ఆర్‌బీఐపై రేట్ల కోత ఒత్తిడి
♦ ద్రవ్యోల్బణం భారీగా తగ్గడం,
♦ వృద్ధి మందగమనమే కారణం
♦ నిపుణుల అభిప్రాయం
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం రికార్డు కనిష్టానికి దిగిరావడం, మరోపక్క పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు 2 శాతం కిందికి పడిపోయిన నేపథ్యంలో వడ్డీరేట్లను తగ్గించాలంటూ ఆర్‌బీఐపై ఒత్తిడి పెరిగుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. వచ్చే నెలలో(ఆగస్ట్ 2న) జరిగే పాలసీ సమీక్షలో ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లలో కోత విధించాలని ఆర్థికవేత్తలు, బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు. గత నెలలో జరిగిన పరపతి విధాన కమిటీ సమావేశంలో రెపో రేటును యథాతథంగా (6.25 శాతం) కొనసాగించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం రిస్కులను చూపుతూ ఆర్‌బీఐ వరుసగా నాలుగు సమీక్షల్లోనూ రెపో రేటులో ఎలాంటి మార్పులూ చేయలేదు. కాగా, జూన్ సమీక్షలో ఆర్‌బీఐ ద్రవ్యోల్బణం అంచనాలను భారీగా తగ్గించడం, తాజాగా రిటైల్, టోకు ధరల ద్రవ్యోల్బణం మరింత తగ్గిన నేపథ్యంలో పాలసీ రేట్ల కోతకు ఆస్కారం లభిస్తోందని కోటక్ మహీంద్రా బ్యాంక్ నివేదిక పేర్కొంది.
ఆగస్ట్ సమావేశంలో పావు శాతం రెపో రేటు కోతకు అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ అమెరికా–మెరిల్ లించ్(బీఓఎఫ్‌ఏ–ఎంఎల్) గ్లోబల్ రీసెర్చ్ అంచనా వేసింది. ద్రవ్యోల్బణం రిస్కులు చాలా వరకూ దిగొచ్చాయని ఎస్‌బీఐ నివేదిక పేర్కొంది. రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలోనూ 2 శాతం దిగువనే ఉండొచ్చని... ఆగస్టు–సెప్టెంబర్‌లలో 3 శాతం దిగువన, అక్టోబర్–నవంబర్‌లలో 4 శాతం దిగువన, డిసెంబర్–మార్చి మధ్య 4–4.5 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం రికార్డు కనిష్ట స్థాయి అయిన 1.54 శాతానికి, టోకు ధరల(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం 0.9 శాతానికి(8 నెలల కనిష్టం) దిగిరావడం తెలిసిందే. డిమాండ్‌ను పెంచాలంటే వచ్చే పాలసీ సమీక్షలో ఆర్‌బీఐ రెపో రేటును అర శాతం తగ్గించాల్సిందేనని సీఐఐ కోరుతోంది.