ఇబ్బందుల్లోనే ఆర్థిక వ్యవస్థ | Standards can help Islamic finance grow: Zeti | Sakshi
Sakshi News home page

ఇబ్బందుల్లోనే ఆర్థిక వ్యవస్థ

Published Fri, Nov 13 2015 1:15 AM | Last Updated on Sun, Sep 3 2017 12:23 PM

ఇబ్బందుల్లోనే ఆర్థిక వ్యవస్థ

ఇబ్బందుల్లోనే ఆర్థిక వ్యవస్థ

4 నెలల కనిష్టానికి పారిశ్రామిక ఉత్పత్తి
* సెప్టెంబర్‌లో వృద్ధి రేటు 3.6 శాతం
* అక్టోబర్ రిటైల్ ద్రవ్యోల్బణం 5%
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు తొలగిపోలేదని గురువారం విడుదలైన తాజా పారిశ్రామిక ఉత్పత్తి, రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు పేర్కొంటున్నాయి. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 5 శాతంగా నమోదయ్యింది.

ఇక సెప్టెంబర్ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) కేవలం 3.6 శాతం వృద్ధిని మాత్రమే నమోదుచేసుకుంది.   తయారీ రంగంతోపాటు, కాస్మొటిక్స్ వంటి నాన్-డ్యూరబుల్స్ వినియోగ వస్తువుల విభాగం పేలవ పనితీరు ఐఐపీ గణాంకాలు అంతంతమాత్రంగా నమోదుకావడానికి కారణం.  గడచిన నాలుగు నెలల్లో ఇంత దిగువస్థాయి వృద్ధి నమోదుకావడం ఇదే తొలిసారి. ఆగస్టు నెలలో ఈ వృద్ధి రేటు 6.2 శాతం. కాగా గత ఏడాది సెప్టెంబర్‌లో మాత్రం ఈ రేటు 2.6 శాతంగా ఉంది. ఇదిలావుంటే... ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో  (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్) చూస్తే... ఈ రేటు 2.9 శాతం నుంచి 4 శాతానికి పెరిగింది. జూన్ (4.2 శాతం), జూలై (4.1 శాతం), ఆగస్టు (6.2 శాతం) ఫలితాలు దీనికి కారణం.
 
కీలక విభాగాల ఉత్పత్తి ఇలా...
తయారీ: వార్షిక ప్రాతిపదికన సెప్టెంబర్‌లో వృద్ధి రేటు 2.7 శాతం నుంచి 2.6 శాతానికి పడింది.  మొత్తం సూచీలో 75 శాతం వాటా ఉన్న ఈ రంగంలోని మొత్తం 22 గ్రూపుల్లో సగం మాత్రమే సెప్టెంబర్‌లో వృద్ధి రేటును నమోదుచేసుకున్నాయి. కాగా ఆరు నెలల్లో  ఈ రేటు 2.2 శాతం నుంచి 4.2 శాతానికి ఎగసింది.
 
మైనింగ్: ఈ రంగంలో వృద్ధి రేటు 0.1% నుంచి 3%కి ఎగసింది. ఆరు నెలల్లో మాత్రం ఈ రేటు 1.7 శాతం నుంచి 1.5 శాతానికి తగ్గింది.
 
విద్యుత్: సెప్టెంబర్‌లో ఈ రేటు 3.9 శాతం నుంచి 11.4 శాతానికి పెరిగింది. అయితే ఆరు నెలల్లో మాత్రం ఈ రేటు 10.4 శాతం నుంచి 4.5 శాతానికి దిగింది.
 
కేపిటల్ గూడ్స్: పెట్టుబడులకు, డిమాండ్‌కు సూచికగా ఉన్న ఈ భారీ ఉత్పత్తుల విభాగంలో వృద్ధి 12.3 శాతం నుంచి 10.5 శాతానికి పడింది. ఆరు నెలల్లో వృద్ధి మాత్రం 6% నుంచి 7.9%కి పెరిగింది.
 
వినియోగ వస్తువులు:
మొత్తంగా వినియోగ వస్తువుల విభాగం - 4.0 శాతం క్షీణత నుంచి 0.6 శాతం వృద్ధికి మళ్లింది. ఇందులో ఒక విభాగమైన కన్జూమర్ డ్యూరబుల్స్‌లో వృద్ధి కూడా -11.1% క్షీణత నుంచి 8.4 శాతం వృద్ధి బాటకు మళ్లింది. కాగా కన్జూమర్ నాన్ డ్యూరబుల్ గూడ్స్ విభాగంలో అసలు వృద్ధి నమోదుకాకపోగా -4.6 శాతం క్షీణత నమోదయ్యింది. 2014 సెప్టెంబర్‌లో ఈ విభాగం వృద్ధి 1.3 శాతం.
   
ఈ మూడు విభాగాలనూ ఆరు  నెలల్లో చూస్తే... మొత్తం వినియోగ వస్తువుల విభాగం -2.4 శాతం క్షీణత నుంచి 2.4 శాతం వృద్ధికి మళ్లింది. కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగం -12.5 శాతం క్షీణత నుంచి 7.6 శాతం వృద్ధికి మారింది. నాన్-డ్యూరబుల్స్ విభాగం 1.9 శాతం వృద్ధి నుంచి -0.9 శాతం క్షీణతకు పడిపోయింది.

స్థూల ఆర్థిక రంగానికి సంబంధించి కఠిన సవాళ్లు ఇంకా కొనసాగుతున్నాయని తాజా గణాంకాలు  స్పష్టం చేస్తున్నట్లు అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ పేర్కొన్నారు. పరిస్థితిని ఎదుర్కొనడానికి కేంద్రం ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు.
 
సామాన్యుడిపై ధరల భారం
అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 5% పెరగ్గా, ఆగస్టులో ఇది 4.41 శాతం. తాజాగా ముగిసిన నెలలో ఆహార ఉత్పత్తులు, పానీ యాల విభాగంలో ధరల పెరుగుదల స్పీడ్ (రేటు) గత ఏడాది ఇదే నెలతో పోల్చితే 5.34 శాతం పెరిగింది. పప్పు దినుసుల ధరలు మాత్రం భారీగా 42.20 శాతం ఎగశాయి. 4 శాతం పైన పెరిగిన ఆహార ఉత్పత్తులను చూస్తే... సుగంధ ద్రవ్యాలు (10 శాతం), ప్రిపేర్డ్ మీల్స్ (7 శాతం), మాంసం, చేపలు (5 శాతం), పాలు, పాల ఉత్పత్తులు (5 శాతం), చమురు, వెన్న పదార్థాలు (5 శాతం), ఆల్కాహాలేతర పానీయాలు (4 శాతం) ఉన్నాయి.

కూరగాయల ధరలు 2.5 శాతం ఎగశాయి. చక్కెర, తత్సంబంధ ఉత్పత్తుల ధరలు మాత్రం 10 శాతం పైగా తగ్గాయి. సీపీఐలో మిగిలిన విభాగాలు చూస్తే... పాన్, పొగాకు ఇతర మత్తు ప్రేరిత ఉత్పత్తుల ధరలు 10 శాతం పెరిగాయి. దుస్తులు, పాదరక్షల ధరలు 5.62 శాతం, హౌసింగ్ 5 శాతం పెరగ్గా, ఇంధన, విద్యుత్ విభాగంలో రేటు 5 శాతం పైగా ఎగసింది. 2016 జనవరి నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యం 5.8 శాతం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement