Indias stock market
-
19 నెలల కనిష్ట స్థాయికి సెన్సెక్స్
చైనా మార్కెట్ ఎఫెక్ట్ * 109 నష్టంతో 24,825 వద్ద ముగింపు చైనా మార్కెట్ మరో 5 శాతం పతనంకావడంతో భారత్ స్టాక్ మార్కెట్ సోమవారం నష్టాల్లో ముగిసింది. ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, టీసీఎస్ ఫలితాలు నేడు(మంగళవారం) వెల్లడి కానున్న నేపథ్యం కూడా ఇక్కడి మార్కెట్ క్షీణతకు దారితీసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 109 పాయింట్లు నష్టపోయి 24,825 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 38 పాయింట్లు నష్టపోయి 7,564 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు ఇది 19 నెలల కనిష్ట స్థాయి. ఈ ఏడాది ఆరు ట్రేడింగ్ సెషన్లలో స్టాక్‌మార్కెట్‌కు ఇది ఐదో పతనం. ఫార్మా, ఐటీ, బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్ షేర్లు నష్టపోయాయి. ఆసియా మార్కెట్లు భారీగా నష్టపోవడంతో మన సూచీలు కూడా భారీ నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. యూరప్ మార్కెట్లు రికవరీ కావడంతో మన మార్కెట్ కొంత కోలుకుంది. షార్ట్‌కవరింగ్, తక్కువ ధరల కారణంగా కొనుగోళ్లు జరగడం మార్కెట్ భారీ నష్టాల నుంచి రికవరీ కావడానికి తోడ్పడ్డాయి. జాగ్వార్, ల్యాండ్ రోవర్ రిటైల్ అమ్మకాలు బాగుండడంతో టాటా మోటార్స్ షేర్ల 2 శాతం లాభపడ్డాయి. కాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చెరకు ప్రకటిత ధరను నేడు వెల్లడించనున్న నేపథ్యంలో పంచదార షేర్లు తీపిని పంచాయి. -
6 నెలల గరిష్టానికి విదేశీ పెట్టుబడులు
ద్రవ్యోల్బణం దిగిరావడం, రిజర్వుబ్యాంక్ వడ్డీ రేటును తగ్గించడం వంటి సానుకూలాంశాలతో భారత్ స్టాక్ మార్కెట్లోకి జనవరి నెలలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) భారీగా రూ. 33,688 కోట్ల నికర పెట్టుబడులు చేశారు. ఒకే నెలలో ఇంత అత్యధిక పెట్టుబడులు గత ఆరునెలల్లో ఇదే ప్రథమం. ఈ పెట్టుబడుల్లో రూ. 12,919 కోట్లు స్టాక్ మార్కెట్లోకి, రూ. 20,769 కోట్లు రుణపత్రాల్లోకి తరలివచ్చినట్లు సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రుణ మార్కెట్లో ఫండ్స్ పెట్టుబడులు రూ. 33,000 కోట్లు ఆర్థిక వ్యవస్థ వృద్ధి అవకాశాలు మెరుగుపడటం, ప్రభుత్వ సంస్కరణల వల్ల స్థిర ఆదాయాన్నిచ్చే పత్రాల్లో రాబడి బావుంటుందన్న అంచనాలతో దేశీయ మ్యూచువల్ ఫండ్స్ జనవరి నెలలో రుణ మార్కెట్లో రూ. 33,000 కోట్ల పెట్టుబడులు చేశాయి. ఈక్విటీ మార్కెట్లో వీటి పెట్టుబడులు రూ. 270 కోట్లు మాత్రమే. -
ఫెడ్ పాలసీ నిర్ణయంపై దృష్టి
ఈ వారం మార్కెట్‌పై ప్రభావిత అంశాలు * గ్రీసు ఎన్నికల ఫలితాలు.... * ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ కాంట్రాక్టుల ముగింపు * క్యూ3 కార్పొరేట్ ఫలితాలు ముంబై: రికార్డులను బద్దలుకొడుతున్న భారత్ స్టాక్ మార్కెట్‌కు ఈ వారం ఒక ముఖ్యపరీక్ష ఎదురుకానుంది. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఈ మంగళ, బుధవారాల్లో జరపనున్న సమీక్షా సమావేశంలో తీసుకునే నిర్ణయం భారత్‌కే కాకుండా ప్రపంచ మార్కెట్లన్నింటికీ ప్రధానమైనదని మార్కెట్ నిపుణులు అంచనావేశారు. అలాగే ఆదివారం జరిగిన గ్రీసు ఎన్నికల ఫలితాలు సైతం ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని వారు భావిస్తున్నారు. గ్రీసు ఓటు, ఫెడ్ మీట్-ఈ రెండు కీలక సంఘటనల్నీ అధిగమిస్తే, ఆపై బడ్జెట్, సంస్కరణలపై అంచనాలతో భారత్ మార్కెట్ అప్‌ట్రెండ్ కొనసాగుతుందని జియోజిత్ బీఎన్పీ పారిబాస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. ఆదివారం జరిగిన గ్రీసు ఎన్నికల్లో వామపక్ష సిరిజా పార్టీ విజయం సాధిస్తే యూరో కరెన్సీ మరింత పతనంకావొచ్చని, ఈ ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడవచ్చంటూ నిపుణులు చెపుతున్నారు. అలాగే ప్రపంచమంతటా వడ్డీ రేట్లు తగ్గుతున్న సమయంలో ఫెడ్ విధాన సమీక్షలో రేట్లను పెంచే సంకేతాల్ని ఇస్తే, అది మార్కెట్లకు ప్రతికూలమవుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఫెడ్ డైలమా? వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు అనూహ్య నిర్ణయాల్ని ప్రకటిస్తున్న నేపథ్యంలో ఈ 27,28 తేదీల్లో జరగబోయే అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి వ్యక్తమవుతోంది. స్విట్జర్లాండ్ నేషనల్ బ్యాంక్ తన కరెన్సీపై పరిమితులు ఎత్తివేసి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసిన వెనువెంటనే ఈసీబీ విశ్లేషకుల అంచనాల్ని మించిన ఉద్దీపన వెలువరించింది. యూరోజోన్ ప్రతికూల ద్రవ్యోల్బణంలో చిక్కుకోకుండా నిరోధించడానికి ట్రిలియన్ యూరోలను మార్కెట్ వ్యవస్థలో ప్రవేశపెట్టనున్నట్లు ఈసీబీ ప్రకటించింది. మరోవైపు ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడానికి భారత్ రిజర్వ్‌బ్యాంక్ సైతం 20 నెలల తర్వాత వడ్డీ రేట్లను తగ్గించింది. ఈ నేపథ్యంలో జరగనున్న ఫెడ్ సమావేశంలో వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం వెలువడుతుందా అనే అంశం ప్రశ్నార్థకమయ్యింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ పటిష్టమైన వృద్ధిని ప్రదర్శించడం, నిరుద్యోగం రేటు తగ్గడం వంటి సానుకూలాంశాలతో వడ్డీ రే ట్ల పెంపు ప్రారంభించవచ్చన్న సంకేతాల్ని కొద్ది వారాల నుంచి ఫెడ్ అధికారులు విడుదల చేస్తున్నారు. అయితే అమెరికాలో మిగతా ఆర్థిక సంకేతాలు మెరుగ్గావున్నా, వేతన వృద్ధి బలహీనంగా వుండటం, ఐదేళ్ల కనిష్టస్థాయికి చమురు ధరలు పతనంకావడం, తద్వారా అక్కడి వినియోగ ధరలు డిసెంబర్ నెలలో ఆరేళ్ల కనిష్టస్థాయికి పడిపోవడంవల్ల వడ్డీ రేట్ల పెంపు ప్రకటన ఇప్పట్లో వుండకపోవొచ్చన్న అంచనాలు సైతం కొనసాగుతున్నాయి. హెచ్చుతగ్గులకు అవకాశం... ఈ గురువారం జనవరి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) కాంట్రాక్టులు ముగియనున్నాయి. ఈ సందర్భంగా మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనుకావోచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. గతవారం భారీ ర్యాలీ జరిగినందున, ఎఫ్ అండ్ ఓ ముగింపు సందర్భంగా ఒకవైపు లాభాల స్వీకరణ, మరోవైపు షార్ట్ కవరింగ్ జరుగుతాయని, దాంతో ఒడుదుడుకులు ఏర్పడవచ్చని వారు వివరించారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) గతవారం అంచనాలకు మించి ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించడంతో భారత్ సూచీలు 4 శాతం ర్యాలీ జరిపాయి. గతవారం బీఎస్ఈ సెన్సెక్స్ 29,409 పాయింట్లకు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 8,866 పాయింట్లకు చేరి కొత్త రికార్డులు నెలకొల్పాయి. ఈ వారం ఐసీఐసీఐ బ్యాంక్ మారుతీ, టైటాన్, యూనియన్ బ్యాంక్, ఐడియా తదితర కార్పొరేట్ కంపెనీలు ఫలితాల్ని వెల్లడించనున్నాయి. ఇంకా వెల్లడికావాల్సిన కార్పొరేట్ ఫలితాలకు తోడు బడ్జెట్‌పై ఆశావహ అంచనాల కారణంగా వచ్చే నెలరోజుల్లో కొన్ని షేర్లు ర్యాలీ జరపవచ్చని కోటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ దీపేన్ షా చెప్పారు. ఎఫ్ఐఐల పెట్టుబడులు 5,748 కోట్లు... విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారత్ మార్కెట్లో జనవరి 23తో ముగిసినవారంలో రూ. 5,748 కోట్ల విలువైన నికర పెట్టుబడులు చేశారు. నేడు మార్కెట్లకు సెలవు రిపబ్లిక్ దినోత్సవం కారణంగా భారత్ మార్కెట్‌కు సోమవారం సెలవు. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లతో సహా కమోడిటీ, బులియన్, ఫారెక్స్ మార్కెట్లన్నీ పనిచేయవు. -
బుల్లిష్‌గానే మార్కెట్!
* వచ్చే ఆర్బీఐ పాలసీపై ఆశలు * ఈసీబీ సమావేశంవైపు చూపు * కార్పొరేట్ ఫలితాల ప్రభావం కూడా న్యూఢిల్లీ: ఈ వారం కూడా భారత్ స్టాక్ మార్కెట్ బుల్లిష్‌గానే వుండవచ్చని నిపుణులు అంచనావేస్తున్నారు. రిజర్వుబ్యాంక్ అనూహ్యంగా రెపో రేటును తగ్గించడంతో గతవారం ఈక్విటీలు ర్యాలీ సాగించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి తొలివారంలో ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష వున్నందున, ఆ సమావేశంలో ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే మరిన్ని చర్యల్ని కేంద్ర బ్యాంక్ తీసుకోవొచ్చన్న అంచనాలతో రానున్న ట్రేడింగ్ సెషన్లలో మార్కెట్ అప్‌ట్రెండ్ కొనసాగుతుందని భావిస్తున్నట్లు బొనాంజా పోర్ట్‌ఫోలియో అసోసియేట్ ఫండ్ మేనేజర్ హిరేన్ ధకన్ చెప్పారు. అలాగే ఇటీవలి రేటు తగ్గింపు ప్రభావంతో వచ్చే కొద్దిరోజుల్లో వడ్డీ రేట్ల ప్రభావిత షేర్లు మరింత పెరుగుతాయని బ్రోకర్లు భావిస్తున్నారు. అయితే ఈ వారం వెల్లడికానున్న బ్లూచిప్ కంపెనీల ఫలితాలు సైతం ట్రెండ్‌ను నిర్దేశిస్తాయన్నది అంచనా. హిందుస్తాన్ యూనీలీవర్, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, కెయిర్న్ ఇండియా, కొటక్ మహీంద్రా బ్యాంక్, హిందుస్తాన్ జింక్ తదితర కార్పొరేట్లు ఈ వారం క్యూ3 ఫలితాలు ప్రకటించనున్నాయి. ఈ కారణంగా స్వల్పకాలంలో నిఫ్టీ హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని, కానీ మొత్తంమీద అప్‌ట్రెండ్ మాత్రం కొనసాగుతుందని క్యాపిటల్ వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా అభిప్రాయపడ్డారు. గతవారం బీఎస్ఈ సెన్సెక్స్ 663 పాయింట్ల పెరుగుదలతో 28,122 పాయింట్ల వద్ద ముగిసింది. 2014, అక్టోబర్ 31 తర్వాత ఒకేవారంలో ఇంత భారీ పెరుగుదల ఇదే ప్రథమం. అంతర్జాతీయంగా ఈ వారం జరగనున్న యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) సమావేశంపై ఇన్వెస్టర్లు దృష్టిసారించవచ్చు. ఈసీబీ ఒక ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించవచ్చన్న అంచనాలు గత కొద్దికాలంగా మార్కెట్లో కొనసాగుతున్నాయి. ఎఫ్ఐఐల నికర పెట్టుబడులు రూ. 244 కోట్లు... విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) ఈ నెలలో ఇప్పటివరకూ రూ. 244 కోట్లు మాత్రమే నికరంగా పెట్టుబడి చేశారు. అయితే రుణ మార్కెట్లో మాత్రం వీరు జనవరి 1-16 తేదీల మధ్య భారీగా రూ. 11,300 కోట్ల విలువైన నికర కొనుగోళ్లు జరిపారు. ద్రవ్యోల్బణం బాగా క్షీణించడంతో పాటు వడ్డీ రేటు తగ్గింపు అంచనాల కారణంగా ఎఫ్ఐఐలు రుణ పత్రాల్లో భారీ పెట్టుబడులు జరిపినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఈక్విటీ ఫండ్స్‌లో పెరుగుతున్న ఖాతాలు... స్టాక్ మార్కెట్ ర్యాలీ ఫలితంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-2015) ఏప్రిల్- డిసెంబర్ మధ్య తొమ్మిదినెలల కాలంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ 12 లక్షల కొత్త ఖాతాలను ఆకర్షించాయి. దేశంలోని మొత్తం 45 మ్యూచువల్ ఫండ్ సంస్థల వద్ద ఈక్విటీ ఫోలియో ఖాతాల సంఖ్య గత నెలాఖరునాటికి 3,03,92,991కు పెరిగింది. 2014 మార్చి చివరినాటికి ఈ సంఖ్య 2,91,80,922. నాలుగేళ్ల తర్వాత 2014 ఏప్రిల్ నెలలో తొలిసారిగా ఖాతాల సంఖ్య పెరిగింది. అంతకుముందు 2009 మార్చి నుంచి ప్రతినెలా ఖాతాలు మూతపడుతూ వచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ మధ్యకాలంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ రూ. 50,000 కోట్ల నికర పెట్టుబడుల్ని ఆకర్షించింది. -
మద్దతు 28,360 పాయింట్లు
మార్కెట్ పంచాంగం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర పెను వేగంతో పడిపోతున్న ప్రభావంతో భారత్ స్టాక్ మార్కెట్ అలుపెరుగని ర్యాలీ సాగిస్తున్నది. గత శుక్రవారం ఇదే కారణంతో బ్యాంకింగ్, పెట్రో మార్కెటింగ్ షేర్లు జోరుగా పెరిగాయి. అదేరోజు మన మార్కెట్ ముగిసిన తర్వాత ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ధర మరో 3 శాతం, బంగారం ధర 2 శాతం చొప్పున పడిపోయాయి. ఈ రెండు కమోడిటీలు క్షీణించిన ఫలితం ఈ సోమవారం ట్రేడింగ్ గ్యాప్‌అప్‌తో మొదలయ్యే అవకాశం వుంది. ఆ మరుసటి రోజున రిజర్వుబ్యాంక్ వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తే మార్కెట్ గరిష్టస్థాయివద్ద చిన్నశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చు. వడ్డీ రేట్లు తగ్గిస్తే ఒక్క ఉదుటన మార్కెట్ పెరిగి, అటుపై లాభాల స్వీకరణకు గురికావచ్చు. ఎందుకంటే రేట్ల తగ్గింపు కారణంగా డాలరుతో రూపాయి మారకపు విలువ 63 స్థాయికి పడిపోయే ప్రమాదం వుంది. ఇక సూచీల సాంకేతికాంశాలకొస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... నవంబర్ 28తో ముగిసిన వారంలో సరికొత్త రికార్డుస్థాయి 28,822 పాయింట్ల వరకూ పెరిగిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 359 పాయింట్ల లాభంతో 28,694 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం సెన్సెక్స్ హెచ్చుతగ్గులకు గురైతే 28,360 పాయింట్ల స్థాయి వద్ద తొలి మద్దతు లభ్యమవుతోంది. ఆ లోపున ముగిస్తే క్రమేపీ 28,050 పాయింట్ల స్థాయివరకూ క్షీణించవచ్చు. మార్కెట్‌ను షాక్‌కు లోనుచేసే పరిణామాలేవైనా జరిగితే 27,700-27,800 శ్రేణి వరకూ పతనం కావొచ్చు. ఈ వారం కూడా అప్‌ట్రెండ్ కొనసాగితే తొలుత 28,850 పాయింట్ల స్థాయికి చేరవచ్చు. ఆపైన వేగంగా 29,000 శిఖరంపై పాగా వేయవచ్చు. ఈ స్థాయిని బలంగా ఛేదిస్తే 29,250-29,350 పాయింట్ల శ్రేణివరకూ ర్యాలీ జరిపే చాన్స్ వుంది. నిఫ్టీ మద్దతు 8,490 నవంబర్ డెరివేటివ్ కాంట్రాక్టుల సెటిల్మెంట్ రోజైన గురువారం వరకూ చిన్న శ్రేణిలో హెచ్చుతగ్గుల కు లోనైన ఎన్ఎస్ఈ నిఫ్టీ, డిసెంబర్ ఫ్యూచర్స్ సెటిల్మెంట్కు తొలిరోజైన శుక్రవారం ఒక్క ఉదుటన 8,500, 8,600 శిఖరాల్ని వరుసగా అధిరోహించింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 111 పాయింట్ల లాభంతో 8,588 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం ఆర్బీఐ పాలసీ సందర్భంగా నిఫ్టీ హెచ్చుతగ్గులకు లోనైన 8,490 పాయింట్ల వద్ద తొలి మద్దతు పొందవచ్చు. ఆ లోపున ముగిస్తే 8,400 పాయింట్ల వ రకూ క్షీణించవచ్చు. ప్రస్తుత టెక్నికల్ సెటప్ ప్రకారం అంతర్జాతీయంగా ఏవైనా నాటకీయ పరిణామాలు ఏర్పడితే తప్ప ఈ స్థాయి దిగువకు నిఫ్టీ పతనమయ్యే అవకాశం లేదు. రానున్న వారాల్లో 8,360 స్థాయి వద్ద పటిష్టమైన మద్దతు నిఫ్టీకి లభిస్తున్నది. ఆర్బీఐ పాలసీలో ఆశ్చర్యకరంగా వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయం వెలువడితే నిఫ్టీ వేగంగా 8,700 స్థాయిని అందుకోవొచ్చు. ఆ లోపున 8,650 పాయింట్ల సమీపంలో చిన్న అవరోధం ఏర్పడవచ్చు. 8,700 పాయింట్లపైన స్థిరపడితే క్రమేపీ 8,800-8,850 పాయింట్ల శ్రేణిని చేరే చాన్స్ వుంటుంది.