
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి (ఐఐపీ) ఫిబ్రవరిలో 7.1 శాతంగా నమోదయ్యింది. అంటే 2017 ఫిబ్రవరితో పారిశ్రామిక ఉత్పత్తి విలువతో పోల్చితే, 2018 ఫిబ్రవరిలో ఈ విలువ 7.1 శాతం పెరిగిందన్నమాట. 2017 ఫిబ్రవరిలో ఈ రేటు కేవలం 0.8 శాతం. అయితే 2018 జనవరితో (7.4 శాతం వృద్ధి) పోల్చితే ఐఐపీ వృద్ధి రేటు తగ్గడం గమనార్హం. తాజా వృద్ధిలో తయారీ రంగానికి కీలకపాత్ర అని గురువారం విడుదలైన కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) లెక్కలు తెలిపాయి. ముఖ్య విభాగాలను చూస్తే...
తయారీ: మొత్తం ఐఐపీలో దాదాపు 77 శాతం ఉన్న ఈ రంగం వృద్ధి రేటు ఫిబ్రవరిలో 0.7 శాతం నుంచి 8.7 శాతానికి పెరిగింది. ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి మధ్య చూస్తే ఈ వృద్ధి రేటు 4.4 శాతం నుంచి 4.6 శాతానికి పెరిగింది. ఈ విభాగంలోని 23 రంగాల్లో 15 సానుకూల ఫలితాన్ని నమోదుచేసుకున్నాయి.
మైనింగ్: ఫిబ్రవరిలో అసలు వృద్ధిలేకపోగా –0.3 శాతం క్షీణించింది. 2017 ఫిబ్రవరిలో ఈ రంగం వృద్ధి రేటు 4.6 శాతం. ఆర్థిక సంవత్సరం 11 నెలల కాలంలో ఈ రేటు 4.8 శాతం నుంచి 2.3 శాతానికి తగ్గింది.
విద్యుత్: ఫిబ్రవరిలో వృద్ధి రేటు 1.2 శాతం నుంచి 4.5 శాతానికి పెరగ్గా, 11 నెలల కాలంలో 5.9 శాతం నుంచి 5.2 శాతానికి తగ్గింది.
క్యాపిటల్ గూడ్స్: భారీ యంత్ర పరికరాలు, డిమాండ్‌కు సంబంధించిన ఈ విభాగంలో ఫిబ్రవరిలో వృద్ధి రేటు భారీగా 20 శాతం పెరిగింది. 2017 ఫిబ్రవరిలో ఇది –2.4 శాతం క్షీణతలో ఉంది.
కన్జూమర్ డ్యూరబుల్స్: వృద్ధి రేటు 4.6 శాతం నుంచి 7.9 శాతానికి చేరింది.
కన్జూమర్ నాన్ డ్యూరబుల్స్: వృద్ధి 7.4 శాతం నమోదయ్యింది.
11 నెలల కాలంలో నిరాశే...
ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి మధ్య 11 నెలల కాలంలో ఐఐపీ వృద్ధి రేటు 4.7 శాతం నుంచి 4.3 శాతానికి తగ్గడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment