గ్లోబల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం ఎక్కువవుతున్న తరుణంలో చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తున్నాయి, విక్రయిస్తున్నాయి. అయితే మొత్తం ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో లేదా వినియోగంలో చైనా కార్ల సంఖ్య ఎక్కువగా ఉంది. దీనికి ప్రధాన కారణం.. చైనా కార్ల ధరలు ఇతర బ్రాండ్ కార్ల కంటే తక్కువగా ఉండటమే..!
ఇప్పటికే కొన్ని దేశాలు చైనా వాహనాల దిగుమతి పూర్తిగా నిషేధించాయి, మరికొన్ని భారీ సుంకాలను విధించాయి. అయినప్పటికీ గ్లోబల్ మార్కెట్లో చైనా కంపెనీ సరసమైన కార్లను విక్రయించడానికి సర్వత్రా సిద్ధమైంది. ఇందులో బీవైడీ ప్రధానంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే భారతదేశంలో కూడా ఈ కంపెనీ ఉత్తమ అమ్మకాలను పొందుతూ.. ఎప్పటికప్పుడు కొత్త కార్లను లాంచ్ చేస్తూనే ఉంది.
ప్రపంచ మార్కెట్లో తమ ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించడానికి.. దానికి అవసరమైనన్ని కార్లను ఉత్పత్తి చేయడానికి బీవైడీ కమకారీలోని పాత ఫోర్డ్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంది. ఇందులో భాగంగానే కంపెనీ బ్రెజిల్‌లో కూడా తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి సిద్ధమైంది.
బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా గత సంవత్సరం చైనాను సందర్శించినప్పుడు, అతను బీవైడీ బిలియనీర్ వ్యవస్థాపకుడు, చైర్ వాంగ్ చువాన్‌ఫును కలిశారు. ఆ సమావేశం తరువాత, బీవైడీ ఆసియా వెలుపల మొదటి కార్ల తయారీ కేంద్రంగా దేశాన్ని ఎంచుకుంది.
బీవైడీ ఈ సంవత్సరం బహియా రాష్ట్రంలోని సైట్‌లో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ ఆటోమొబైల్స్ ఉత్పత్తిని ప్రారంభించాలని భావిస్తోంది. ఇక్కడ బస్సులు, ట్రక్కులు మాత్రమే కాకుండా ప్రాసెస్ బ్యాటరీ పదార్థాలను కూడా తయారు చేస్తుంది. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో.. బీవైడీ ఎలక్ట్రిక్ వాహన రంగంలో అగ్రగామిగా ఎదుగుతుందా? అనే సూచనలు కూడా కనిపిస్తున్నాయని పలువురు నిపుణులు భావిస్తున్నారు.
గత నెలలో అమెరికా అధ్యక్షుడు.. జో బైడెన్ చైనా ఎలక్ట్రిక్ వాహనాలపై 100 శాతం సుంకం ప్రకటించారు. స్వదేశీ ఉత్పత్తుల అమ్మకాలను పెంచడానికి.. చైనా ఉత్పత్తుల సంఖ్యను తగ్గించడానికి అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అమెరికాలో చైనా ఉత్పత్తుల సంఖ్య తగ్గుతుందని స్పష్టంగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment