 22% తగ్గాయి. గుడ్లు (–0.08%), సుగంధ ద్రవ్యాలది(–0.73%) కూడా ఇదే పరిస్థితి. తృణధాన్యాలు (4.39%), మాంసం, చేపలు (3.49%), పాలు, పాలపదార్థాలు (4.15%), చమురు, వెన్న (2.34 శాతం), పండ్లు (1.98%) ధరలు స్వల్పంగా పెరగ్గా, చక్కెర సంబంధిత ఉత్పత్తుల ధర 8.74% ఎగశాయి. ⇔ పాన్, పొగాకు: ఈ విభాగంలో ధరలు 5.62 శాతం పెరిగింది. ⇔ దుస్తులు, పాదరక్షలు: ధరల పెరుగుదల 4.17 శాతం. ⇔ హౌసింగ్: ధరల పెరుగుదల రేటు 4.7 శాతం. ⇔ ఫ్యూయెల్, లైట్: 4.54 శాతం ఎగసింది. స్థిరత్వానికి సంకేతం రిటైల్ ద్రవ్యోల్బణం స్థూల ఆర్థిక అంశాల స్థిరత్వానికి సంకేతం. ఈ తరహా గణాంకాలు మనం 1999లో అంతకుముందు 1978 ఆగస్టుల్లోనే చూశాం. – అరవింద్ సుబ్రమణ్యం, ప్రధాన ఆర్థిక సలహాదారు -
ఆర్బీఐ కీలక వడ్డీరేట్లు యథాతధం
ముంబై: భారతీయ కేంద్ర బ్యాంకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ద్రవ్యపాలసీని ప్రకటించింది. రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో రెండు రోజుల భేటీ అనంతరం ద్రవ్యవిధాన కమిటీ వడ్డీరేట్లపై తమ నిర్ణయాన్ని వెల్లడించింది. అంచనాలకు కనుగుణంగానే ఆర్బీఐ స్టేటస్ కో వ్యూహాన్నే అనుసరించింది. మానిటరీ పాలసీ కమిటిలో అయిదుగురు సభ్యులు యథాతధ పాలసీకే ఓటు వేసారు. బుధవారం ప్రకటించిన రివ్యూ పాలసీలో రెపో రేటు, రివర్స్ రెపో రేటును యథాతధంగానే ఉంచింది. రెపో రేటును 6.25 శాతం వద్ద, రివర్స్ రెపో రేటును వద్ద ఎలాంటి మార్పులేకుండా ఉంచింది. రెపో రేటు లేదా కీలక రుణాలపై 6.25 శాతం వడ్డీ రేటును కొనసాగించింది. రివర్స్ రెపో 6 శాతం వద్దే కొనసాగనుంది. దీంతో కీలక వడ్డీరేటు 6 సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరింది. అయితే ఎస్ఎల్ఆర్ 50 బీపీఎస్ పాయింట్లను కట్ చేసింది. -
ఫిబ్రవరిలో రెపో పావు శాతం కోత: హెచ్ఎస్బీసీ
ముంబై: బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను (ప్రస్తుతం 6.25 శాతం) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఫిబ్రవరిలో పావు శాతం తగ్గిస్తుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ– హెచ్ఎస్బీసీ అంచనా వేస్తోంది. అయితే దీని తర్వాత రేట్ల కోతలకు బ్రేక్ పడే అవకాశం ఉందని కూడా పేర్కొంది. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలులో అనిశ్చితి, కూడ్ర్ ఆయిల్ ధరలు పెరిగే అవకాశం, మధ్యకాలికంగా ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు, అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) రేటు పెంపు అవకాశాలు దీనికి కారణంగా వివరించింది. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో అక్టోబర్–డిసెంబర్ త్రైమాసిక జీడీపీ వృద్ధి రేటు 5 శాతంగా ఉంటుందని, జనవరి–మార్చి త్రైమాసికంలో ఈ రేటు 6 శాతానికి పెరుగుతుందని హెచ్ఎస్బీసీ అంచనావేసింది. అయితే వృద్ధి రేటు క్రమంగా పుంజుకుంటుందనీ, వచ్చే ఆర్థిక సంవత్సరం (2017–18) ఈ రేటు 7.5–8 శాతం శ్రేణి మధ్య ఉంటుందని పేర్కొంది. -
రేట్ల కోత ఏకాభిప్రాయమే..
అక్టోబర్ 4 ఆర్బీఐ విధాన సమీక్ష మినిట్స్ విడుదల ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అక్టోబర్ 3, 4 తేదీల్లో జరిగిన తన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను పావుశాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 6.25 శాతానికి పడింది. గవర్నర్ ఉర్జిత్ పటేల్ అధ్యక్షతన జరిగిన ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఏకాభిప్రాయ ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ గవర్నర్ సొంత నిర్ణయానికి సంబంధించిన ఈ కీలక రేటు అంశం అందరి ఆమోదం మేరకే తప్పనిసరిగా జరగాల్సిన ఆవశ్యకత నెలకొనడం అక్టోబర్ 4 ప్రత్యేకత. సభ్యులు ఆరుగురు సమంగా చీలిపోతేనే గవర్నర్ ‘కాస్టింగ్ ఓటు’ కీలకం అవుతుంది. ఈ సమావేశంలో విధాన నిర్ణేతలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను మంగళవారం వెలువడిన ఆర్బీఐ మినిట్స్ వివరించింది. ఈ అభిప్రాయాలను ఒక్కసారి పరిశీలిస్తే... అంతర్జాతీయ భయాలు.. అంతర్జాతీయ బలహీన ఆర్థిక పరిస్థితులు భారత్ వృద్ధి తీరుపై ప్రభావం చూపే పరిస్థితులు పెరిగాయి. ముఖ్యంగా ఇక్కడ వాణిజ్య అంశాను ప్రస్తావించుకోవాలి. అయితే అదే అంతర్జాతీయ పరిస్థితుల వల్ల ద్రవ్యోల్బణం అదుపులో కొనసాగే అవకాశాలూ కనిపిస్తున్నాయి. ఆర్థిక క్రియాశీలత బాగున్నప్పటికీ, ప్రైవేటు పెట్టుబడుల పరిస్థితి ఒత్తిడిలోనే ఉంది. పెరుగుతున్న వినియోగ డిమాండ్‌కు తగిన విధంగా ప్రైవేటు పెట్టుబడులు స్పందించడంలేదు. రేటు కోత వల్ల ఈ అంశంలో కొంత మెరుగుదల కనిపిస్తుంది. - ఆర్.గాంధీ, డిప్యూటీ గవర్నర్ ఇబ్బందులున్నాయ్... ఆర్థిక వ్యవస్థలో పలు విభాగాలు ఇబ్బందుల్లోనే ఉన్నాయి. అయితే వ్యవసాయం, స్టీల్ ఉత్పత్తి, రోడ్లు, రైల్వేలు, జల మార్గాలకు సంబంధించిన పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. రేటు కోత వల్ల మరింత ప్రయోజనం ఉంటుంది. - పాత్ర, ఆర్బీఐ ఈడీ సంస్కరణలు ఫలితాలను ఇస్తాయి... భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటలో క్రమంగా ముందుకు సాగుతోంది. ప్రత్యేకించి పలు ఆర్థిక సంస్కరణలకు సానుకూలంగా స్పందిస్తోంది. డిమాండ్ ఇంకా కొంత బలహీనంగా ఉన్నందున ద్రవ్యోల్బణానికి సంబంధించి పెద్ద ఇబ్బంది ఏదీ ఉండదని భావిస్తున్నా. - ధోలాకియా, ప్రభుత్వ నామినీ వృద్ధికి ఊతం అవసరం... పాలసీ రేటు కోత ద్వారా వృద్ధికి ఊతం ఇవ్వాల్సిన సరైన సమయం ఇది. ఆర్బీఐ నిర్వహించిన కొన్ని సర్వేలు ద్రవ్యోల్బణం మున్ముందు అదుపులోనే ఉంటుందని వివరిస్తున్నాయి. ప్రైవేటు వ్యయాలకు, వినియోగం పెంపునకు రేటు కోత దోహదపడుతుంది. - పామీ దువా, ప్రభుత్వ నామినీ ద్రవ్యోల్బణం స్థిర గణాంకాలే... ఆహార, ఇంధన ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతుండడం కొంత ఆందోళకర అంశమే. అయితే, ఇవి