19 నెలల కనిష్ట స్థాయికి సెన్సెక్స్
చైనా మార్కెట్ ఎఫెక్ట్
* 109 నష్టంతో 24,825 వద్ద ముగింపు
చైనా మార్కెట్ మరో 5 శాతం పతనంకావడంతో భారత్ స్టాక్ మార్కెట్ సోమవారం నష్టాల్లో ముగిసింది. ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, టీసీఎస్ ఫలితాలు నేడు(మంగళవారం) వెల్లడి కానున్న నేపథ్యం కూడా ఇక్కడి మార్కెట్ క్షీణతకు దారితీసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 109 పాయింట్లు నష్టపోయి 24,825 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 38 పాయింట్లు నష్టపోయి 7,564 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు ఇది 19 నెలల కనిష్ట స్థాయి. ఈ ఏడాది ఆరు ట్రేడింగ్ సెషన్లలో స్టాక్‌మార్కెట్‌కు ఇది ఐదో పతనం. ఫార్మా, ఐటీ, బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్ షేర్లు నష్టపోయాయి.
ఆసియా మార్కెట్లు భారీగా నష్టపోవడంతో మన సూచీలు కూడా భారీ నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. యూరప్ మార్కెట్లు రికవరీ కావడంతో మన మార్కెట్ కొంత కోలుకుంది. షార్ట్‌కవరింగ్, తక్కువ ధరల కారణంగా కొనుగోళ్లు జరగడం మార్కెట్ భారీ నష్టాల నుంచి రికవరీ కావడానికి తోడ్పడ్డాయి. జాగ్వార్, ల్యాండ్ రోవర్ రిటైల్ అమ్మకాలు బాగుండడంతో టాటా మోటార్స్ షేర్ల 2 శాతం లాభపడ్డాయి. కాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చెరకు ప్రకటిత ధరను నేడు వెల్లడించనున్న నేపథ్యంలో పంచదార షేర్లు తీపిని పంచాయి.