పారిశ్రామిక ఉత్పత్తి... జోరు
ఫిబ్రవరిలో ఐఐపీ 5 శాతం వృద్ధి
9 నెలల గరిష్ట స్థాయి
తయారీ, మైనింగ్ , కేపిటల్ గూడ్స్ దన్ను
పారిశ్రామిక పునరుత్తేజానికి సంకేతం!
న్యూఢిల్లీ: ఆర్థిక వేత్తలు, విధాన నిర్ణేతలకు ఉత్సాహాన్నిస్తూ ఫిబ్రవరి పారిశ్రామిక ఉత్పత్తి జోరందుకుంది. 2014 ఫిబ్రవరితో పోల్చితే 2015 ఫిబ్రవరిలో పారిశ్రామిక ఉత్పత్తి 5 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ఇది తొమ్మిది నెలల గరిష్ట స్థాయి. ఈ నెలలో తయారీ, మైనింగ్, కేపిటల్ గూడ్స్ రంగాలు మంచి పనితీరు మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిపై సానుకూల ప్రభావం చూపింది. ఫిబ్రవరి పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) గణాంకాలను కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) శుక్రవారం విడుదల చేసింది. 2014 ఫిబ్రవరిలో ఐఐపీలో అసలు వృద్ధిలేకపోగా (అంతక్రితం ఏడాది అంటే 2013 ఫిబ్రవరితో పోల్చితే) 2 శాతం క్షీణత (మైనస్)లో ఉండగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో 5 శాతం వృద్ధి కనపర్చడం విశేషం.
జనవరి వృద్ధి పెంపు...
మరోవైపు 2015 జనవరి ఐఐపీ 2.6 శాతం ప్రాథమిక వృద్ధి గణాంకాలను 2.77 శాతానికి పెంచారు.
కీలక రంగాల తీరు...
తయారీ: మొత్తం సూచీలో 75 శాతం వాటా కలిగిన ఈ రంగం వృద్ధి రేటు ఫిబ్రవరిలో 5.2 శాతంగా ఉంది. 2014 ఇదే నెలలో ఈ రంగంలో అసలు వృద్ధి లేకపోగా 3.9 శాతం క్షీణించింది. 11నెలల కాలంలో చూసినా ఈ రంగం 0.7 శాతం క్షీణత నుంచి 2.2 శాతం వృద్ధి బాటకు మళ్లింది. తయారీ రంగంలోని మొత్తం 22 పారిశ్రామిక విభాగాల్లో.... 16 ఫిబ్రవరిలో సానుకూల వృద్ధి రేటును నమోదుచేసుకున్నాయి.
మైనింగ్: ఫిబ్రవరిలో ఈ రంగం వృద్ధి రేటు 2.3 శాతం నుంచి 2.5 శాతానికి పెరిగింది. 11 నెలల కాలంలో 0.7 శాతం క్షీణ రేటు నుంచి 1.5 శాతం వృద్ధి బాటకు ఎగసింది.
► కేపిటల్ గూడ్స్: డిమాండ్ బాగుందనడానికి సంకేతంగా, భారీ వస్తువుల ఉత్పత్తికి సూచికగా ఉన్న ఈ రంగం అత్యధికంగా 8.8 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. 2014 ఇదే నెలలో ఈ రంగం భారీగా 17.6 శాతం క్షీణతలో ఉంది. 11 నెలల కాలంలో సైతం ఈ రంగం 2.6 శాతం క్షీణ రేటు నుంచి 6 శాతం వృద్ధి రేటుకు మారింది.
► విద్యుత్: ఇక కీలకమైన విద్యుత్ (ఉత్పత్తి) రంగం వృద్ధి రేటు ఫిబ్రవరిలో 11.5 % నుంచి 5.9 శాతానికి తగ్గింది. 11 నెలల్లో మాత్రం విద్యుత్ ఉత్పత్తి వృద్ధి రేటు 6.2% నుంచి 9.1 శాతానికి ఎగసింది.
► వినియోగ వస్తువులు: ఈ విభాగంలో నెలవారీగా వృద్ధి రేటు 5.2 శాతం క్షీణ రేటు నుంచి 5.2 శాతం వృద్ధికి మారింది. 11 నెలల కాలంలో చూస్తే మాత్రం ఈ విభాగం క్షీణతలోనే ఉంది. పైగా ఈ మైనస్ రేటు 2.9 శాతం నుంచి 3.7 శాతానికి పెరిగింది.
► దీర్ఘకాలం వినియోగానికి ఉద్దేశించిన వినియోగ వస్తువుల ఉత్పత్తి ఫిబ్రవరిలో క్షీణతలోనే ఉంది. అయితే క్షీణత (మైనస్) రేటు 9.8 శాతం నుంచి 3.4 శాతానికి తగ్గింది. మొత్తంగా ఈ విభాగం ఇంకా విధాన నిర్ణేతలకు నిరాశ కలిగించే అంశం.
►ఇదే నెలలో స్వల్పకాల వినియోగానికి ఉద్ధేశించిన ఉత్పత్తుల వృద్ధి రేటు మాత్రం భారీగా 10.7 శాతం పెరిగింది. 2014 ఇదే నెలలో ఈ రేటు మైనస్‌లో 2 శాతంగా (క్షీణత) ఉంది.
11 నెలల్లో...
2014-15 ఆర్థిక సంవత్సరం 11 నెలల కాలంలో (ఏప్రిల్-ఫిబ్రవరి) ఐఐపీ వృద్ధి 2.8 శాతంగా ఉంది. 2013-14 ఇదే కాలంలో అసలు వృద్ధి లేకపోగా 0.1 శాతం క్షీణత (మైనస్)లో ఉంది.
పెట్టుబడులు పెరుగుతున్నాయ్...
డిమాండ్‌కు సంకేతమైన కేపిటల్ గూడ్స్ మంచి పనితీరు పారిశ్రామిక రంగం మెరుగుపడిందనడానికి సంకేతం. కొత్త వ్యాపారం, విదేశీ ఆర్డర్ల ప్రోత్సాహకర ధోరణికి ఇది సంకేతం
- సుమిత్ మజుందార్, సీఐఐ
దేశాభివృద్ధికి బాట...
వ్యాపార వాతావరణం మెరుగుపడుతోందనడానికి ఈ గణాంకాలు చక్కటి ఉదాహరణ. ప్రత్యేకించి కేపిటల్ రంగాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. ఈ క్రమం దేశాభివృద్ధికి సైతం దోహదపడుతుంది
- అలోక్ శ్రీరామ్, పీహెచ్‌డీ చాంబర్
విశ్వాసం ఇంకా కుదరాలి...
గణాంకాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. వృద్ధి పునరుత్తేజం అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే వినియోగ వస్తువుల విభాగంలో ఇంకా నిరాశ నెలకొంది. ఈ రంగం పూర్తిగా పుంజుకుంటేనే వృద్ధిపై పూర్తి విశ్వాసం
- రాణా కపూర్, అసోచామ్
రుణ రేట్లు తగ్గితేనే..!
వృద్ధి క్రమం, పురోగతి సాధించడానికి, పెట్టుబడులు పెరగడానికి, డిమాండ్ మెరుగుపడ్డానికి వడ్డీరేట్లు మరింత తగ్గాల్సిన అవసరం ఉంది. ఈ దిశలో వృద్ధిని పరుగులు పెట్టించడానికి తగిన చర్యలను తీసుకోవడంపై కేంద్రం దృష్టి పెట్టాలి
- దిదార్ సింగ్, ఫిక్కీ