
బ్యాంకాక్: ప్రపంచ రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా జూలై పారిశ్రామికోత్పత్తి, రిటైల్ విక్రయ గణాంకాలు నిరాశపరచడంతో సోమవారం ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. చైనా ఎక్సే్చంజీ షాంఘై సూచీ ఒక పాయింటు స్వల్ప నష్టపోయి 3,276 వద్ద ఫ్లాటుగా ముగిసింది. సింగపూర్, ఇండోనేషియా మార్కెట్లు సైతం 0.50–0.20% మధ్య నష్టపోయాయి.
తైవాన్, దక్షిణ కొరియా, థాయిలాండ్ అతి స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. కాగా జపాన్ స్టాక్ ఎక్సే్చంజీ సూచీ నికాయ్ ఒకశాతం లాభపడి ఏడు నెలల గరిష్టం 28,871 స్థాయి వద్ద స్థిరపడింది. కోవిడ్ ఆంక్షల సడలింపుతో రెండో క్వార్టర్ నుంచి తమ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని అక్కడి అధికార వర్గాల ప్రకటన మార్కెట్ ర్యాలీకి కారణమైంది.
చైనా ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్నట్లు సంకేతాలు రావడంతో యూరప్ మార్కెట్లు సైతం బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. ఫ్రాన్స్, జర్మన్ దేశాల స్టాక్ సూచీలు 0.14–0.16 % మధ్య నష్టపోయాయి. బ్రిటన్ ఇండెక్స్ ఎఫ్‌టీయస్‌సీ పావుశాతం పతమైంది. ఆర్థిక అగ్రరాజ్యం అమెరికా మార్కెట్లు ఈ వారం నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. క్రూడాయిల్ ధరల పతనం, ఆర్థిక మాంద్య భయాలతో పాటు నాలుగు వారాల వరుస ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment