హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వంట నూనెల మార్కెట్లో బ్రాండెడ్ కంపెనీల హవా నడుస్తోంది. రెండు దశాబ్దాల క్రితం దేశంలో మొత్తం అమ్మకాల్లో విడినూనెల వాటా 70 శాతం ఉండేది. ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. ఇప్పుడీ వాటాను ప్యాక్డ్ విభాగం కైవసం చేసుకుంది. వ్యవస్థీకృత బ్రాండ్లు క్రమంగా మార్కెట్‌ను చేజిక్కించుకుంటున్నాయి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా నూనెను దిగ్గజ బ్రాండ్లు పోటీ ధరలో అందిస్తుండడంతో వీటి డిమాండ్ పెరిగిందని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ చెబుతోంది. ఇప్పుడు దేశంలో ఒక్కో కస్టమర్ ఏటా సగటు వినియోగం 18 కిలోలకు చేరింది. 2000 సంవత్సరానికి ముందు ఇది కేవలం 10 కిలోలు మాత్రమే.
ఇదీ నూనెల మార్కెట్..
దేశవ్యాప్తంగా 23.5 మిలియన్ టన్నుల వంట నూనెల వినియోగం జరుగుతోంది. ఇందులో దిగుమతులు 15 మిలియన్ టన్నులు. మిగిలినది దేశీయంగా ఉత్పత్తి అవుతోంది. వినియోగం ఏటా 2.5–3 శాతం పెరుగుతోంది. పామ్ ఆయిల్ 9 మిలియన్ టన్నులు, సోయా 4.5, సన్‌ఫ్లవర్ 2.5, ఆవ నూనె 2.5, కాటన్ సీడ్ ఆయిల్ 1.2, రైస్ బ్రాన్ ఆయిల్ 1 మిలియన్ టన్నులు, మిగిలినది పల్లి నూనె, నువ్వుల నూనె వంటివి ఉంటాయి. ఇక దేశీయంగా 2018–19లో సోయా ఆయిల్‌సీడ్ 11 మిలియన్ టన్నులు ఉత్పత్తి అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఆవాల ఉత్పత్తి గతేడాది 7 మిలియన్ టన్నులు కాగా, ఈ ఏడాది 8.5 మిలియన్ టన్నులు, రైస్ బ్రాన్ ఆయిల్ 1 మిలియన్ టన్నుల ఉత్పత్తి కానుంది. దేశంలో సన్‌ఫ్లవర్ ఉత్పత్తి దాదాపు లేనట్టే. పల్లి నూనె పదేళ్ల క్రితం వినియోగం 1.2 మిలియన్ టన్నులు ఉంటే, ఇప్పుడు 200 టన్నులకు వచ్చి చేరింది.
ధర పెరిగే అవకాశం లేదు..
వంట నూనెల ధర ఇప్పట్లో పెరిగే అవకాశం లేదని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అతుల్ చతుర్వేది సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘అంతర్జాతీయంగా వంట నూనె గింజలు, నూనె ధర తగ్గింది. మరోవైపు డాలర్ విలువ పడిపోతోంది. దిగుమతులు చవక అయ్యాయి. దేశీయంగా ద్రవ్యోల్బణం అదుపులో ఉంది. అందుకే నూనెల ధర పెరగదు. ఇక రైతులకు మద్దతు ధర దొరక్కపోతే నూనె గింజల ఉత్పత్తి నుంచి తప్పుకుంటారు. ఇదే జరిగితే వచ్చే 10 ఏళ్లలో దిగుమతులే 25 మిలియన్ టన్నులకు చేరుకోవడం ఖాయం. అందుకే ప్రభుత్వమే చొరవ తీసుకుని మంచి మద్దతు ధర నిర్ణయించాలి. దిగుమతి సుంకం పెంచాలి. ఇవన్నీ జరిగితే రైతులను ప్రోత్సహించినట్టే’ అని వివరించారు.
ఫుడ్ ఇండస్ట్రీ 20 శాతం..
దేశీయంగా జరుగుతున్న మొత్తం నూనెల వినియోగంలో ఫుడ్ ఇండస్ట్రీ వాటా 20 శాతముంటుందని ఆల్ ఇండియా కాటన్ సీడ్ క్రషర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సందీప్ బజోరియా వెల్లడించారు. నమ్‌కీన్, స్నాక్స్ ఎక్కువ కాలం తాజాగా ఉండేందుకు ఫుడ్ పరిశ్రమ కొంత కాలంగా కాటన్ సీడ్ ఆయిల్‌ను పెద్ద ఎత్తున వినియోగిస్తోందన్నారు. పత్తి గింజల నూనె ధర తక్కువ కూడా. ఇతర వంటకాల్లోనూ వాడేందుకు ఈ నూనె అనువైనది అని వివరించారు. ఏటా 13 లక్షల టన్నుల కాటన్ సీడ్ ఆయిల్ భారత్‌లో ఉత్పత్తి అవుతోంది.
భారత్‌లో కర్జూర ఉత్పత్తి..
దేశంలో నూనె గింజల ఉత్పత్తి క్రమంగా తగ్గుతోంది. పంట వైశాల్యంలో ఎలాంటి మార్పు లేదు. ఉత్పాదకతే తగ్గుతోందని మహారాష్ట్ర అగ్రికల్చర్ కాస్ట్, ప్రైస్ కమిషన్ చైర్మన్ పాషా పటేల్ తెలిపారు. ‘దీనికి కారణం వాతావరణంలో వస్తున్న మార్పులే. దేశవ్యాప్తంగా వర్షాలు క్షీణించాయి. ప్రభుత్వమే చొరవ తీసుకుని పచ్చదనాన్ని పెంచాల్సిందే. మరో విషయమేమంటే తక్కువ నీటిని వినియోగించే బాంబూ, కర్జూర వంటి పంటల వైపు రైతులు మళ్లుతున్నారు. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్తాన్‌లో కర్జూర పంట వేస్తున్నారు’ అని వివరించారు.
వంట నూనెల మార్కెట్లో బ్రాండ్స్ హవా
Published Tue, Mar 26 2019 12:00 AM | Last Updated on Tue, Mar 26 2019 12:00 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment