ధరలు దిగివచ్చాయ్... పరిశ్రమలు మందగించాయ్!
♦ ఏప్రిల్‌లో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 3.1 శాతం
♦ గత ఏడాది ఇదే నెల ఈ రేటు 6.5 శాతం
♦ 2017 మార్చి నెలలో 3.75 శాతం స్పీడ్
♦ మే రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాల ఊరట
♦ పెరుగుదల కేవలం 2.18 శాతం
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు ఆర్థిక సంవత్సరం మొదటి నెల– ఏప్రిల్‌లో నిరుత్సాహపరచగా, మే నెల రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు ఊరటనిచ్చాయి. కేంద్ర గణాంకాల కార్యాలయం సోమవారంనాడు విడుదల చేసిన గణాంకాల వివరాలను క్లుప్తంగా చూస్తే... ఏప్రిల్ నెలలో పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) వృద్ధి రేటు 3.1 శాతంగా (2016 ఇదే నెల ఉత్పత్తితో పోల్చిచూస్తే) నమోదయ్యింది. 2016 నెలలో ఈ రేటు 6.5 శాతం. ఇక 2017 మార్చి నెలలో సైతం వృద్ధి రేటు 3.75 శాతంగా నమోదయ్యింది. గత నెల్లో ప్రకటించిన తొలి అంచనాల కన్నా (2.7 శాతం) ఇది అధికం కావడం గమనార్హం. ఇక మే నెలలో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2.18 శాతంగా నమోదయ్యింది.
ప్రధాన విభాగాలు నేలచూపు..!
♦ మొత్తం సూచీలో దాదాపు 78 శాతం వాటా కలిగిన తయారీసహా మైనింగ్, విద్యుత్, క్యాపిటల్ గూడ్స్ రంగాల్లో పెద్ద పురోగతి కనిపించలేదు.
♦ తయారీ: ఈ రంగంలో వృద్ధి రేటు 5.5 శాతం నుంచి 2.6 శాతానికి పడిపోయింది. తయారీ రంగంలోని 23 పారిశ్రామిక గ్రూపుల్లో 14 సానుకూల ఫలితాన్ని ఇచ్చాయి. ఫార్మా, మెడిసినల్ కెమికల్, బొటానికల్ ప్రొడక్ట్స్‌లో అత్యధికంగా 29.1 శాతం వృద్ధి నమోదయ్యింది. తరువాత 17.5 శాతంతో పొగాకు ఉత్పత్తులు నిలవగా, 9.5 శాతంతో మిషనరీ అండ్ పరికరాల తయారీ నిలిచింది. శీతల పానీయాల ఉత్పత్తి భారీగా 19.2 శాతం (మైనస్) క్షీణించింది. మోటార్ వెహికల్స్, ట్రైలర్స్, సెమీ– ట్రైలర్స్ ఉత్పత్తి 15.6 శాతం క్షీణించింది. ఎలక్ట్రికల్ పరికరాల తయారీలో 14.4 శాతం క్షీణత నమోదయ్యింది.
♦ మైనింగ్: వృద్ధి రేటు 6.7 శాతం నుంచి 4.2 శాతానికి పడింది.
♦ విద్యుత్: ఈ రంగంలో రేటు 14.4 శాతం నుంచి 5.4 శాతానికి దిగింది.
♦ క్యాపిటల్ గూడ్స్: డిమాండ్‌కు, భారీ వస్తు ఉత్పత్తికి సూచిక అయిన క్యాపిటల్ గూడ్స్ విభాగంలో వృద్ధి భారీగా 8.1 శాతం నుంచి 1.3 శాతానికి జారింది.
♦ వినిమయ వస్తువులు: ఈ విభాగంలో ఉత్పత్తి వృద్ధి 5.8 శాతంగా నమోదయ్యింది. ఇందులో రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్ల వంటి కన్జూమర్ డ్యూరబుల్స్ (వైట్ గూడ్స్) ఉత్పత్తి వృద్ధి 13.8 శాతం నుంచి 6 శాతానికి పడిపోయింది. నాన్–డ్యూరబుల్స్ విభాగంలో మాత్రం వృద్ధి 8.3 శాతంగా నమోదయ్యింది.
రేటు తగ్గించడానికి సమయమిది: పరిశ్రమలు
ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి తగ్గడం, పారిశ్రామిక పేలవ ఉత్పత్తి నేపథ్యంలో... రెపో (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే రేటు– ప్రస్తుతం 6.25 శాతం) తగ్గింపు డిమాండ్ మళ్లీ పరిశ్రమల నుంచి వినిపించింది. జూన్ 7న జరిగిన పాలసీ సమీక్ష సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును యథాతథంగా కొనసాగించిన సంగతి తెలిసిందే. రేటు తగ్గించి పెట్టుబడులకు తగిన వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని పారిశ్రామిక వర్గాలు పేర్కొన్నాయి.
కూరగాయలు... పప్పుల ధరల ఊరట
ఇక మే నెల గణాంకాలను చూస్తే... ప్రధానంగా కూరగాయలు, పప్పుల ధరలు తగ్గాయి. (2016 మే నెలతో పోల్చి చూస్తే...) దీనితో రిటైల్ ద్రవ్యోల్బణం రికార్డుస్థాయిలో 2.18 శాతానికి పడిపోయింది. 2017 ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 2.99 శాతం కాగా, 2016 మే నెలలో ఈ రేటు 5.75 శాతంగా ఉంది. ఒక్క ఆహార ఉత్పత్తుల విభాగాన్ని చూస్తే ధరలు మే నెలలో అసలు పెరక్కపోగా (2016 మే నెలతో పోల్చి) –1.05 శాతం క్షీణించాయి. 2012 జనవరి తరువాత ఈ తరహా సానుకూల ఫలితం ఇదే తొలిసారి. కూరగాయల ధరలు 13.44 శాతం క్షీణించాయి. పప్పులు సంబంధిత ఉత్పత్తుల ధరలు 19.45 శాతం పడ్డాయి. పండ్ల ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. కాగా దుస్తులు, హౌసింగ్, ఫ్యూయెల్, లైట్ విభాగాల్లో కూడా ధరలు తగ్గాయి.