ముంబై: ఆర్‌బీఐ ఎంపీసీ ద్వైమాసిక పరపతి సమీక్ష బుధవారం ప్రారంభం కానుంది. ఇందులో తీసుకున్న నిర్ణయాలను ఈ శుక్రవారం (30న) ఉదయం ఎంపీసీ ప్రకటించనుంది. గరిష్టంగా 0.50 శాతం వరకు రెపో రేటును పెంచొచ్చని మెజారిటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గరిష్ట పరిమితి అయిన 6 శాతానికి పైనే ఏడు నెలలుగా ద్రవ్యోల్బణం కొనసాగుతోంది. ఆగస్ట్ నెలకు కూడా 7 శాతానికి పైనే నమోదైంది. దీంతో ద్రవ్యోల్బణం కట్టడికి రేట్ల పెంపు అనివార్యమే అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది మే నుంచి మూడు విడతల్లో ఆర్‌బీఐ రెపో రేటును 1.4 శాతం మేర పెంచడంతో అది 5.4 శాతానికి చేరింది.
యూఎస్ ఫెడ్ కూడా ప్రతి పర్యాయం 0.75 శాతం మేర రేట్లను పెంచుతూ వస్తుండడం తెలిసిందే. అంతేకాదు రానున్న సమీక్షల్లోనూ రేట్ల పెంపు ఉంటుందని సంకేతాలు ఇచ్చింది. అటు యూకే, ఈయూ కూడా రేట్ల పెంపు బాటలోనే నడుస్తున్నాయి. ఇది రూపాయి మారకం విలువపై ప్రభావం చూపిస్తోంది. తాజా సమీక్షలో రూపాయి మారకం, ద్రవ్యోల్బణం, ఆర్ధిక వృద్ధిపై ఎంపీసీ కీలక చర్చ నిర్వహించనుంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని రేట్ల పెంపు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం (ప్లస్ 2, మైనస్ 2) పరిధిలో నియంత్రించాలన్నది ఆర్‌బీఐ లక్ష్యం.
పెంపు తప్పదు..
50 బేసిస్ పాయింట్ల (0.50 శాతం) పెంపు ఉంటుందని ఇక్రా ముఖ్య ఆర్థిక వేత్త అదితి నాయర్ అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందిన దేశాలు సైతం రేట్ల పెంపు నిర్ణయాలు తీసుకుంటున్నందున.. ఆర్‌బీఐ నుంచి మరిన్ని రేటు పెంపు చర్యలు కొనసాగుతాయని భావిస్తున్నట్టు మాజీ గవర్నర్ సి.రంగరాజన్ సైతం ఇటీవలే అభిప్రాయం వ్యక్తం చేశారు. రిటైల్, టోకు ధరల ద్రవ్యోల్బణం అధిక స్థాయిల్లోనే కొనసాగుతుండడాన్ని బార్‌క్లేస్ సెక్యూరిటీస్ ఇండియా ముఖ్య ఆర్థికవేత్త రాహుల్ బజోరియా గుర్తు చేశారు ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ నెల చివర్లో జరిగే సమీక్షలో 0.50 శాతం మేర రేటు పెంపు ఉంటుందన్నారు. సెప్టెంబర్ 30న ఆర్‌బీఐ రెపో రేటును 0.35 శాతం మేర పెంచొచ్చని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. జపాన్ బ్రోకరేజీ సంస్థ అయిన నోమురా సైతం ఈ నెల చివర్లో 0.35 శాతం, డిసెంబర్ సమీక్షలో 0.25 శాతం చొప్పున రేట్ల పెంపు ఉంటుందని అంచనాతో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment