ఫెడ్ పాలసీ నిర్ణయంపై దృష్టి | India-US relationship can be a win-win: BSE CEO | Sakshi
Sakshi News home page

ఫెడ్ పాలసీ నిర్ణయంపై దృష్టి

Published Mon, Jan 26 2015 1:22 AM | Last Updated on Sat, Sep 2 2017 8:15 PM

ఫెడ్ పాలసీ నిర్ణయంపై దృష్టి

ఫెడ్ పాలసీ నిర్ణయంపై దృష్టి

ఈ వారం మార్కెట్‌పై ప్రభావిత అంశాలు
* గ్రీసు ఎన్నికల ఫలితాలు....
* ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ కాంట్రాక్టుల ముగింపు
* క్యూ3 కార్పొరేట్ ఫలితాలు

ముంబై: రికార్డులను బద్దలుకొడుతున్న భారత్ స్టాక్ మార్కెట్‌కు ఈ వారం ఒక ముఖ్యపరీక్ష ఎదురుకానుంది. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఈ మంగళ, బుధవారాల్లో జరపనున్న సమీక్షా సమావేశంలో తీసుకునే నిర్ణయం భారత్‌కే కాకుండా ప్రపంచ మార్కెట్లన్నింటికీ ప్రధానమైనదని మార్కెట్ నిపుణులు అంచనావేశారు. అలాగే ఆదివారం జరిగిన గ్రీసు ఎన్నికల ఫలితాలు సైతం ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని వారు భావిస్తున్నారు.

గ్రీసు ఓటు, ఫెడ్ మీట్-ఈ రెండు కీలక సంఘటనల్నీ అధిగమిస్తే, ఆపై బడ్జెట్, సంస్కరణలపై అంచనాలతో భారత్ మార్కెట్ అప్‌ట్రెండ్ కొనసాగుతుందని జియోజిత్ బీఎన్‌పీ పారిబాస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. ఆదివారం జరిగిన గ్రీసు ఎన్నికల్లో వామపక్ష సిరిజా పార్టీ విజయం సాధిస్తే యూరో కరెన్సీ మరింత పతనంకావొచ్చని, ఈ ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడవచ్చంటూ నిపుణులు చెపుతున్నారు. అలాగే ప్రపంచమంతటా వడ్డీ రేట్లు తగ్గుతున్న సమయంలో ఫెడ్ విధాన సమీక్షలో రేట్లను పెంచే సంకేతాల్ని ఇస్తే, అది మార్కెట్లకు ప్రతికూలమవుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
 
ఫెడ్ డైలమా?
వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు అనూహ్య నిర్ణయాల్ని ప్రకటిస్తున్న నేపథ్యంలో ఈ 27,28 తేదీల్లో జరగబోయే అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి వ్యక్తమవుతోంది. స్విట్జర్లాండ్ నేషనల్ బ్యాంక్ తన కరెన్సీపై పరిమితులు ఎత్తివేసి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసిన వెనువెంటనే ఈసీబీ విశ్లేషకుల అంచనాల్ని మించిన ఉద్దీపన వెలువరించింది. యూరోజోన్ ప్రతికూల ద్రవ్యోల్బణంలో చిక్కుకోకుండా నిరోధించడానికి ట్రిలియన్ యూరోలను మార్కెట్ వ్యవస్థలో ప్రవేశపెట్టనున్నట్లు ఈసీబీ ప్రకటించింది.

మరోవైపు ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడానికి భారత్ రిజర్వ్‌బ్యాంక్ సైతం 20 నెలల తర్వాత వడ్డీ రేట్లను తగ్గించింది. ఈ నేపథ్యంలో జరగనున్న ఫెడ్ సమావేశంలో వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం వెలువడుతుందా అనే అంశం ప్రశ్నార్థకమయ్యింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ పటిష్టమైన వృద్ధిని ప్రదర్శించడం, నిరుద్యోగం రేటు తగ్గడం వంటి సానుకూలాంశాలతో వడ్డీ రే ట్ల పెంపు ప్రారంభించవచ్చన్న సంకేతాల్ని కొద్ది వారాల నుంచి ఫెడ్ అధికారులు విడుదల చేస్తున్నారు.

అయితే అమెరికాలో మిగతా ఆర్థిక సంకేతాలు మెరుగ్గావున్నా, వేతన వృద్ధి బలహీనంగా వుండటం, ఐదేళ్ల కనిష్టస్థాయికి చమురు ధరలు పతనంకావడం, తద్వారా అక్కడి వినియోగ ధరలు డిసెంబర్ నెలలో ఆరేళ్ల కనిష్టస్థాయికి పడిపోవడంవల్ల వడ్డీ రేట్ల పెంపు ప్రకటన ఇప్పట్లో వుండకపోవొచ్చన్న అంచనాలు సైతం కొనసాగుతున్నాయి.
 
హెచ్చుతగ్గులకు అవకాశం...
ఈ గురువారం జనవరి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) కాంట్రాక్టులు ముగియనున్నాయి. ఈ సందర్భంగా మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనుకావోచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. గతవారం భారీ ర్యాలీ జరిగినందున, ఎఫ్ అండ్ ఓ ముగింపు సందర్భంగా ఒకవైపు లాభాల స్వీకరణ, మరోవైపు షార్ట్ కవరింగ్ జరుగుతాయని, దాంతో ఒడుదుడుకులు ఏర్పడవచ్చని వారు వివరించారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) గతవారం అంచనాలకు మించి ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించడంతో భారత్ సూచీలు 4 శాతం ర్యాలీ జరిపాయి. గతవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 29,409 పాయింట్లకు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 8,866 పాయింట్లకు చేరి కొత్త రికార్డులు నెలకొల్పాయి.

ఈ వారం ఐసీఐసీఐ బ్యాంక్ మారుతీ, టైటాన్, యూనియన్ బ్యాంక్, ఐడియా తదితర కార్పొరేట్ కంపెనీలు ఫలితాల్ని వెల్లడించనున్నాయి. ఇంకా వెల్లడికావాల్సిన కార్పొరేట్ ఫలితాలకు తోడు బడ్జెట్‌పై ఆశావహ అంచనాల కారణంగా వచ్చే నెలరోజుల్లో కొన్ని షేర్లు ర్యాలీ జరపవచ్చని కోటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ దీపేన్ షా చెప్పారు.
 
ఎఫ్‌ఐఐల పెట్టుబడులు 5,748 కోట్లు...
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారత్ మార్కెట్లో జనవరి 23తో ముగిసినవారంలో రూ. 5,748 కోట్ల విలువైన నికర పెట్టుబడులు చేశారు.
 
నేడు మార్కెట్లకు సెలవు
రిపబ్లిక్ దినోత్సవం కారణంగా భారత్ మార్కెట్‌కు సోమవారం సెలవు. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్‌లతో సహా కమోడిటీ, బులియన్, ఫారెక్స్ మార్కెట్లన్నీ పనిచేయవు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement