మళ్లీ ప్లస్లోకి పరిశ్రమలు!
♦ మేలో పారిశ్రామికోత్పత్తి 1.2% వృద్ధి
♦ వినియోగ వస్తువుల ఉత్పత్తి దన్ను
♦ ఏప్రిల్‌లో వృద్ధిలేకపోగా -1.3 శాతం క్షీణత
న్యూఢిల్లీ : పారిశ్రామిక ఉత్పత్తి మే నెలలో మళ్లీ వెలుగు వెలిగింది. వార్షికంగా చూస్తే, ఏప్రిల్‌లో అసలు వృద్ధిలేకపోగా -1.3 శాతం క్షీణించిన (2015 ఏప్రిల్ ఉత్పత్తి విలువతో పోల్చి), మేలో తిరిగి వార్షికంగా 1.2 శాతం పారిశ్రామిక ఉత్పత్తి నమోదయ్యింది. టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్ల వంటి వినియోగ ఉత్పత్తుల్లో వృద్ధి దీనికి ప్రధాన కారణం. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) మంగళవారం విడుదల చేసిన మే నెల గణాంకాల ప్రకారం ముఖ్య రంగాలను చూస్తే...
తయారీ: మొత్తం సూచీలో దాదాపు 75 శాతం వాటా ఉన్న ఈ రంగం ఉత్పత్తి వృద్ధి రేటు 2.1% నుంచి 0.7%కి తగ్గింది. ఏప్రిల్-మే నెలల్లో అసలు వృద్ధిలేకపోగా -1.5% క్షీణించింది. 2015 ఇదే కాలంలో ఈ రేటు 3 శాతం. తయారీ రంగంలోని 22 పారిశ్రామిక గ్రూపుల్లో 14 గ్రూపులు వృద్ధిలో నిలిచాయి.
మైనింగ్: ఉత్పత్తి వృద్ధి 2.1% నుంచి 1.3 శాతానికి పడింది. ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో రేటు 0.7 శాతం నుంచి 1.2 శాతానికి పెరిగింది.
విద్యుత్: మేలో ఉత్పత్తి వృద్ధి రేటు 6 శాతం నుంచి 4.7 శాతానికి తగ్గింది. అయితే తొలి రెండు నెలల్లో వృద్ధి రేటు 2.8% నుంచి 9.4 శాతానికి ఎగసింది.
వినియోగ డ్యూరబుల్స్: టెలివిజన్, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్ల వంటి వైట్ గూడ్స్ ఉత్పత్తుల్లో 2015 మేలో అసలు వృద్ధి లేకపోగా - 3.9 శాతం క్షీణిస్తే, ఈ 2016 మేలో 6% వృద్ధి నమోదయ్యింది. నాన్-డ్యూరబుల్స్ గూడ్స్ ఉత్పత్తుల్లో మాత్రం వృద్ధి లేకపోగా, 2.2 శాతం క్షీణత నమోదయ్యింది. రెండూ కలిపి ఈ విభాగంలో 1.1 శాతం వృద్ధి చోటుచేసుకుంది.
క్యాపిటల్ గూడ్స్: డిమాండ్‌కు ప్రతిబింబమైన భారీ యంత్రపరికరాల ఉత్పత్తికి సంబంధించిన ఈ విభాగంలో సైతం వృద్ధి నమోదుకాకపోగా, -12.4 శాతం క్షీణత నమోదయ్యింది.
రెండు నెలల్లో...
కాగా ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో (ఏప్రిల్-మే) అసలు వృద్ధిలేకపోగా -0.1 శాతం క్షీణతలో ఉంది. 2015 ఇదే కాలంలో వృద్ధి 2.8 శాతం. గడచిన ఆరు నెలల్లో మూడు నెలలు పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో అసలు వృద్ధిలేకపోగా, క్షీణతను నమోదు చేసుకుంది.