పరిశ్రమలు.. మైనస్లోనే!
• ఆగస్టులో పారిశ్రామికోత్పత్తి 0.7 శాతం క్షీణత
• జూలైలో ఉత్పాదకత మైనస్ 2.49 శాతం
• తయారీ, మైనింగ్, యంత్రపరికరాల
• రంగాల పేలవ పనితీరు ప్రభావం...
న్యూఢిల్లీ: పరిశ్రమల తిరోగమనం కొనసాగుతోంది. వరుసగా రెండో నెలలోనూ మైనస్‌లోనే నిలిచాయి. ఆగస్టులో పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) 0.7% క్షీణించింది. ప్రధానంగా తయారీ, మైనింగ్, యంత్రపరికరాల రంగాల ఉత్పాదక పేలవంగా ఉండటమే దీనికి కారణం. జూలైలో ఐఐపీ మైనస్ 2.49%గా(సవరించిన గణాంకాలు) నమోదైంది. ఇది 8 నెలల కనిష్టస్థాయి. రంగాలవారీగా చూస్తే...
తయారీ: ఆగస్టులో ఈ రంగం ఉత్పాదకత 0.3 శాతం క్షీణించింది. క్రితం ఏడాది ఇదే నెలలో 6.6 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం ఐఐపీలో తయారీ రంగం వాటా 75 శాతం కావడం గమనార్హం.
యంత్రపరికరాలు: ఉత్పాదకత ఆగస్టులో అత్యంత ఘోరంగా 22.9% క్షీణించింది. క్రితం ఏడాది ఇదే నెలలో 21.3 శాతంగా నమోదైంది.
మైనింగ్: 4.5% వృద్ధి నుంచి 5.6 శాతం క్షీణతలోకి జారిపోయింది.
విద్యుత్: ఉత్పాదకత వృద్ధి 5.6 శాతం నుంచి 0.1 శాతానికి తగ్గింది.
కన్జూమర్ గూడ్స్: ఈ రంగంలో ఉత్పాదకత వృద్ధి 6 శాతం నుంచి 1.1 శాతానికి పడిపోయింది. ఇందులో విభాగాలైన కన్జూమర్ డ్యూరబుల్స్ 2.3 శాతం వృద్ధి చెందగా.. మొత్తం తయారీ రంగంలోని 22 పరిశ్రమ గ్రూపులలో 7 గ్రూప్‌ల ఉత్పాదకత ఆగస్టులో మైనస్‌లోనే ఉండటం గమనార్హం.
ఏప్రిల్-ఆగస్టులో ఇలా...: ఈ ఆర్థిక సంవత్సరం(2016-17) తొలి 5 నెలలకు(ఏప్రిల్-ఆగస్ట్) చూస్తే... పారిశ్రామికోత్పత్తి ఉత్పాదకత మైనస్‌లోనే ఉంది. 0.3% క్షీణించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఐఐపీ 4.1% వృద్ధి చెందింది.
ప్రోత్సాహకాలు కావాలి...: కార్పొరేట్లు
వినిమయ ఆధారిత డిమాండ్‌ను పెంచడంద్వారా కొత్త పెట్టుబడులను ఆకర్షించాలంటే ప్రభుత్వం పరిశ్రమలకు పోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని కార్పొరేట్ ఇండియా కోరింది. ఐఐపీ వరుసగా రెండో నెలలోనూ క్షీణించిన నేపథ్యంలో పారిశ్రామిక వర్గాలు తీవ్ర నిరుత్సాహం వ్యక్తం చేశాయి. యంత్రపరికరాల రంగం ఉత్పాదకత ఘోరంగా క్షీణించడాన్ని చూస్తే.. పెట్టుబడులు నిలిచిపోయిన బలమైన సంకేతాలకు నిదర్శనమని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ పేర్కొన్నారు.
తయారీ రంగం తిరోగమనం, విద్యుదుత్పత్తి వృద్ధి తగ్గడం కూడా ఆందోళనకలిగించే అంశమేనని.. 7.6 శాతం జీడీపీ వృద్ధి లక్ష్యానికి ఇది పెనుసవాలుగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. వినిమమ డిమాండ్‌ను పెంచడానికి కొన్ని కీలక చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. దీనివల్ల కొత్త పెట్టుబడులకు అవకాశం ఉంటుందన్నారు. కాగా, ఖరీఫ్ పంట దిగుబడులు రికార్డు స్థాయిల్లో నమోదవుతాయన్న అంచనాల నేపథ్యంలో రానున్న నెలల్లో డిమాండ్ భారీగా పుంజుకోవచ్చని భావిస్తున్నట్లు ఇక్రా వైస్ ప్రెసిడెంట్, సీనియర్ ఎకనమిస్ట్ అదితి నాయర్ పేర్కొన్నారు.