మార్కెట్ పంచాంగం
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర పెను వేగంతో పడిపోతున్న ప్రభావంతో భారత్ స్టాక్ మార్కెట్ అలుపెరుగని ర్యాలీ సాగిస్తున్నది. గత శుక్రవారం ఇదే కారణంతో బ్యాంకింగ్, పెట్రో మార్కెటింగ్ షేర్లు జోరుగా పెరిగాయి. అదేరోజు మన మార్కెట్ ముగిసిన తర్వాత ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ధర మరో 3 శాతం, బంగారం ధర 2 శాతం చొప్పున పడిపోయాయి. ఈ రెండు కమోడిటీలు క్షీణించిన ఫలితం ఈ సోమవారం ట్రేడింగ్ గ్యాప్‌అప్‌తో మొదలయ్యే అవకాశం వుంది. ఆ మరుసటి రోజున రిజర్వుబ్యాంక్ వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తే మార్కెట్ గరిష్టస్థాయివద్ద చిన్నశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చు. వడ్డీ రేట్లు తగ్గిస్తే ఒక్క ఉదుటన మార్కెట్ పెరిగి, అటుపై లాభాల స్వీకరణకు గురికావచ్చు. ఎందుకంటే రేట్ల తగ్గింపు కారణంగా డాలరుతో రూపాయి మారకపు విలువ 63 స్థాయికి పడిపోయే ప్రమాదం వుంది. ఇక సూచీల సాంకేతికాంశాలకొస్తే...
సెన్సెక్స్ సాంకేతికాంశాలు...
నవంబర్ 28తో ముగిసిన వారంలో సరికొత్త రికార్డుస్థాయి 28,822 పాయింట్ల వరకూ పెరిగిన బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 359 పాయింట్ల లాభంతో 28,694 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం సెన్సెక్స్ హెచ్చుతగ్గులకు గురైతే 28,360 పాయింట్ల స్థాయి వద్ద తొలి మద్దతు లభ్యమవుతోంది. ఆ లోపున ముగిస్తే క్రమేపీ 28,050 పాయింట్ల స్థాయివరకూ క్షీణించవచ్చు. మార్కెట్‌ను షాక్‌కు లోనుచేసే పరిణామాలేవైనా జరిగితే 27,700-27,800 శ్రేణి వరకూ పతనం కావొచ్చు. ఈ వారం కూడా అప్‌ట్రెండ్ కొనసాగితే తొలుత 28,850 పాయింట్ల స్థాయికి చేరవచ్చు. ఆపైన వేగంగా 29,000 శిఖరంపై పాగా వేయవచ్చు. ఈ స్థాయిని బలంగా ఛేదిస్తే 29,250-29,350 పాయింట్ల శ్రేణివరకూ ర్యాలీ జరిపే చాన్స్ వుంది.
నిఫ్టీ మద్దతు 8,490
నవంబర్ డెరివేటివ్ కాంట్రాక్టుల సెటిల్‌మెంట్ రోజైన గురువారం వరకూ చిన్న శ్రేణిలో హెచ్చుతగ్గుల కు లోనైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ, డిసెంబర్ ఫ్యూచర్స్ సెటిల్‌మెంట్‌కు తొలిరోజైన శుక్రవారం ఒక్క ఉదుటన 8,500, 8,600 శిఖరాల్ని వరుసగా అధిరోహించింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 111 పాయింట్ల లాభంతో 8,588 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం ఆర్‌బీఐ పాలసీ సందర్భంగా నిఫ్టీ హెచ్చుతగ్గులకు లోనైన 8,490 పాయింట్ల వద్ద తొలి మద్దతు పొందవచ్చు. ఆ లోపున ముగిస్తే 8,400 పాయింట్ల వ రకూ క్షీణించవచ్చు. ప్రస్తుత టెక్నికల్ సెటప్ ప్రకారం అంతర్జాతీయంగా ఏవైనా నాటకీయ పరిణామాలు ఏర్పడితే తప్ప ఈ స్థాయి దిగువకు నిఫ్టీ పతనమయ్యే అవకాశం లేదు. రానున్న వారాల్లో 8,360 స్థాయి వద్ద పటిష్టమైన మద్దతు నిఫ్టీకి లభిస్తున్నది. ఆర్‌బీఐ పాలసీలో ఆశ్చర్యకరంగా వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయం వెలువడితే నిఫ్టీ వేగంగా 8,700 స్థాయిని అందుకోవొచ్చు. ఆ లోపున 8,650 పాయింట్ల సమీపంలో చిన్న అవరోధం ఏర్పడవచ్చు. 8,700 పాయింట్లపైన స్థిరపడితే క్రమేపీ 8,800-8,850 పాయింట్ల శ్రేణిని చేరే చాన్స్ వుంటుంది.
మద్దతు 28,360 పాయింట్లు
Published Mon, Dec 1 2014 12:11 AM | Last Updated on Sat, Sep 2 2017 5:24 PM
Advertisement