‘రెపో’కు మెజారిటీ నే ప్రాతిపదిక
3-4 తేదీల్లో ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ భేటీ
ముంబై: కీలక పాలసీరేటు రెపో (బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 6.5 శాతం) ఈ దఫా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అత్యున్నత స్థాయి కమిటీ- ఎంపీసీ మెజారిటీ ప్రాతిపదికన నిర్ణయం కానుంది. ఈ కమిటీ నియామకాన్ని ప్రభుత్వం గురువారం నోటిఫై చేసింది. దీనితో పాలసీ సమీక్షకు అక్టోబర్ 3, 4 తేదీల్లో ఇక్కడ ఆర్‌బీఐ ఆరుగురు సభ్యుల సమావేశం 2016-17 నాల్గవ ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష జరగనుంది.
కమిటీ ఇదీ...
ప్రభుత్వం తరఫున కమిటీలో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫెసర్ చేతన్ ఘాటే, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ డెరైక్టర్ పామి దువా, ఐఐఎం- అహ్మదాబాద్‌లో ప్రొఫెసర్ రవీంద్ర హెచ్ ధోలాకియాలు ఉన్నారు. ఈ ముగ్గురితో పాటు కమిటీలో ఆర్‌బీఐ తరఫున ముగ్గురు నామినీలు కలిసి మొత్తం ఆరు ఓట్ల మెజారిటీ ప్రాతిపదికన పరపతి విధాన సమీక్ష సందర్భంగా రెపో రేటు నిర్ణయం ఉంటుంది.
ఒకవేళ రేటు నిర్ణయంలో కమిటీ చెరిసమానంగా చీలిపోతే... ఆర్‌బీఐ గవర్నర్ గా ఆయన అదనపు ఓటు కీలకం అవుతుంది. ఇక కమిటీలో ఆర్‌బీఐ గవర్నర్, ఒక డిప్యూటీ గవర్నర్, మరో ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. ఇప్పటి వరకూ సలహాకు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఉన్నప్పటికీ, దీనిని తోసిపుచ్చి ఆర్‌బీఐ గవర్నర్ సొంతంగా రెపో రేటు నిర్ణయం తీసుకునే వీలుంది.
సమయం మార్పు
కాగా పాలసీ సమీక్ష ఉదయం 11 గంటలకు జరుగుతుండగా ఇకమీదట ఈ సమావేశాన్ని మధ్యాహ్నం 2.30కి మార్చడం జరిగిందని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.