ఆర్‌బీఐ వడ్డీ రేట్ల కోతపై ఉత్కంఠ!
- నేడు ఆర్‌బీఐ పాలసీ సమీక్ష
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మంగళవారం మూడవ త్రైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష జరపనుంది. రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో నిర్దేశిత 5.4 శాతం స్థాయిలో ఉండడం.. టోకు ద్రవ్యోల్బణం కొన్ని నెలలుగా అసలు పెరక్కపోగా..క్షీణతలో కొనసాగుతుండడం, పారిశ్రామిక ఉత్పత్తి మందగమన ధోరణి, బ్యాంకింగ్‌లో రుణ వృద్ధి రేటు తగిన స్థాయిలో లేకపోవడం వంటి అంశాల నేపథ్యంలో మరోసారి రెపో రేటును ఆర్‌బీఐ తగ్గించాలన్న డిమాండ్ తీవ్రంగా ఉంది. బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటే రెపో. ప్రస్తుతం ఈ రేటు 7.25 శాతంగా ఉంది. ఈ ఏడాది 75 బేసిస్ పాయింట్లను ఆర్‌బీఐ తగ్గిస్తే... ఇందులో సగం ప్రయోజనాన్ని పలు బ్యాంకులు కస్టమర్లకు బదలాయించాయి. కాగా మంగళవారం ఆర్‌బీఐ ‘రెపో’ రేటుపై తీసుకునే నిర్ణయంపై మార్కెట్ విశ్లేషకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
తగ్గకపోవచ్చు...
బీఓఎఫ్‌ఏ-ఎంఎల్: 4వ తేదీన ఆర్‌బీఐ రెపో రేటును మరింత తగ్గించకపోవచ్చు. దేశంలోని నెలకొన్న వర్షాభావ పరిస్థితులు.. దీనితో ద్రవ్యోల్బణం కట్టు తప్పే అవకాశాలు మా అంచనాలకు కారణం. అయితే 2016 తొలి నెలల్లో రెపో రేటును బ్యాంక్ అరశాతం తగ్గించే అవకాశం ఉందని పేర్కొంది.
డీబీఎస్: డాలర్ విలువ బలపడుతుండటం, అమెరికా వడ్డీరేట్ల పెంపు అవకాశాల వంటివి ఆర్‌బీఐ నిర్ణయంపై ప్రభావితం చూపే అవకాశం ఉంది. మరోపక్క, వర్షాభావ పరిస్థితులూ దేశంలో పొంచి ఉన్నాయి. తాజా పరిస్థితుల్లో ఆర్‌బీఐ ఆగస్టు 4 పాలసీ సమీక్ష సందర్భంగా రెపో రేటును తగ్గించకపోవచ్చు.
కోతకు అవకాశం...
ఇక్రా: బ్యాంకులు మరింతగా రుణరేటు తగ్గించాలంటే... ఆర్‌బీఐ కూడా మరింతగా రెపోరేటును తగ్గించాల్సి ఉంటుంది. ద్రవ్యోల్బణం కట్టడి నేపథ్యంలో ఆర్‌బీఐ రుణ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉంది.
హెచ్‌డీఎఫ్‌సీ: ఆర్‌బీఐ రేపటి సమావేశంలో రేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకుంటుందో లేదో చెప్పలేము. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో రేట్లు 25-50 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశం వుంది.
మూడీస్: ఇంకా వర్షాకాలం ముగిసిపోలేదు. సగటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కమోడిటీ ధరలు తక్కువగానే ఉన్నాయి. దీంతో మంగళవారం రెపో రేటు తగ్గింపునకు అనుకూలంగానే ఆర్‌బీఐ నిర్ణయం తీసుకునే వీలుంది.