స్థిరపడతాయని, దిగువస్థాయిలోనే కొనసాగుతాయని సర్వేలు పేర్కొంటుండడం వల్ల ఈ దశలో వృద్ధికి ప్రోత్సాహం అందించాలని భావిస్తున్నాను. - చేతన్ ఘాటే, ప్రభుత్వ నామినీ 5% ద్రవ్యోల్బణం లక్ష్యం సాధ్యమే.. కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికానికి ఐదు శాతం ద్రవ్యోల్బణం లక్ష్యం సాధ్యమే. గణాంకాలు, సర్వేలతో పాటు పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, అలాగే పప్పు దినుసుల పరిస్థితి చూసినా దీనిని ధ్రువీకరించుకునే పరిస్థితి ఉంది. ఆర్థిక క్రియాశీలత మెరుగుపడుతున్నప్పటికీ, ప్రస్తుతానికి అవుట్‌లుక్ బలహీనంగానే ఉంది. పరిశ్రమల సామర్థ్య వినియోగమూ తక్కువ స్థాయిలోనే ఉంది. దీనివల్ల ప్రైసింగ్ పవర్ బలహీనంగా కొనసాగే అవకాశాలే ఉన్నాయి. - ఉర్జిత్ పటేల్, ఆర్బీఐ గవర్నర్ -
కీలక రెపో రేట్ లో కోత
-
కీలక రెపో రేట్ లో కోత
ముంబై: రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా 2016-17 నాల్గవ ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లలోకోత పెట్టింది. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన డెబ్యూ పాలసీ సమీక్షలో లో కీలక రెపో రేటులో కోత పెట్టారు. రెపో (బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు) 25 బేసిస్ పాయింట్లను తగ్గించారు. ప్రస్తుతం ఉన్న 6.50 శాతంనుంచి 6.25 గా నిర్ణయించారు. ఆర్బీఐ గవర్నర్ గా ఉర్జిత్ పటేల్ కు తన మొట్టమొదటి పాలసీ రివ్యూలో మ్యాజిక్ చేశారు. మంగళవారం ప్రకటించిన ద్రవ్యపరపతి విధానం సమీక్ష తో వడ్డీ రేట్లు ఆరేళ్ల కనిష్ట స్థాయికి దిగి వచ్చాయి. ఈ దఫా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అత్యున్నత స్థాయి కమిటీ- ఎంపీసీ తొలిసారిగా కీలక వడ్డీ రేట్లను నిర్ణయం చేసింది. ఆరుగురు సభ్యులు వడ్డీ రేట్ల కోతకు ఆమోదం తెలిపారు. కాగా ఆర్ బీఐ గవర్నర్ గా ఉర్జిత్ పటేల్ కు కూడా ఇది మొదటి పరపతి విధాన సమీక్ష కానుండటం విశేషం. ప్రభుత్వం తరఫున కమిటీలో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ చేతన్ ఘాటే, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ డెరైక్టర్ పామి దువా, ఐఐఎం- అహ్మదాబాద్‌లో ప్రొఫెసర్ రవీంద్ర హెచ్ ధోలాకియాతో పాటు కమిటీలో ఆర్బీఐ తరఫున ముగ్గురు నామినీలు కలిసి మొత్తం ఆరుగురు వ్యక్తులు కమిటీ సభ్యులుగా ఉన్నసంగతి తెలిసిందే. -
‘రెపో’కు మెజారిటీ నే ప్రాతిపదిక
3-4 తేదీల్లో ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ భేటీ ముంబై: కీలక పాలసీరేటు రెపో (బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 6.5 శాతం) ఈ దఫా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అత్యున్నత స్థాయి కమిటీ- ఎంపీసీ మెజారిటీ ప్రాతిపదికన నిర్ణయం కానుంది. ఈ కమిటీ నియామకాన్ని ప్రభుత్వం గురువారం నోటిఫై చేసింది. దీనితో పాలసీ సమీక్షకు అక్టోబర్ 3, 4 తేదీల్లో ఇక్కడ ఆర్బీఐ ఆరుగురు సభ్యుల సమావేశం 2016-17 నాల్గవ ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష జరగనుంది. కమిటీ ఇదీ... ప్రభుత్వం తరఫున కమిటీలో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ చేతన్ ఘాటే, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ డెరైక్టర్ పామి దువా, ఐఐఎం- అహ్మదాబాద్‌లో ప్రొఫెసర్ రవీంద్ర హెచ్ ధోలాకియాలు ఉన్నారు. ఈ ముగ్గురితో పాటు కమిటీలో ఆర్బీఐ తరఫున ముగ్గురు నామినీలు కలిసి మొత్తం ఆరు ఓట్ల మెజారిటీ ప్రాతిపదికన పరపతి విధాన సమీక్ష సందర్భంగా రెపో రేటు నిర్ణయం ఉంటుంది. ఒకవేళ రేటు నిర్ణయంలో కమిటీ చెరిసమానంగా చీలిపోతే... ఆర్బీఐ గవర్నర్ గా ఆయన అదనపు ఓటు కీలకం అవుతుంది. ఇక కమిటీలో ఆర్బీఐ గవర్నర్, ఒక డిప్యూటీ గవర్నర్, మరో ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. ఇప్పటి వరకూ సలహాకు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఉన్నప్పటికీ, దీనిని తోసిపుచ్చి ఆర్బీఐ గవర్నర్ సొంతంగా రెపో రేటు నిర్ణయం తీసుకునే వీలుంది. సమయం మార్పు కాగా పాలసీ సమీక్ష ఉదయం 11 గంటలకు జరుగుతుండగా ఇకమీదట ఈ సమావేశాన్ని మధ్యాహ్నం 2.30కి మార్చడం జరిగిందని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. -
రేట్లలో కోత లేదు.. రెపో 6.5శాతమే
ముంబై: మెజారిటీ విశ్లేషకులు అంచనా వేసిన మాదిరిగానే ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ నిర్ణయం వెలువడింది. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను 6.5 శాతంగానే ఉంచుతున్నట్టు వెల్లడించారు. ఈ రేటుపై ఎలాంటి కోత విధించలేదని పేర్కొన్నారు. అలాగే సీఆర్ఆర్ 4 శాతంగా ఉంది. మంగళవారం జరిగిన ప్రస్తుత ఆర్థిక సంవత్సర మొట్టమొదటి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ గవర్నర్ ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే రాజన్ వెలువరిచిన ఈ పాలసీని విశ్లేషకులు, మార్కెట్ వర్గాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సెప్టెంబర్ తో రాజన్ పదవి ముగియనుండటం, మరో మారు ఆర్బీఐ గవర్నర్ గా రాజన్ నే కొనసాగించాలని చర్చనీయాంశాలు జోరు అందుకోవడంతో, ఆర్ బీఐ పాలసీ ఎలా ఉండబోతుందనే దానిపై ఎక్కువగా దృష్టిసారించారు. 2013 సెప్టెంబర్ లో ఆర్బీఐ గవర్నర్ గా రాజన్ మూడేళ్ల బాధ్యతలు చేపట్టారు. ఒకవేళ రాజన్ పదవిని కొనసాగించకపోతే నేడు వెలువరించిన పాలసీనే రాజన్ కు ఆఖరిదని విశ్లేషకులంటున్నారు. రాజన్ మూడేళ్ల బాధ్యతలు చేపట్టిన తర్వాత క్రమంగా రుణ బెంచ్‌మార్క్ రేటు- రెపో రేటును 7.25 శాతం నుంచి 8 శాతానికి పెంచారు. అటుతర్వాత ఆర్థికశాఖ, పరిశ్రమల నుంచి వచ్చిన ఒత్తిడులు, ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో క్రమంగా రెపో రేటును 1.50 శాతం తగ్గించారు. దీనితో ఈ రేటు ప్రస్తుతం 6.5 శాతానికి దిగివచ్చింది. ప్రస్తుతం కొనసాగుతున్న రెపో రేటును ఏ మాత్రం మార్పుల చేయలేదు. నేడు వెలువరిచిన ఆర్ బీఐ ద్రవ్యపరపతి సమీక్ష సందర్భంగా తెలుసుకోవాల్సిన అంశాలు... ఈ రేటును ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ, విశ్లేషకులు నిర్ణయించారు. తర్వాతి పాలసీ ఆగస్టులో వెలువడే వరకూ ఈ రేట్లే అమలుల్లో ఉండనున్నాయి. ఈ రేటుపై నిర్ణయం తీసుకున్న ద్రవ్యవిధాన కమిటీ ఏర్పాటు బిల్లుకు పార్లమెంటులో ఆమోదం లభించింది. ఆరుగురు సభ్యులున్న ఈ కమిటీలో ముగ్గురిని కేంద్రప్రభుత్వం నామినేట్ చేస్తోంది. మరో ముగ్గురు ఆర్ బీఐకి చెందిన వ్యక్తులుంటారు. ఆర్ బీఐ గవర్నర్ ఓటింగ్ అధికారం కలిగి ఉంటారు. నేడు వెలువరించిన ద్రవ్యవిధాన పాలసీలో ఎక్కువగా ఆర్ బీఐ గవర్నర్ గా రాజన్ నే కొనసాగిస్తారా..? అనే అంశంపైనే అందరూ దృష్టిసారించారు. ప్రతి ఆర్ బీఐ గవర్నర్ పదవి ముగుస్తుందనగా.. వారికి పదవిని రెండేళ్లు పొడిగించేవారు. మరి రాజన్ కు ఏ నిర్ణయం తీసుకోబోతుందన్నదే చర్చనీయాంశం. బీజేపీలో ఫైర్ బ్రాండ్ గా ఉన్న నేత సుబ్రహ్మణ్య స్వామి, రాజన్ పదవి కొనసాగింపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వడ్డీరేట్లు తగ్గించకపోవడం వల్లే ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మానసికంగా రాజన్ భారతీయుడు కాదని వ్యాఖ్యానిస్తున్నారు. అమెరికా జారీచేసిన గ్రీన్ కార్డ్ ను ఆయన ఇంకా రెన్యూవల్ చేప్పించుకుంటున్నారని ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు. సెప్టెంబర్ లో రాజన్ పదవి ముగుస్తుండటంతో, అప్పుడే దీనిపై నిర్ణయం తీసుకుంటామని, ప్రస్తుతం దీనిపై ఎలాంటి చర్చ వద్దని మోదీ ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు రాజన్ పదవి పొడిగింపుకు మోదీకి ఎలాంటి అభ్యతరం లేదని సంకేతాలు వెలువడుతున్నాయి. నెట్ సిటిజన్లు, మెజార్టి విశ్లేషకుల నుంచి కూడా రాజన్ కు ఆదరణ గణనీయంగా పెరుగుతోంది. బ్యాంకులకు ఆర్ బీఐ ఇచ్చే రుణాలపై రేటు.. రెపోను 6.50గానే ఉంచుతుందని మెజార్టి విశ్లేషకులు భావించారు. మార్చిలో 4.83శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్ లో 5.39శాతంగా పెరగడం దీనికి కారణంగా చూపారు. 2017 మార్చిలో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 5శాతం కంటే తక్కువ స్థాయికి తీసుకురావడమే ఆర్ బీఐ ప్రధాన లక్ష్యం. ఇటీవల ఆయిల్ ధరలు పెరగడం వల్ల రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగిందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. 7వ వేతన సంఘ సిఫారసులను అమలుచేయడం వల్ల, కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు వేతనాలు పెరిగాయని, దీంతో ధరలు ఎగబాకాయని చెబుతున్నారు. రేట్లలో కోత విధింపు అంశం రుతుపవనాల వల్ల కురిసే వర్షాలపై ఆధారపడి ఉంటుందని, రాజన్ కూడా రేటు కోత విధించకుండా రుతుపవనాల కోసం వేచిచూస్తున్నారని ఈ నిర్ణయంతో వెల్లడైంది.. వాతావరణ నిపుణులు ఈ ఏడాది రుతుపవనాలు బాగుంటాయని అంచనావేస్తున్నారు. రెండేళ్ల కరువు అనంతరం ఈ ఏడాది రుతుపవనాలు ఆర్థికవ్యవస్థకు మేలు చేకూర్చబోతున్నాయని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. మంచి రుతుపవనాలు, గ్రామీణ వినియోగాన్ని పెంచుతుందంటున్నారు. అమెరికా సెంట్రల్ బ్యాంక్- ఫెడ్ ఫండ్ రేటుపై ఈ నెల 15-16 తేదీల్లో నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో ఆర్బీఐ తాజా సమీక్ష జరుగుతుండటం విశేషం. -
యథాతథంగా రేటు బదలాయించలేం!
‘రెపో’పై ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య డిపాజిట్ల వ్యవస్థ అందుకు వీలుకల్పించదని విశ్లేషణ కోల్‌కతా: భారత్‌లో రిజర్వుబ్యాంక్ ఉపయోగించే రెపో రేటు సాధనాన్ని పటిష్టవంతంగా అమలుచేయడం సాధ్యం కాదని బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చీఫ్ అరుంధతీ భట్టాచార్య గురువారం ఇక్కడ ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. రెపో రేటుకు అనుగుణంగా తమ రుణ రేట్లను బ్యాంకులు సర్దుబాటు చేయలేవని ఎస్బీఐ చీఫ్ పేర్కొన్నారు. బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణంపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటే రెపో. ఈ ఏడాది ఈ రేటును ఆర్బీఐ 1.25% తగ్గించింది. దీనితో ఈ రేటు 6.75%కి తగ్గింది. తాను రెపో రేటును 1.25% తగ్గించినప్పటికీ, బ్యాంకులు దాదాపు 0.70% వరకూ తమ రుణ రేటును తగ్గించాయని, తన నుంచి అందిన ‘రుణ రేటు’ ప్రయోజనాన్ని పూర్తిగా బ్యాంకింగ్ బదలాయించడం లేదని ఆర్బీఐ పదేపదే చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో అరుంధతీ భట్టాచార్య ఈ వ్యాఖ్య చేశారు. కారణం ఏమిటంటే...! భారత్ బ్యాంకులు ప్రధానంగా ఆధారపడేది డిపాజిట్లపైనేనని ఆమె ఈ సందర్భంగా వివరించారు. తమ నిధులకు మార్కెట్ రుణాలపై బ్యాంకులు ఆధారపడవన్నది గుర్తించాలని, ఇలాంటి పరిస్థితుల్లో రెపో రేటు యథాతథంగా బ్యాంకింగ్ అమలు చేయలేదని వివరించారు. ఎస్బీఐ నిధులకు సంబంధించి 97 శాతం ఆధారపడేది డిపాజిట్లపైనేని ఆమె ఈ సందర్భంగా పేర్కొంటూ... ఈ పరిస్థితుల్లో బ్యాంక్ వ్యయ భారాన్ని తగ్గించుకోడానికి రెపో రేటులో మార్పు ఎంతమాత్రం దోహదపడదని తెలిపారు. విదేశీ బ్యాంకులు తమ నిధులకు దాదాపు 30 నుంచి 40 శాతం మార్కెట్ రుణాలపై ఆధారపడతాయని ఆమె వివరిస్తూ... అలాంటి పరిస్థితుల్లో మాత్రమే రెపో రేటును తక్షణం యథాతథంగా అమలు చేయడం సాధ్యమవుతుందని వివరించారు. 2013లో ఆర్బీఐ రెపో రేటును 3 శాతం పెంచిందని ఆమె పేర్కొంటూ... ఆ మేరకు బ్యాంకులు తమ రుణ రేటు పెంచలేదని వివరించారు. కాగా మార్జినల్ కాస్ట్ ఆధారిత బేస్ రేటుపై ఆర్బీఐ తాజా మార్గదర్శకాలను ఆమె ప్రస్తావిస్తూ, బాగా ఆలోచించే వీటిని రూపొందిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే మార్గదర్శకాలు ఎలా ఉన్నాయన్న అంశంపై అవి వెలువడిన తర్వాతే వ్యాఖ్యానించగలనని పేర్కొన్నారు. కాగా ముసాయిదా మార్గదర్శకాలు ఆచరణయోగ్యం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. -
‘దిల్’ భూముల స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: దక్కన్ ఇన్ఫ్రాస్టక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్‌కు (డీఐఎల్ఎల్) గతంలో కేటాయించిన భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటోంది. యాదగిరిగుట్ట అభివృద్ధిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి ఆమోదం తెలుపడంతో నేడో రేపో అందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ కానున్నాయి. గత ప్రభుత్వాలు హౌసింగ్ బోర్డుకు అనుబంధంగా ఏర్పడ్డ దిల్‌కు రాష్ట్రంలో పలు చోట్ల భూములు కేటాయించాయి. పారిశ్రామిక అవసరాల నిమిత్తం వీటిని వినియోగించాలనే నిబంధనతో అప్పగించాయి. వీటిలో 529 ఎకరాలు యాదగిరిగుట్ట పరిసరాల్లోనే ఉన్నాయి. ఇక్కడి గుట్టలు... ఎత్తై ప్రాంతాలు ఉండటంతో కొత్త పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రాలేదు. దీంతో ఇక్కడి భూములన్నీ నిరుపయోగంగానే మిగిలిపోయాయి. ఇటీవల గుట్టను యాదాద్రి క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. అందులో భాగంగా సీఎం కేసీఆర్ అధ్యక్షతన యాదగిరిగుట్ట డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది. దీంతో ఆ ప్రాంతాల ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అడుగులు ముందుకేసింది. గతంలో దిల్‌కు కేటాయించిన భూములన్నీ నిరుపయోగంగా ఉండటంతో వీటిపై దృష్టి సారించింది. రెవెన్యూ విభాగం నుంచి సమాచారం సేకరించింది. దిల్‌కు ఇచ్చి న 529 ఎకరాల భూములను వెనక్కి తీసుకొని.. గుట్ట డెవెలప్మెంట్ అథారిటీకి బదిలీ చే యాలని నిర్ణయించింది. మార్చిలో సీఎస్ రాజీవ్‌శర్మ సమక్షంలో జరిగిన సమావేశంలోనే ఈ మేరకు తీర్మానం చేశారు. గుట్ట పరిసరాల్లో చేపట్టే అభివృద్ధి పనులకు దాదాపు రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో భూములు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ప్రాంతంలోని ప్రభుత్వ భూములను సర్వే చేయించి ఖాళీగా ఉన్న రెవెన్యూ భూములను వెంటనే టెంపుల్ అథారిటీకి అప్పగించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే దిల్‌కు కేటాయించిన భూములను స్వాధీనం చేసుకునేందుకు ఫైలు సిద్ధం చేశారు. సీఎం ఆమోదముద్ర వేయటంతో అందుకు లైన్ క్లియర్ అయినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.