ఇంకా తగ్గిన మార్కెట్
ఇంట్రాడేలో 7,500 పాయింట్ల దిగువకు నిఫ్టీ...
ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాల వెల్లడి(మార్కెట్ ముగిసిన తర్వాత ఈ గణాంకాలు వెలువడ్డాయి) నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచి, తూచి వ్యవహరించడంతో స్టాక్ మార్కెట్లో మంగళవారం నష్టాలు తప్పలేదు. ఇంట్రాడేలో నిఫ్టీ కీలకమైన 7,500 పాయింట్ల దిగువకు పడిపోయింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 143 పాయింట్లు క్షీణించి 24,682 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 54 పాయింట్లు నష్టపోయి 7,510 పాయింట్ల వద్ద ముగిశాయి సెన్సెక్స్‌కు ఇది 19 నెలల్లో అత్యంత కనిష్ట ముగింపు.
చైనా వృద్ధిపై ఆందోళన, ముడి చమురు 12 ఏళ్ల కనిష్ట ధర అయిన 31 డాలర్ల దిగువకు పడిపోవడం వంటి ప్రతికూలాంశాల కారణంగా సెంటిమెంట్ బలహీనమైందని నిపుణులంటున్నారు. బ్యాంక్, రియల్టీ, లోహ, మౌలిక, ఆయిల్ అండ్ గ్యాస్, పీఎస్‌యూ, ఐటీ రంగాల షేర్లు బాగా దెబ్బతిన్నాయి.
‘మోదీ’ లాభాలన్నీ హుష్‌కాకి: మంగళవారం క్షీణతతో కొత్త(నరేంద్ర మోదీ) ప్రభుత్వం కొలువుదీరిన (2014, మే 26) తర్వాత సెన్సెక్స్‌కు వచ్చిన లాభాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి.
కాగా ఏడాది కాలంలో సెన్సెక్స్ 5,000 పాయింట్లు నష్టపోయింది. ఈ పతనంలో ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ వంటి ఆర్థిక కంపెనీల షేర్లు, ఎల్ అండ్ టీ, భెల్ వంటి క్యాపిటల్ గూడ్స్ షేర్ల వాటా సగానికి పైగా (2,804 పాయింట్లు) ఉంది.
టీసీఎస్... ఎడాది కనిష్ట స్థాయికి: ఆర్థిక ఫలితాల నేపథ్యంలో టీసీఎస్ ఏడాది కనిష్ట స్థాయి(రూ.2,301)కి పడిపోయింది. చివరకు 1.7 శాతం నష్టంతో రూ. 2324 వద్ద ముగిసింది.