పరిశ్రమలు మైనస్
ఆర్థిక వ్యవస్థకు కష్టకాలం కొనసాగుతూనే ఉంది. శుక్రవారం ఒకేరోజు విడుదలైన రెండు కీలక గణాంకాలు దీనికి అద్దం పడుతున్నాయి. మార్చి నెలలో ఎగుమతులు క్షీణించడంతో పాటు 2013-14 పూర్తి ఏడాదికి ప్రభుత్వం నిర్ధేశించుకున్న ఎగుమతుల లక్ష్యాన్ని చేరకపోవడం, ఫిబ్రవరిలో పారిశ్రామికోత్పత్తి రంగం మళ్లీ తిరోగమనంలోకి జారిపోవడం మందగమనం తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది.
న్యూఢిల్లీ: దేశ పారిశ్రామిక రంగం తీవ్ర ఆటుపోట్లతో కుదేలవుతోంది. మినుకుమినుకుమంటూ కొద్దిగా ఆశలు రేపడం... అంతలోనే తిరోగమనంలోకి జారిపోతుండటంతో పారిశ్రామిక వర్గాలకు ఏంచేయాలో పాలుపోని పరిస్థితి. ఈ ఏడాది జనవరిలో వృద్ధిబాటలోకి వచ్చిన పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ).. ఫిబ్రవరిలో మళ్లీ మైనస్‌లోకి కుంగిపోయింది. 1.9 శాతం క్షీణించింది. ప్రధానంగా తయారీ, యంత్ర పరికరాల రంగాలు అత్యంత పేలవ పనితీరు పారిశ్రామికోత్పత్తిని తూట్లుపొడుస్తోంది. క్రితం ఏడాది ఫిబ్రవరిలో ఐఐపీ వృద్ధి 0.6 శాతంగా నమోదైంది. కేంద్రీయ గణాంకాల సంస్థ(సీఎస్‌ఓ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలను వెల్లడించింది.
మళ్లీ ఉసూరుమనిపించింది...
గతేడాది అక్టోబర్ నుంచి పారిశ్రామికోత్పత్తి తిరోగమనం(మైనస్)లోకి జారిపోవడం మొదలైంది. అక్టోబర్‌లో 1.2% కుంగిన ఐఐపీ.. డిసెంబర్ వరకూ మైనస్‌లోనే కొనసాగింది. తిరిగి జనవరిలో కాస్త వృద్ధిలోకి వచ్చినట్లే వచ్చి.... మళ్లీ ఈ ఫిబ్రవరిలో భారీగా క్షీణించడం(మైనస్ 1.9 %) గమానార్హం. పరిశ్రమల వెనుకబాటుకు అధిక వడ్డీరేట్లు కూడా ప్రధాన కారణమేనంటూ గగ్గోలుపెడుతున్న కార్పొరేట్లు... తక్షణం వడ్డీరేట్లు తగ్గించి ఆర్‌బీఐ చేయూతనందించాలని డిమాండ్ చేశారు.
తయారీ తుస్...
మొత్తం ఐఐపీలో 75% మేర వాటా కలిగిన తయారీ రంగం ఘోరంగా చతికిలపడింది. గతేడాది ఫిబ్రవరిలో 2.1% వృద్ధి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరిలో 3.7 శాతం క్షీణతలోకి దిగజారిపోయింది. ఇక 2013-14 ఏప్రిల్-ఫిబ్రవరి కాలంలోనూ ఈ రంగం ఉత్పాదకత 0.7% కుంగింది. అంతక్రితం ఏడాది ఇదే వ్యవధికి 1 శాతం వృద్ధి నమోదైంది. యంత్ర పరికరాల రంగం ఉత్పాదకత ఫిబ్రవరిలో ఏకంగా 17.4% కుంగిపోయింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఈ రంగం 9.1% వృ ద్ధి సాధించింది. తయారీ రంగంలోనూ 22 పారిశ్రామిక విభాగాలకుగాను 13 విభాగాలు ఈ ఫిబ్రవరిలో మైనస్‌లోనే కొనసాగడం దుర్భర పరిస్థితికి నిదర్శనం.
ఇతర రంగాల పరిస్థితి ఇదీ...
కన్జూమర్ గూడ్స్ ఉత్పాదకత ఫిబ్రవరిలో 4.5% కుంగింది.
కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగం ఉత్పాదకత క్షీణత 2.6% నుంచి 9.3 శాతానికి చేరింది.
కన్జూమర్ నాన్‌డ్యూరబుల్స్ విభాగం ఉత్పాదకత కూడా ఫిబ్రవరిలో 3.2 శాతం వృద్ధి నుంచి 1.2 % క్షీణతలోకి జారింది.
ఇక విద్యుత్ రంగం ఉత్పాదకత ఫిబ్రవరిలో 11.5 % పెరిగింది. క్రితం ఏడాది ఇదే నెలలో ఈ రంగం 3.2 శాతం క్షీణతను నమోదుచేసింది.
మైనింగ్ రంగం క్రితం ఏడాది ఫిబ్రవరిలో 7.7 శాతం క్షీణించగా.. ఈ ఏడాది ఇదే నెలలో 1.4 శాతం వృద్ధిరేటును సాధించింది.