తయారీ రంగం దన్ను!
- ఏప్రిల్‌లో పారిశ్రామిక ఉత్పత్తి ఊరట
- వృద్ధి రేటు 4.1 శాతం
న్యూఢిల్లీ: భారత్ పారిశ్రామిక ఉత్పత్తి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్‌లో ఊరటనిచ్చింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) ఆధారిత కర్మాగారాల ఉత్పత్తి వృద్ధి రేటు ఏప్రిల్‌లో 4.1 శాతంగా నమోదయ్యింది. ఇది రెండు నెలల గరిష్ట స్థాయి. మొత్తం సూచీలో దాదాపు 75 శాతంగా ఉన్న తయారీ రంగం పురోగతి మొత్తం సూచీని తగిన స్థాయిలో ఉంచింది. అయితే డిమాండ్‌కు సూచిక అయిన భారీ యంత్ర పరికరాల ఉత్పత్తి విభాగం వృద్ధి వేగం తగ్గింది. ఇదిలావుండగా, 2014 ఏప్రిల్‌లో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 3.7%. 2015 మార్చికి సంబంధించి తొలి గణాంకం 2.1 శాతాన్ని 2.5 శాతానికి కేంద్రం సవరించింది. ప్రభుత్వం శుక్రవారం ఈ గణాంకాలను విడుదల చేసింది.
► తయారీ రంగం ఏప్రిల్‌లో 5.1 శాతం వృద్ధి రేటును సాధించింది. 2014 ఇదే నెలలో ఈ రేటు 3 శాతం. తయారీ రంగానికి సంబంధించి మొత్తం 22 పారిశ్రామిక గ్రూపుల్లో 16 సానూకూల వృద్ధిని నమోదుచేసుకున్నాయి.
► డిమాండ్, ఆర్థిక క్రియాశీలతకు ప్రధాన సూచిక అయిన భారీ యంత్రపరికరాల ఉత్పత్తికి సంబంధించి క్యాపిటల్ గూడ్స్ రంగం వృద్ధి రేటు 13.4 శాతం నుంచి 11.1 శాతానికి తగ్గింది.
► మైనింగ్ రంగం వృద్ధి రేటు కూడా 1.7 శాతం నుంచి 0.6 శాతానికి తగ్గింది.
► కాగా విద్యుత్ విభాగం మాత్రం 11.9 శాతం వృద్ధి బాట నుంచి 0.5 శాతం క్షీణతలోకి జారింది.
► మిషనరీ అండ్ ఎక్విప్‌మెంట్ 20.6% వృద్ధిని నమోదు.
► కలప, తత్సంబంధ ఉత్పత్తుల వృద్ధి 16.2 శాతం పురోగతి.
► ఆఫీస్, అకౌంటింగ్, కంప్యూటింగ్ మిషనరీ భారీగా 36.5 శాతం క్షీణించింది.
► రేడియో, టీవీ, కమ్యూనికేషన్ పరికరాల ఉత్పత్తిలో కూడా అసలు వృద్ధిలేకపోగా 24 శాతం క్షీణించింది.
► పొగాకు ఉత్పత్తులు 26.7 శాతం క్షీణించాయి.
► వినియోగ వస్తువుల రంగం వృద్ధి కేవలం 1.3 శాతం..
ఇంకా మంచిరోజులు రావాలి: పరిశ్రమలు
పరిశ్రమల ఉత్పత్తి వృద్ధి రేటు 4.1 శాతంగా నమోదుకావడం హర్షనీయ పరిణామమేనని పారిశ్రామిక వర్గాలు పేర్కొన్నాయి. అయితే పూర్తి స్థాయిలో మంచిరోజులు ఇంకా రావాల్సి ఉందని కూడా వారు వ్యాఖ్యానించారు. ఎవరేమన్నారంటే...
అంచనాలకన్నా బాగున్నాయి
మార్కెట్ అంచనాలకన్నా అధికంగానే ఈ గణాంకాలు ఉన్నాయి. పటిష్ట రికవరీ జరుగుతోందనడానికి ఇది సంకేతమే. ప్రభుత్వం తీసుకుంటున్న చొరవల వల్ల రానున్న రోజుల్లో పరిస్థితి మరింత ఆశాజనకంగా మారుతుందని విశ్వసిస్తున్నాం. - చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డెరైక్టర్ జనరల్
మరింత పటిష్టం కావాలి...
ఆర్‌బీఐ కఠిన పరపతి విధాన సరళీకరణ వృద్ధికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలప్రదానికి మరింత దోహదపడతాయని భావిస్తున్నా. ప్రస్తుతానికి వాస్తవరీతిన మంచి రోజులు ఇంకా రాలేదన్నది మా అభిప్రాయం. - రాణా కపూర్, అసోచామ్