‘దిల్’ భూముల స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: దక్కన్ ఇన్‌ఫ్రాస్టక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్‌కు (డీఐఎల్‌ఎల్) గతంలో కేటాయించిన భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటోంది. యాదగిరిగుట్ట అభివృద్ధిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి ఆమోదం తెలుపడంతో నేడో రేపో అందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ కానున్నాయి. గత ప్రభుత్వాలు హౌసింగ్ బోర్డుకు అనుబంధంగా ఏర్పడ్డ దిల్‌కు రాష్ట్రంలో పలు చోట్ల భూములు కేటాయించాయి. పారిశ్రామిక అవసరాల నిమిత్తం వీటిని వినియోగించాలనే నిబంధనతో అప్పగించాయి.
వీటిలో 529 ఎకరాలు యాదగిరిగుట్ట పరిసరాల్లోనే ఉన్నాయి. ఇక్కడి గుట్టలు... ఎత్తై ప్రాంతాలు ఉండటంతో కొత్త పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రాలేదు. దీంతో ఇక్కడి భూములన్నీ నిరుపయోగంగానే మిగిలిపోయాయి. ఇటీవల గుట్టను యాదాద్రి క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. అందులో భాగంగా సీఎం కేసీఆర్ అధ్యక్షతన యాదగిరిగుట్ట డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది. దీంతో ఆ ప్రాంతాల ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అడుగులు ముందుకేసింది. గతంలో దిల్‌కు కేటాయించిన భూములన్నీ నిరుపయోగంగా ఉండటంతో వీటిపై దృష్టి సారించింది.
రెవెన్యూ విభాగం నుంచి సమాచారం సేకరించింది. దిల్‌కు ఇచ్చి న 529 ఎకరాల భూములను వెనక్కి తీసుకొని.. గుట్ట డెవెలప్‌మెంట్ అథారిటీకి బదిలీ చే యాలని నిర్ణయించింది. మార్చిలో సీఎస్ రాజీవ్‌శర్మ సమక్షంలో జరిగిన సమావేశంలోనే ఈ మేరకు తీర్మానం చేశారు. గుట్ట పరిసరాల్లో చేపట్టే అభివృద్ధి పనులకు దాదాపు రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో భూములు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు.
ఈ ప్రాంతంలోని ప్రభుత్వ భూములను సర్వే చేయించి ఖాళీగా ఉన్న రెవెన్యూ భూములను వెంటనే టెంపుల్ అథారిటీకి అప్పగించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే దిల్‌కు కేటాయించిన భూములను స్వాధీనం చేసుకునేందుకు ఫైలు సిద్ధం చేశారు. సీఎం ఆమోదముద్ర వేయటంతో అందుకు లైన్ క్లియర్ అయినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.