రేట్ల కోత ఏకాభిప్రాయమే.. | RBI monetary policy panel prioritized growth as inflation risks ease | Sakshi
Sakshi News home page

రేట్ల కోత ఏకాభిప్రాయమే..

Published Wed, Oct 19 2016 12:59 AM | Last Updated on Mon, Sep 4 2017 5:36 PM

రేట్ల కోత ఏకాభిప్రాయమే..

రేట్ల కోత ఏకాభిప్రాయమే..

అక్టోబర్ 4 ఆర్‌బీఐ విధాన సమీక్ష మినిట్స్ విడుదల

 ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అక్టోబర్ 3, 4 తేదీల్లో జరిగిన  తన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను పావుశాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 6.25 శాతానికి పడింది. గవర్నర్  ఉర్జిత్ పటేల్ అధ్యక్షతన జరిగిన ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఏకాభిప్రాయ ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకుంది.

ఇప్పటి వరకూ గవర్నర్ సొంత నిర్ణయానికి సంబంధించిన ఈ కీలక రేటు అంశం అందరి ఆమోదం మేరకే తప్పనిసరిగా జరగాల్సిన ఆవశ్యకత నెలకొనడం  అక్టోబర్ 4 ప్రత్యేకత. సభ్యులు ఆరుగురు సమంగా చీలిపోతేనే గవర్నర్ ‘కాస్టింగ్ ఓటు’ కీలకం అవుతుంది.  ఈ సమావేశంలో విధాన నిర్ణేతలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను మంగళవారం వెలువడిన  ఆర్‌బీఐ మినిట్స్ వివరించింది. ఈ అభిప్రాయాలను ఒక్కసారి పరిశీలిస్తే...

అంతర్జాతీయ భయాలు..
అంతర్జాతీయ బలహీన ఆర్థిక పరిస్థితులు భారత్ వృద్ధి తీరుపై ప్రభావం చూపే పరిస్థితులు పెరిగాయి. ముఖ్యంగా ఇక్కడ వాణిజ్య అంశాను ప్రస్తావించుకోవాలి. అయితే అదే అంతర్జాతీయ పరిస్థితుల వల్ల ద్రవ్యోల్బణం అదుపులో కొనసాగే అవకాశాలూ కనిపిస్తున్నాయి. ఆర్థిక క్రియాశీలత బాగున్నప్పటికీ, ప్రైవేటు పెట్టుబడుల పరిస్థితి ఒత్తిడిలోనే ఉంది.  పెరుగుతున్న వినియోగ డిమాండ్‌కు తగిన విధంగా ప్రైవేటు పెట్టుబడులు స్పందించడంలేదు.  రేటు కోత వల్ల ఈ అంశంలో కొంత మెరుగుదల కనిపిస్తుంది.
- ఆర్.గాంధీ, డిప్యూటీ గవర్నర్

 ఇబ్బందులున్నాయ్...
ఆర్థిక వ్యవస్థలో పలు విభాగాలు ఇబ్బందుల్లోనే ఉన్నాయి. అయితే వ్యవసాయం, స్టీల్ ఉత్పత్తి, రోడ్లు, రైల్వేలు, జల మార్గాలకు సంబంధించిన పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. రేటు కోత వల్ల మరింత ప్రయోజనం ఉంటుంది. - పాత్ర, ఆర్‌బీఐ ఈడీ

సంస్కరణలు ఫలితాలను ఇస్తాయి...
భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటలో క్రమంగా ముందుకు సాగుతోంది. ప్రత్యేకించి పలు ఆర్థిక సంస్కరణలకు సానుకూలంగా స్పందిస్తోంది. డిమాండ్ ఇంకా కొంత బలహీనంగా ఉన్నందున ద్రవ్యోల్బణానికి సంబంధించి పెద్ద ఇబ్బంది ఏదీ ఉండదని భావిస్తున్నా.
- ధోలాకియా, ప్రభుత్వ నామినీ

 వృద్ధికి ఊతం అవసరం...
పాలసీ రేటు కోత ద్వారా వృద్ధికి ఊతం ఇవ్వాల్సిన సరైన సమయం ఇది. ఆర్‌బీఐ నిర్వహించిన కొన్ని సర్వేలు ద్రవ్యోల్బణం మున్ముందు అదుపులోనే ఉంటుందని వివరిస్తున్నాయి. ప్రైవేటు వ్యయాలకు, వినియోగం పెంపునకు రేటు కోత దోహదపడుతుంది.
- పామీ దువా, ప్రభుత్వ నామినీ

 ద్రవ్యోల్బణం స్థిర గణాంకాలే...
ఆహార, ఇంధన ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతుండడం కొంత ఆందోళకర అంశమే. అయితే, ఇవి స్థిరపడతాయని, దిగువస్థాయిలోనే కొనసాగుతాయని సర్వేలు పేర్కొంటుండడం వల్ల ఈ దశలో వృద్ధికి ప్రోత్సాహం అందించాలని భావిస్తున్నాను.
- చేతన్ ఘాటే, ప్రభుత్వ నామినీ

5% ద్రవ్యోల్బణం లక్ష్యం సాధ్యమే..
కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికానికి ఐదు శాతం ద్రవ్యోల్బణం లక్ష్యం సాధ్యమే. గణాంకాలు, సర్వేలతో పాటు పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, అలాగే పప్పు దినుసుల పరిస్థితి చూసినా దీనిని ధ్రువీకరించుకునే పరిస్థితి ఉంది.   ఆర్థిక క్రియాశీలత మెరుగుపడుతున్నప్పటికీ, ప్రస్తుతానికి అవుట్‌లుక్ బలహీనంగానే ఉంది. పరిశ్రమల సామర్థ్య వినియోగమూ తక్కువ స్థాయిలోనే ఉంది. దీనివల్ల ప్రైసింగ్ పవర్ బలహీనంగా కొనసాగే అవకాశాలే ఉన్నాయి.
- ఉర్జిత్ పటేల్, ఆర్‌బీఐ గవర్నర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement