ధరల భయం.. వడ్డీరేట్లు యథాతథం! | RBI MPC Meeting 2024: RBI keeps repo rate unchanged | Sakshi
Sakshi News home page

RBI MPC Meeting 2024: ధరల భయం.. వడ్డీరేట్లు యథాతథం!

Published Fri, Aug 9 2024 6:40 AM | Last Updated on Fri, Aug 9 2024 9:28 AM

RBI MPC Meeting 2024: RBI keeps repo rate unchanged

వరుసగా 9వసారీ ఎక్కడి రేట్లు అక్కడే...

దీంతో 6.5%  వద్దే రెపోరేటు కొనసాగింపు

ద్రవ్యోల్బణం 4.5శాతంగా  ఉద్ఘాటన

జీడీపీ వృద్ధి అంచనా 7.2 శాతంగానే 

ముంబై: ద్రవ్య, పరపతి విధానాన్ని యథాతథంగా కొనసాగిస్తున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గురువారం స్పష్టం చేసింది. దీనితో వరుసగా తొమ్మిదవసారి బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే బెంచ్‌మార్క్‌ వడ్డీరేటు– రెపో యథాతథంగా 6.5 శాతంగా కొనసాగనుంది. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్‌ రుణ రేట్లు దాదాపు యథాపూర్వం మున్ముందూ కొనసాగనున్నాయి. గవర్నర్‌ శక్తికాంతదాస్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన (ఎంపీసీ) కమిటీ మూడురోజుల సమావేశ నిర్ణయాలు గురువారం వెలువడ్డాయి.  

0.25 శాతం రేటు తగ్గింపునకు ఇద్దరు మొగ్గు 
గవర్నర్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీలో నలుగురు యథాతథ 6.5 శాతం రేటు కొనసాగించడానికి మొగ్గుచూపగా, పావు శాతం రేటు తగ్గింపునకు ఇద్దరు ఓటువేశారు. వీరిలో ఎక్స్‌టర్నల్‌ సభ్యులు జయంత్‌ వర్మతోపాటు అషిమా గోయల్‌ ఉన్నారు. ‘ఆహార ద్రవ్యోల్బణం తీవ్రత తాత్కాలికమే కావచ్చు. అయితే అధిక ద్రవ్యోల్బణం కొనసాగుతున్న ప్రస్తుత వాతావరణంలో ద్రవ్య విధాన కమిటీ దీనిని సహించబోదు’ అని పాలసీ ప్రకటనలో గవర్నర్‌ ఉద్ఘాటించారు.   

మారని వృద్ధి, ద్రవ్యోల్బణం అంచనాలు... 
ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వృద్ధి,  ద్రవ్యోల్బణం అంచనాలను ఆర్‌బీఐ పాలసీ సమీక్ష వరుసగా 7.2 శాతం, 4.5 శాతాలుగా యథాతథంగా కొనసాగించింది. ఒకపక్క ద్రవ్యోల్బణాన్ని కట్టడిచేస్తూ మరోవైపు వృద్దికి ఊతం ఇచ్చే చర్యలను ఆర్‌బీఐ కొనసాగిస్తుందని గవర్నర్‌ స్పష్టం చేశారు.  దీనికి దేశంలో తగిన వర్షపాతం దోహదపడుతుందని అన్నారు. 2024–25లో 4 త్రైమాసికాల్లో వృద్ది రేట్లు వరుసగా 7.1%, 7.2%, 7.3%, 7.2%గా కొనసాగుతాయన్నది పాలసీ సమీక్ష అంచనా. 2025–26 తొలి త్రైమాసికంలో (2026 ఏప్రిల్‌–జూన్‌) వృద్ధి 7.2%గా ఉంటుందని కూడా ఆర్‌బీఐ అంచనావేసింది. ఇక రిటైల్‌ ద్రవ్యోల్బణం నాలుగు త్రైమాసికాల్లో వరుసగా 4.9%, 4.4%, 4.7%, 4.3%గా ఉంటాయని విశ్లేషించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఈ స్పీడ్‌ 4.4%గా ఉంటుందన్నది ఆర్‌బీఐ అంచనా. 2% అటు ఇటుగా 4% వద్ద రిటైల్‌ ద్రవ్యోల్బణం ఉండేలా చూడాలని ఆర్‌బీఐకి కేంద్రం సూచిస్తోంది. 

పాలసీ ముఖ్యాంశాలు... 
→ మందగమనంలో ఉన్నప్పటికీ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ సవాళ్లను తట్టుకునే స్థాయిలోనే కొనసాగుతోంది.  
→ దేశీయ ఆర్థిక, ఫైనాన్షియల్‌ వ్యవస్థలు  పటిష్ట ధోరణిలోనే కొనసాగుతున్నాయి.  
→ దేశంలోకి ఒక నిర్దిష్ట కాలంలో వచీ్చ–వెళ్లే విదేశీ నిధులకు సంబంధించిన కరెంట్‌ అకౌంట్‌ లోటు (క్యాడ్‌) నిర్వహణ బాగుంది. 
→ విదేశీ మారకద్రవ్య నిల్వలు 675 బిలియన్‌ డాలర్ల చరిత్రాత్మక గరిష్ట స్థాయిలో ఉన్నాయి.  
→ 2024–25లో ఇప్పటి వరకూ రూపాయి తీవ్ర ఒడిదుడుకులతో కాకుండా ఒక నిర్దిష్ట స్థాయిలోనే కొనసాగుతోంది.  
→ గృహ రుణాలతో సహా నిర్దేశించిన అవసరాలకు టాప్‌–అప్‌ను వినియోగించకపోవడం ఆందోళనకరమే. అయితే ద్వైపాక్షిక ప్రాతిపదికన సమస్యను పరిష్కరించడానికి చర్యలు కొనసాగుతాయి. 
→ చెక్‌ క్లియరెన్స్‌ని వేగవంతం చేయడానికి చర్యలు ఉంటాయ్‌. 
→ అక్టోబర్‌ 7 నుంచి 9 వరకూ తదుపరి పాలసీ సమీక్ష చేపట్టనున్నారు.

అనధికార డిజిటల్‌ లెండింగ్‌పై ఉక్కుపాదం 
అనధికార సంస్థల ఆట కట్టించడానికి డిజిటల్‌ లెండింగ్‌ యాప్‌ల పబ్లిక్‌ రిపాజిటరీ ఏర్పాటు కానుంది. నియంత్రణలోని సంస్థలు (ఆర్‌ఈ) ఈ రిపోజిటరీలో తమ డిజిటల్‌ లెండింగ్‌ యాప్‌ల గురించిన సమాచారాన్ని నివేదించాలి. అలాగే ఎప్పటికప్పుడు  సంబంధిత లావాదేవీల వివరాలను అప్‌డేట్‌ చేయాలి. అనధికార రుణ యాప్‌లను గుర్తించడంలోవినియోగదారులకు ఇది ఎంతగానో దోహదపడుతుంది.  

యూపీఐ ద్వారా  రూ.5 లక్షల వరకు పన్ను చెల్లింపులు 
యూపీఐ  ద్వారా పన్ను చెల్లింపుల పరిమితిని ఒక్కో లావాదేవీకి రూ. లక్ష నుండి రూ. 5 లక్షలకు పెంచాలని పాలసీ నిర్ణయించింది. ఇది యూపీఐ ద్వారా   పన్ను చెల్లింపులను మరింత సులభతరం చేయనుంది. ఇక యూపీఐ లావాదేవీలు చేయడానికి ఒక వ్యక్తి మరో వ్యక్తిని అను మతించడానికి సంబంధించి తాజాగా ‘డెలిగేటెడ్‌ పేమెంట్‌’ సదుపాయం   ఏర్పాటు చేస్తుండడం మరో కీలకాంశం.  

బ్యాంక్‌ డిపాజిట్లు పెరగాలి 
ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గాల వైపు గృహ పొదుపులు మారడంపై   శక్తికాంత దాస్‌ ఆందోళన వ్యక్తం చేశారు.   బ్యాంకులు తమ విస్తారమైన బ్రాంచ్‌ నెట్‌వర్క్‌ ను ఉపయోగించుకోవడం, అలాగే వినూత్న ఉత్పత్తులు, సేవల ద్వారా డిపాజిట్లను సమీకరించాలని కోరారు.

ఫుడ్‌ వెయిటేజ్‌పై సమీక్ష  
బెంచ్‌మార్క్‌ వడ్డీ రేటును నిర్ణయించేటప్పుడు ఆహార ద్రవ్యోల్బణాన్ని మినహాయించాలన్న తాజా ఆర్థికసర్వే సూచనలను గవర్నర్‌  దాస్‌ పరోక్షంగా తోసిపుచ్చారు.  ద్రవ్య విధానాన్ని రూపొందించేటప్పుడు  ఆర్‌బీఐ ఆహార ద్రవ్యోల్బణాన్ని విస్మరించబోదని స్పష్టం చేశారు. అయితే వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణంలో ఆహార వెయిటేజ్‌ 2011–12 నుంచి 46 శాతంగా కొనసాగుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, దీనిని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 

ద్రవ్యోల్బణం తీరిది... 
అయితే రిటైల్‌ ద్రవ్యోల్బణం 4  శాతం పూర్తి లక్ష్యాన్ని సాధించడంలో ఆహార ధరలు ఒడిదుడుకులు తీవ్ర అడ్డంకిగా మారుతున్నాయి. ఇదే అంశంపై ఆందోళన వ్యక్తంచేస్తూ ఆర్‌బీఐ 2023 ఫిబ్రవరి నుంచి యథాతథ వడ్డీరేట్ల వ్యవస్థను కొనసాగిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో వడ్డీ రేట్లను నిర్ణయించడంలో ఆర్‌బీఐ ఆహార ద్రవ్యోల్బణాన్ని చూడటం మానేయాలని ఇటీవలి ఆర్థిక సర్వే సూచించింది. అధిక ఆహార ధరలను ఎదుర్కోవటానికి పేదలకు కూపన్లు లేదా ప్రత్యక్ష నగదు బదిలీని ప్రభుత్వం అన్వేíÙంచాలని సర్వే పేర్కొంది. అధిక ఆహార ధరలు చాలా సందర్భాల్లో సరఫరాలకు సంబంధించిన సమస్యే తప్ప, డిమాండ్‌ ప్రేరితం కాదని కూడా సర్వే స్పష్టం చేసింది. అయితే ఈ సూచనను తాజాగా ఆర్‌బీఐ పక్కనబెట్టడం గమనార్హం.  

ఆహార ధరల కట్టడే ధ్యేయం
ఆహార ద్రవ్యోల్బణం ‘మొండిగా’ అధిక స్థాయిలోనే ఉంది. ధరల స్థిరత్వం లేకుండా, అధిక వృద్ధిని కొనసాగించలేము. ద్రవ్యోల్బణం కట్టడికి తగిన ద్రవ్య విధానాన్ని సెంట్రల్‌ బ్యాంక్‌ కొనసాగించాల్సిందే.  నిరంతర ఆహార ద్రవ్యోల్బణం నుండి ఉత్పన్నమయ్యే సవాళ్లు, లేదా రెండవ దశ  ప్రభావాలను నివారించడానికి అలాగే ఇప్పటివరకు సాధించిన ప్రయోజనాలను పరిరక్షించుకోవడానికి ఎంపీసీ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.  
– శక్తికాంతదాస్, ఆర్‌బీఐ గవర్నర్‌

నియంత్రణా  మార్పులు హర్షణీయం 
ఆహార ద్రవ్యోల్బణాన్ని జాగ్రత్తగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది.  ఇక పాలసీలో ప్రతిపాదించిన కొన్ని నియంత్రణా పరమైన సంస్కరణలు హర్షణీయం. ముఖ్యంగా డిజిటల్‌ లెండింగ్‌ మార్కెట్‌ క్రమబద్ధీకరణ పాలసీ నిర్ణయాల్లో కీలకాంశం. యూపీఐ సేవల విస్తరణ, పారదర్శకతకు చర్యలను స్వాగతిస్తున్నాం.  
– దినేష్‌ ఖారా, ఎస్‌బీఐ చైర్మన్‌ 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement