బుల్లిష్‌గానే మార్కెట్!
* వచ్చే ఆర్‌బీఐ పాలసీపై ఆశలు
* ఈసీబీ సమావేశంవైపు చూపు
* కార్పొరేట్ ఫలితాల ప్రభావం కూడా
న్యూఢిల్లీ: ఈ వారం కూడా భారత్ స్టాక్ మార్కెట్ బుల్లిష్‌గానే వుండవచ్చని నిపుణులు అంచనావేస్తున్నారు. రిజర్వుబ్యాంక్ అనూహ్యంగా రెపో రేటును తగ్గించడంతో గతవారం ఈక్విటీలు ర్యాలీ సాగించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి తొలివారంలో ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష వున్నందున, ఆ సమావేశంలో ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే మరిన్ని చర్యల్ని కేంద్ర బ్యాంక్ తీసుకోవొచ్చన్న అంచనాలతో రానున్న ట్రేడింగ్ సెషన్లలో మార్కెట్ అప్‌ట్రెండ్ కొనసాగుతుందని భావిస్తున్నట్లు బొనాంజా పోర్ట్‌ఫోలియో అసోసియేట్ ఫండ్ మేనేజర్ హిరేన్ ధకన్ చెప్పారు. అలాగే ఇటీవలి రేటు తగ్గింపు ప్రభావంతో వచ్చే కొద్దిరోజుల్లో వడ్డీ రేట్ల ప్రభావిత షేర్లు మరింత పెరుగుతాయని బ్రోకర్లు భావిస్తున్నారు.
అయితే ఈ వారం వెల్లడికానున్న బ్లూచిప్ కంపెనీల ఫలితాలు సైతం ట్రెండ్‌ను నిర్దేశిస్తాయన్నది అంచనా. హిందుస్తాన్ యూనీలీవర్, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, కెయిర్న్ ఇండియా, కొటక్ మహీంద్రా బ్యాంక్, హిందుస్తాన్ జింక్ తదితర కార్పొరేట్లు ఈ వారం క్యూ3 ఫలితాలు ప్రకటించనున్నాయి.
ఈ కారణంగా స్వల్పకాలంలో నిఫ్టీ హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని, కానీ మొత్తంమీద అప్‌ట్రెండ్ మాత్రం కొనసాగుతుందని క్యాపిటల్ వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా అభిప్రాయపడ్డారు. గతవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 663 పాయింట్ల పెరుగుదలతో 28,122 పాయింట్ల వద్ద ముగిసింది. 2014, అక్టోబర్ 31 తర్వాత ఒకేవారంలో ఇంత భారీ పెరుగుదల ఇదే ప్రథమం. అంతర్జాతీయంగా ఈ వారం జరగనున్న యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) సమావేశంపై ఇన్వెస్టర్లు దృష్టిసారించవచ్చు. ఈసీబీ ఒక ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించవచ్చన్న అంచనాలు గత కొద్దికాలంగా మార్కెట్లో కొనసాగుతున్నాయి.
ఎఫ్‌ఐఐల నికర పెట్టుబడులు రూ. 244 కోట్లు...
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) ఈ నెలలో ఇప్పటివరకూ రూ. 244 కోట్లు మాత్రమే నికరంగా పెట్టుబడి చేశారు. అయితే రుణ మార్కెట్లో మాత్రం వీరు జనవరి 1-16 తేదీల మధ్య భారీగా రూ. 11,300 కోట్ల విలువైన నికర కొనుగోళ్లు జరిపారు. ద్రవ్యోల్బణం బాగా క్షీణించడంతో పాటు వడ్డీ రేటు తగ్గింపు అంచనాల కారణంగా ఎఫ్‌ఐఐలు రుణ పత్రాల్లో భారీ పెట్టుబడులు జరిపినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
ఈక్విటీ ఫండ్స్‌లో పెరుగుతున్న ఖాతాలు...
స్టాక్ మార్కెట్ ర్యాలీ ఫలితంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-2015) ఏప్రిల్- డిసెంబర్ మధ్య తొమ్మిదినెలల కాలంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ 12 లక్షల కొత్త ఖాతాలను ఆకర్షించాయి. దేశంలోని మొత్తం 45 మ్యూచువల్ ఫండ్ సంస్థల వద్ద ఈక్విటీ ఫోలియో ఖాతాల సంఖ్య గత నెలాఖరునాటికి 3,03,92,991కు పెరిగింది.
2014 మార్చి చివరినాటికి ఈ సంఖ్య 2,91,80,922. నాలుగేళ్ల తర్వాత 2014 ఏప్రిల్ నెలలో తొలిసారిగా ఖాతాల సంఖ్య పెరిగింది. అంతకుముందు 2009 మార్చి నుంచి ప్రతినెలా ఖాతాలు మూతపడుతూ వచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ మధ్యకాలంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ రూ. 50,000 కోట్ల నికర పెట్టుబడుల్ని ఆకర్షించింది.