CSO
-
జీడీపీ వృద్ధి రేటు అంచనా 7.2 శాతం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రసుత్త ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతంగా ఉంటుందని కేంద్ర గణాంక కార్యాలయం (సీఎస్ఓ) అంచనా వేసింది. అంతకుముందు ఏడాది జీడీపీ వృద్ధి రేటు 6.7 శాతంగా నమోదైంది. వ్యవసాయం, ఉత్పాదక రంగాల్లో మెరుగైన సామర్ధ్యం కనబరచడంతో వృద్ధి రేటు మెరుగవుతుందని అంచనా వేస్తున్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి తొలి ముందస్తు అంచనాలు వెల్లడిస్తూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.2 శాతంగా అంచనా వేస్తున్నట్టు సీఎస్ఓ వెల్లడించింది. వ్యవసాయం, అటవీ సంబంధిత, మత్స్య కార్యకలాపాలు గత ఏడాది 3.4 శాతం ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3.8 శాతానికి పెరగనున్నాయని పేర్కొంది. ఇక 2017-18లో 5.7 శాతంగా నమోదైన తయారీ రంగం 8.3 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. కాగా 2015-16లో దేశ జీడీపీ 8.2 శాతం వృద్ధి సాధిస్తే,2016-17లో 7.1 శాతం వృద్ధి సాధించింది. జీఎస్టీ, నోట్ల రద్దు ప్రభావంతో 2017-18లో జీడీపీ వృద్ధి రేటు 6.7 శాతానికి తగ్గింది. -
ఆర్థిక గణాంకాల నీరసం!
న్యూఢిల్లీ: భారత్ తాజా ఆర్థిక గణాంకాలు కొంత నిరాశ పరిచాయి. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం– ఆగస్టులో పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) వృద్ధి రేటు 4.3 శాతంగా (2017 ఇదే నెలతో పోల్చి చూస్తే) నమోదయ్యింది. మూడు నెలల కాలంలో ఇంత తక్కువ స్థాయిలో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు నమోదుకావడం ఇదే తొలిసారి. మైనింగ్ రంగం అలాగే భారీ ఉత్పత్తుల యంత్ర పరికరాలకు సంబంధించి క్యాపిటల్ గూడ్స్ విభాగాల పేలవ పనితీరు దీనికి కారణం. జూలైలో ఐఐపీ వృద్ధి రేటు 6.5 శాతంకాగా, గత ఏడాది ఇదే కాలంలో రేటు 4.8 శాతం. ఇక సెప్టెంబర్‌లో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 3.77 శాతంగా నమోదయ్యింది. 2017 ఇదే నెలలో ఈ రేటు 3.28 శాతం. ఈ ఏడాది ఆగస్టులో ఈ రేటు పది నెలల కనిష్ట స్థాయిలో 3.69 శాతంగా నమోదయ్యింది. పారిశ్రామికం... రంగాల వారీగా.. మైనింగ్: 2017 ఆగస్టులో 9.3 శాతం వృద్ధి రేటు నమోదయితే 2018 ఆగస్టులో అసలు వృద్ధిలేకపోగా, –0.4 శాతం క్షీణత నమోదయ్యింది. అయితే ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో ఈ రేటు 3.2 శాతం నుంచి 3.9 శాతానికి పెరిగింది. క్యాపిటల్ గూడ్స్: ఈ రంగం కూడా 7.3 వృద్ధిరేటు నుంచి 5 శాతం క్షీణతకు పడిపోయింది. తయారీ: ఈ రంగంలో వృద్ధి రేటు 3.8 శాతం నుంచి 4.6 శాతానికి పెరిగింది. ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు (ఐదు నెలలు) మధ్య ఈ రేటు 1.7 శాతం నుంచి 5.4 శాతానికి పెరిగింది. తయారీ రంగంలోని మొత్తం 23 పారిశ్రామిక గ్రూపుల్లో 16 సానుకూలంగా ముగిశాయి. విద్యుత్: ఈ రంగం నిరాశాజనకంగా ఉంది. ఆగస్టులో వృద్ధి రేటు 8.3 శాతం నుంచి 7.6 శాతానికి తగ్గితే, ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య ఈ రేటు 6.2 శాతం నుంచి 5.8 శాతానికి తగ్గింది. కన్జూమర్: కన్జూమర్ డ్యూరబుల్స్, కన్జూమర్ నాన్–డ్యూరబుల్స్ రంగాల్లో వృద్ధి రేట్లు వరుసగా 5.2 శాతం, 6.3 శాతంగా ఉన్నాయి. ఐదు నెలల్లో బాగుంది.... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల కాలంలో (ఏప్రిల్–ఆగస్టు) వృద్ధి రేటు 2.3 శాతం నుంచి 5.2 శాతానికి పెరిగింది. పెరిగిన క్రూడ్, ఆహార ధరలు! పెరిగిన క్రూడ్, ఆహార ధరలు సెప్టెం బర్లో రిటైల్ ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపాయి. చేపలు, గుడ్లు, పాలు, పాలపదార్థాలు ధరలు స్వల్పంగా పెరిగాయి. అయితే పండ్ల ధరలు మాత్రం కొంచెం తగ్గాయి. కన్జూమర్ ఫుడ్ బాస్కెట్ ధర 0.51 శాతం పెరిగింది. ఫ్యూయెల్, లైట్ కేటగిరీలో ద్రవ్యోల్బణం రేటు 8.47 శాతం పెరిగింది. -
దేవస్థానంలో గిరిజన యువకుడిపై దాష్టీకం
-
వృద్ధి చక్రాలు వెనక్కి!
♦ 2017–18 తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 5.7 శాతమే ♦ మూడేళ్ల కనిష్ట స్థాయికి; అంచనాలను మించిన పతనం ♦ నోట్ల రద్దు ప్రభావమేనన్న విశ్లేషకులు ♦ అంతక్రితం త్రైమాసికంలో ఇది 6.1 శాతం ♦ 2016–17 తొలి త్రైమాసికంలో ఏకంగా 7.9 శాతం న్యూఢిల్లీ: ఒకవైపు పన్ను సంస్కరణలు... మరోవైపు రివ్వున ఎగుస్తున్న స్టాక్ మార్కెట్లు... భారత ఆర్థిక వ్యవస్థ మెరిసిపోతున్నదనే సంకేతాలిస్తుండగా గురువారం వెలువడిన ఆర్థిక వృద్ధి రేటు గణాంకాలు మాత్రం దానిపై నీళ్లు చల్లేశాయి. 2017–18 తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్, క్యూ1) వృద్ధి కేవలం 5.7%గా నమోదయింది. విలువ రూపంలో చూస్తే ఇది రూ.31.10 లక్షల కోట్లు. 2014 జనవరి– మార్చి మధ్య 4.6% కనిష్ట వృద్ధి రేటు నమోదు కాగా... ఆ తరవాత అత్యంత తక్కువ ఇదే. గతేడాది ఇదే కాలంలో నమోదైన వృద్ధి రేటు 7.9% కావటం గమనార్హం. గతేడాది 4వ త్రైమాసికంలో కూడా 6.1% నమోదు కాగా... ఇపుడు దారుణంగా పడిపోవటం గమనార్హం. నవంబర్ 8న కేంద్రం రూ.1,000, రూ.500 నోట్లను రద్దు చేసిన ప్రభావం ఆర్థిక వ్యవస్థపై కొనసాగుతోందనడానికి ఈ గణాంకాలే నిదర్శనమనే వాదనలు వినిపిస్తున్నాయి. వరుసగా 3 త్రైమాసికాల నుంచీ స్థూల దేశీయోత్పత్తి కిందకు జారుతోంది. నోట్ల రద్దు దెబ్బకు తయారీ రంగంలో ఉత్పత్తి భారీగా పడిపోవడం దీనికి ప్రధాన కారణం. తాజా గణాంకాలను కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) విడుదల చేసింది. జీవీఏ 5.6 శాతమే..! ఉత్పత్తి లేదా సరఫరాలవైపు నుంచి ఆర్థిక క్రియాశీలతను జీవీఏ(గ్రాస్ వాల్యూ యాడెడ్) గణాంకాలు సూచిస్తే, వినియోగపరంగా లేదా డిమాండ్ పరంగా ఉన్న పరిస్థితిని జీడీపీ గణాంకాలు సూచిస్తాయి. దీని ప్రకారం జీవీఏ 5.6%గా నమోదైంది. అంతక్రితం త్రైమాసికంలోనూ ఇదే స్థాయిలో ఉంది. రంగాల వారీగా... జీడీపీలో దాదాపు 15 శాతం వాటా కలిగిన తయారీ రంగం తీవ్ర నిరాశను మిగిల్చింది. ఈ విభాగంలో జీవీఏ వార్షికంగా భారీగా 10.7 శాతం నుంచి 1.2 శాతానికి పడిపోయింది. వ్యవసాయం: జీడీపీలో దాదాపు 15 శాతం వాటా ఉన్న ఈ రంగంలో (అటవీ, ఫిషింగ్ సహా) కూడా తొలి త్రైమాసికంలో వృద్ధి స్వల్పంగా తగ్గి, 2.5 శాతం నుంచి 2.3 శాతానికి చేరింది. మైనింగ్: వృద్ధి 2.3 శాతం క్వారీయింగ్: వృద్ధి లేకపోగా – 0.7 శాతం క్షీణత. నిర్మాణం: 1.2 శాతం వృద్ధి ఆర్థిక, బీమా, రియల్టీ: వృద్ధి 2 శాతం వృత్తిపరమైన సేవలు: వృద్ధి రేటు 6.4 శాతం బడ్జెట్ లక్ష్యంలో 92.4 శాతానికి ద్రవ్యలోటు! ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017–18) బడ్జెట్ లక్ష్యంలో ద్రవ్యోలోటు జూలై నెలాఖరుకు 92.4 శాతానికి చేరింది. వివరాల్లోకి వెళితే, 2017–18 ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ ఆదాయం–వ్యయాలకు మధ్య వ్యత్యాసం– ద్రవ్యలోటు లక్ష్యం రూ.5,46,532 కోట్లు. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాలో 3.2 శాతం. దీనర్థం జీడీపీలో ద్రవ్యోలోటు 3.2 శాతం దాటకూడదన్నమాట (గత ఆర్థిక సంవత్సరం లక్ష్యం 3.5 శాతం) అయితే ఆర్థిక సంవత్సరం జూలై నాటికే ద్రవ్యలోటు రూ.5.04 లక్షల కోట్లకు చేరింది. అంటే 2017–18 బడ్జెట్ అంచనాల్లో ఇది 92.4 శాతం అన్నమాట. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఈ నిష్పత్తి 73.7 శాతంగా ఉంది. నోట్ల రద్దు కాదు... జీఎస్టీయే కారణం!! ఈ ఏడాది జూలై 1 నుంచి వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో కార్లు, ఎఫ్ఎంసీజీ, దుస్తులు సహా పలు రంగాలు ఉత్పత్తి చేయడాన్ని పక్కనబెట్టి, తమ వద్ద ఉన్న స్టాక్స్ విక్రయాలపై అధికంగా దృష్టి సారించాయి. ఇది జీవీఏ యథాతథంగా కొనసాగడానికి కారణమయ్యింది. ఈ పరిస్థితుల్లో ఉత్పత్తి నిల్వలు తగ్గడం, కొత్త ఉత్పత్తులు జరక్కపోవడం, సంబంధిత సర్దుబాటు అంశాలు జీడీపీపై కూడా ప్రభావం చూపాయి. జీడీపీ వృద్ధి తగ్గడానికి ఈ అంశాలే కారణం తప్ప, నోట్ల రద్దు కాదు. ఇప్పుడు జీఎస్టీ అమలుతో వృద్ధి పునరుత్తేజానికి వీలవుతుంది. – టీసీఏ అనంత్, చీఫ్ స్టాటిస్టీషియన్ పూర్తి ఏడాది 6.3 శాతమే..! జీడీపీ వృద్ధి రేటు తగ్గిపోవడం జీఎస్టీ ప్రభావం వల్లనే. నిజానికి నా అంచనాకన్నా ఇది 40 బేసిస్ పాయింట్లు తక్కువ. ఈ నేపథ్యంలో మొత్తం ఏడాది వృద్ధి 6.3%గా ఉంటుందని బావిస్తున్నా. – ప్రణబ్ సేన్, మాజీ చీఫ్ స్టాటిస్టీషియన్ పరిస్థితులు మారాలి: పరిశ్రమలు జీడీపీ వృద్ధి రేటు మూడేళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడం పట్ల పారిశ్రామిక వర్గాలు విచారం వ్యక్తం చేశాయి. వ్యాపారాలకు తగిన పరిస్థితుల కల్పన ఇప్పటికీ ఆందోళనకరంగా ఉన్నట్లు పీహెచ్‌డీసీసీఐ అధ్యక్షుడు గోపాల్ జీవరాజ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పలు క్లిష్టమైన నిబంధనలను సడలించాల్సి ఉందనీ వివరించారు. కార్మిక చట్ట సంస్కరణలు జరగాలని, ఏకీకృత కార్మిక చట్టం దేశ వ్యాప్తంగా అమల్లోకి తీసుకురావాలని కోరారు. ప్రైవేటు పెట్టుబడుల పునరుద్ధరణపై విధాన నిర్ణేతలు తక్షణం దృష్టి సారించాలని అసోచామ్ సూచించింది. ఇంతకన్నా తగ్గదు నిజానికి ఈ ఫలితం పట్ల కొంత ఆందోళన ఉంది. పరిశ్రమలు జీఎస్టీ కోసం చేసుకున్న ముందస్తు ఏర్పాట్ల వల్ల ఇది జరిగిందని భావిస్తున్నాం. వృద్ధి రేటు ఇంతకుమించి తగ్గదని భావిస్తున్నాం. భవిష్యత్ త్రైమాసికాల్లో భారీ వృద్ధిని సవాలుగా తీసుకుని, ఇందుకు తగిన చర్యలను కేంద్రం తీసుకుంటుంది. సేవల రంగం పుంజుకుంటుందని, పెట్టుబడులకు పునరుత్తేజం వస్తుందని భావిస్తున్నాం. వార్షిక జీడీపీ వృద్ధి రేటు 7 శాతంగా ఉంటుందని మా అంచనా. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగతి, తగిన వర్షపాతం ఇందుకు దోహదపడతాయని భావిస్తున్నాం. ఆర్థిక సంస్కరణల ఫలితాలూ అందివస్తాయి. – అరుణ్‌జైట్లీ, ఆర్థిక మంత్రి చైనాకన్నా వెనకబడ్డాం... గత ఏడాది చివరి వరకూ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలిచింది. అయితే ఈ ఏడాది (2017) తొలి రెండు త్రైమాసికాల్లో (జనవరి–జూన్) చైనా వృద్ధి రేటు 6.9 శాతంగా ఉంది. భారత్‌లో మాత్రం ఇది జారుతూ వరుసగా ఈ రెండు త్రైమాసికాల్లో 6.1, 5.7 శాతాలుగా నమోదయ్యింది. దీనితో వృద్ధి వేగం విషయంలో చైనాతో పోల్చితే భారత్ వెనకబడినట్లయ్యింది. ఎనిమిది రంగాల గ్రూప్ దిగాలు పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో దాదాపు 38 శాతం వాటా ఉన్న ఎనిమిది పరిశ్రమల గ్రూప్ జూలై గణాంకాలూ నిరాశాకరంగా ఉన్నాయి. ఈ నెల్లో ఈ రంగాల ఉత్పత్తి రేటు కేవలం 2.4 శాతంగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే నెలలో ఈ రేటు 3.1 శాతం. వార్షికంగా ఎనిమిది రంగాల పనితీరునూ వేర్వేరుగా చూస్తే...వృద్ధిలో... సహజ వాయువు: ఈ రంగంలో వృద్ధి రేటు 4.1 శాతం నుంచి 6.6 శాతానికి పెరిగింది. బొగ్గు: ఉత్పత్తి వృద్ధి రేటు 4.1 శాతం నుంచి 0.7 శాతానికి జారింది. స్టీల్: అసలు వృద్ధి లేని స్థాయి నుంచి భారీగా 9.2 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. విద్యుత్: వృద్ధి రేటు 2.1 శాతం నుంచి 5.4 శాతానికి ఎగసింది. క్షీణతలో... క్రూడ్ ఆయిల్: ఈ రంగంలో అసలు వృద్ధి లేదు. క్షీణతలో కొనసాగుతోంది. –0.5 శాతం క్షీణత మరింతగా –1.8 శాతం క్షీణతకు జారింది. రిఫైనరీ ప్రొడక్టులు: 8 శాతం వృద్ధి రేటు –2.7 క్షీణతలోకి పడిపోయింది. ఎరువులు: క్రూడ్ ఆయిల్ తరహాలోనే ఈ రంగంలో కూడా క్షీణత –0.3 శాతం నుంచి –3.2 శాతానికి పెరిగింది. సిమెంట్: ఈ రంగంలో కూడా 0.7 శాతం వృద్ధి –2 శాతం క్షీణతకు పడింది. -
మళ్లీ ప్లస్‌లోకి పరిశ్రమలు!
♦ మేలో పారిశ్రామికోత్పత్తి 1.2% వృద్ధి ♦ వినియోగ వస్తువుల ఉత్పత్తి దన్ను ♦ ఏప్రిల్‌లో వృద్ధిలేకపోగా -1.3 శాతం క్షీణత న్యూఢిల్లీ : పారిశ్రామిక ఉత్పత్తి మే నెలలో మళ్లీ వెలుగు వెలిగింది. వార్షికంగా చూస్తే, ఏప్రిల్‌లో అసలు వృద్ధిలేకపోగా -1.3 శాతం క్షీణించిన (2015 ఏప్రిల్ ఉత్పత్తి విలువతో పోల్చి), మేలో తిరిగి వార్షికంగా 1.2 శాతం పారిశ్రామిక ఉత్పత్తి నమోదయ్యింది. టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్ల వంటి వినియోగ ఉత్పత్తుల్లో వృద్ధి దీనికి ప్రధాన కారణం. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) మంగళవారం విడుదల చేసిన మే నెల గణాంకాల ప్రకారం ముఖ్య రంగాలను చూస్తే... తయారీ: మొత్తం సూచీలో దాదాపు 75 శాతం వాటా ఉన్న ఈ రంగం ఉత్పత్తి వృద్ధి రేటు 2.1% నుంచి 0.7%కి తగ్గింది. ఏప్రిల్-మే నెలల్లో అసలు వృద్ధిలేకపోగా -1.5% క్షీణించింది. 2015 ఇదే కాలంలో ఈ రేటు 3 శాతం. తయారీ రంగంలోని 22 పారిశ్రామిక గ్రూపుల్లో 14 గ్రూపులు వృద్ధిలో నిలిచాయి. మైనింగ్: ఉత్పత్తి వృద్ధి 2.1% నుంచి 1.3 శాతానికి పడింది. ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో రేటు 0.7 శాతం నుంచి 1.2 శాతానికి పెరిగింది. విద్యుత్: మేలో ఉత్పత్తి వృద్ధి రేటు 6 శాతం నుంచి 4.7 శాతానికి తగ్గింది. అయితే తొలి రెండు నెలల్లో వృద్ధి రేటు 2.8% నుంచి 9.4 శాతానికి ఎగసింది. వినియోగ డ్యూరబుల్స్: టెలివిజన్, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్ల వంటి వైట్ గూడ్స్ ఉత్పత్తుల్లో 2015 మేలో అసలు వృద్ధి లేకపోగా - 3.9 శాతం క్షీణిస్తే, ఈ 2016 మేలో 6% వృద్ధి నమోదయ్యింది. నాన్-డ్యూరబుల్స్ గూడ్స్ ఉత్పత్తుల్లో మాత్రం వృద్ధి లేకపోగా, 2.2 శాతం క్షీణత నమోదయ్యింది. రెండూ కలిపి ఈ విభాగంలో 1.1 శాతం వృద్ధి చోటుచేసుకుంది. క్యాపిటల్ గూడ్స్: డిమాండ్‌కు ప్రతిబింబమైన భారీ యంత్రపరికరాల ఉత్పత్తికి సంబంధించిన ఈ విభాగంలో సైతం వృద్ధి నమోదుకాకపోగా, -12.4 శాతం క్షీణత నమోదయ్యింది. రెండు నెలల్లో... కాగా ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో (ఏప్రిల్-మే) అసలు వృద్ధిలేకపోగా -0.1 శాతం క్షీణతలో ఉంది. 2015 ఇదే కాలంలో వృద్ధి 2.8 శాతం. గడచిన ఆరు నెలల్లో మూడు నెలలు పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో అసలు వృద్ధిలేకపోగా, క్షీణతను నమోదు చేసుకుంది. -
కేంద్ర ఉద్యోగులకు తీపి కబురు!
7వ వేతన సంఘం సిఫార్సులపై సీఓఎస్ నివేదిక న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు! ఏడో వేతన సంఘం సిఫార్సులను కేంద్రం ఆమోదించే అవకాశముంది. దీంతో కోటి మందికిపైగా ఉద్యోగుల, పింఛనుదారుల జీతభత్యాలు దాదాపు 23.5 శాతం పెరగనున్నాయి. కేబినెట్ కార్యదర్శి పీకే సిన్హా నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ(సీఓఎస్) వేతన సంఘం సిఫార్సులపై నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. దీన్ని ప్రభుత్వం ఆమోదించే అవకాశముందని ఆర్థిక శాఖ కార్యదర్శి అశోక్ లావాసా సోమవారం చెప్పారు. సీఓఎస్ ఆధారంగా త్వరలో జరిగే కేబినెట్ భేటీకి సమర్పించేందుకు ఆర్థిక శాఖ కేబినెట్ నోట్‌ను సిద్ధం చేస్తోందన్నారు. జనవరి 1 నుంచి కమిషన్ అమల్లోకి వస్తుందని తెలిపారు. 50 లక్షల మంది ఉద్యోగులు, 58 లక్షల మంది పెన్షనర్ల జీతభత్యాలకు సంబంధించి ఏడో వేతన సంఘ సిఫార్సులను అమలు చేసేందుకు హైపవర్ కమిటీని నియమించడం తెలిసిందే. ఈ సిఫార్సులతో ప్రభుత్వంపై అదనంగా రూ. 1.02 లక్షల కోట్ల భారం పడనుంది. బేసిక్‌పై 14.27 పెంచాలని సంఘం సిఫార్సు చేసింది. ఆరో వేతన సంఘం 20% పెంపును సిఫార్సు చేసింది. ఈసారి పెంపు 23.5%లో భత్యాలూ ఉన్నాయి. ప్రారంభ వేతనం నెలకు ప్రస్తుత రూ. 7 వేల నుంచి రూ. 18 వేలకు పెంచాలని, అత్యధిక వేతాన్ని రూ. 90 వేల నుంచి రూ. 2.5 లక్షలకు పెంచాలని పే కమిషన్ సిఫార్సు చేసింది. అయితే కనీస వేతనం రూ. 23,500, అత్యధిక వేతనం రూ. 3.25 లక్షలు పెంచడానికి సెక్రటరీల కమిటీ సూచించి ఉండవచ్చని సమాచారం. -
మంచి రోజులు వచ్చేశాయా?
గణాంకాలు స్థూల ఆర్థిక వాస్తవాలకు అద్దం పడతాయంటే అంగీకరించని వారున్నారు. అయితే గణాంకాలు పాలకుల అవసరాలకు అక్కరకు వచ్చే సాధనాలు కాగలవని ఆమోదించని వారు ఉండకపోవచ్చు. మంగళవారం కేంద్ర గణాంకాల సంస్థ(సీఎస్ఓ) ప్రకటించిన స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు ఎన్డీఏ ప్రభుత్వానికి సరిగ్గా సమయానికి అక్కరకు వచ్చాయి. ప్రత్యేకించి ఆర్థిక వ్యవస్థను చక్కదిద్ది, తిరిగి వృద్ధి పథం పట్టించడంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం గత రెండేళ్లలో విఫలమైందని ఆర్థిక నిపుణులు సహా పలు వర్గాల నుంచి తీవ్ర విమర్శలు ఇటీవల ఎదురయ్యాయి. ఆ గణాంకాల పుణ్యమాని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మన దేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశమని సగర్వంగా ప్రకటించారు. 2015-16 ఆర్థిక సంవత్సరం నాలుగో భాగంలో మన జీడీపీ వృద్ధి 7.9 శాతమని సీఎస్ఓ పేర్కొంది. అంచనాకు మించిన ఈ వృద్ధి ఫలితంగా 2015-16 జీడీపీ వృద్ధి 7.6 శాతానికి చేరిందని సీఎస్ఓ తేల్చింది. కాబట్టి ఆర్థిక వృద్ధిలో మనం చైనాను అధిగమించిపోయామని జైట్లీ, మంచి రోజులు వచ్చేస్తున్నాయని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు అరవింద్ పనగారియా ప్రకటించారు. ఈ వృద్ధి గణాంకాల సంరంభం నడుమ ఒకటి కాదు రెండు చేదు వాస్తవాలు అదే సమయంలో వెలుగు చూశాయి. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో బానిసలున్న దేశంగా ‘గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్ 2016’ మనకు పట్టం గట్టింది. ఆస్ట్రేలియా కేంద్రంగా పనిచేసే ‘వాక్ ఫ్రీ ఫౌండేషన్’ అనే మానవ హక్కుల సంస్థ మన దేశంలో 1.83 కోట్ల మంది బానిసలున్నారని అంచనా వేసింది. రెండేళ్లకు ఒకసారి అది విడుదల చేసే ఈ సూచీ.. బెదిరింపులు హింస, అధికార దుర్వినియోగం, వంచనలతో చేయించే నిర్బంధ శ్రమను ఆధునిక బానిసత్వంగా నిర్వచించింది. వెట్టి, వ్యభిచారం, బిచ్చమెత్తడం వంటి వివిధ రూపాలలోని గత్యంతరం లేని నిర్బంధ శ్రమను అది బానిసత్వంగా పరిగణిస్తుంది. వృద్ధి, సంక్షేమ పథకాలు, సామాజిక, చట్టపర సంస్కరణలు, శ్రామిక చట్టాలు, సామాజిక బీమా సదుపాయం అన్నీ ఉన్న భారత్‌లో ఇంత భారీ సంఖ్యలో బానిసలు ఉండటమే మిటని ఆ సంస్థ విçస్తుపోయింది. 2016 గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్‌లో నాలుగో స్థానం సాధించిన మనం మొదటి మూడు స్థానాల్లోని ఉత్తర కొరియా, ఉజ్బెకిస్థాన్, కంబోడియాల సరసన నిలచి ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశమని చాటుకోవడాన్ని మించిన అసంబద్ధ నాటకీయత మరేమైనా ఉంటుందా? ఉంటుందని బుధవారం నాటకీయంగా 0.2 శాతం విలువను కోల్పోయి బలహీనపడ్డ మన రూపాయి రుజువు చేసింది. 2011-12 తర్వాత అత్యంత అధిక వృద్ధి రేటు (నాలుగో భాగంలో 7.9 శాతం) నమోదైనదన్న కారణంగా బలపడ్డ రూపాయి... ప్రస్తుత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురాం రాజన్ రెండో దఫా ఆ పదవీ బాధ్యతలను స్వీకరించడం పట్ల విముఖత తెలిపారనే ఒక వార్తా కథనం వెలువడటంతో డీలా పడిపోయింది! బడా వ్యాపారవర్గాలు, పెట్టుబడిదారులు రాజన్ ద్రవ్య విధానాల పట్ల అసంతృప్తిని ఎన్నడూ దాచుకున్నది లేదు. వినియోగ దారుల ద్రవ్యోల్బణం అదుపునకు ప్రాధాన్యాన్నిస్తూ పెట్టుబడులను పెట్టడానికి కావాల్సిన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేయడానికి రాజన్ అడ్డంకిగా ఉన్నారని వారు చాలా కాలంగానే వాపోతున్నారు. స్వదేశీ, విదేశీ వ్యాపార పారిశ్రామిక వర్గాలకు రాజన్ విధానాలతో విభేదాలున్నా అస్థిర ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య విధాన నిర్ణేత రిజర్వ్ బ్యాంక్‌కు సమర్థ నాయకత్వాన్ని వహించారనే విశ్వాసం వారిలో ఉంది. ఆయన తిరిగి ఆ బాధ్యతలు స్వీకరించకపోవడం నిజమో కాదో తెలి యని వార్తా కథనమే వారి వ్యాపార స్థైర్యాన్ని దెబ్బతీయగలిగింది. ప్రపంచంలోనే అత్యంత అధిక జీడీపీ వృద్ధి కీర్తి వెలుగులు మాత్రం వారిలో ఆత్మవిశ్వాసాన్ని నెలకొల్పలేకపోయాయి. మన ఆర్థిక వ్యవస్థ క్షేత్ర స్థాయి బలహీనతలను ఎరిగిన వారు ఎవరైనా ఆర్థిక వాస్తవికతకు పాక్షికంగానే ప్రతిబింబించగల జీడీపీ వృద్ధిని చూసి వాటిని విస్మరించలేరు. క్షేత్ర స్థాయిలో పెడుతున్న పెట్టుబడుల కదలికలకు అద్దంపట్టే స్థూల స్థిర పెట్టుబడి కల్పన (జీఎఫ్‌సీఎఫ్) 2015-16 ఆర్థిక సంవత్సరంలో 3.3 శాతానికి పడిపోయింది. 2014–15లో అది 7.9 శాతం! పెట్టుబడి మదుపుల విషయంలో మన ఆర్థిక వ్యవస్థ బలహీనతను ఇది స్పష్టం చేస్తుంది. 7.6 శాతం వార్షిక వృద్ధిని సాధించడానికి, ప్రత్యేకించి 8 కీలక రంగాలలో వృద్ధికి ప్రధాన కారణం ప్రైవేటు వినియోగం పెరుగుదలే. 2014–15లో 6.2 శాతంగా ఉన్న ప్రైవేటు వినియోగం 2015–16లో 7.4 శాతానికి చేరింది. మరోవంక పారిశ్రామిక వృద్ధి పెరిగినా అల్పస్థాయిలోనే ఉంది. వస్తు తయారీరంగం 9.3 శాతం వృద్ధి చెందినా చివరి క్వార్టర్లో తిరిగి క్షీణతను కనబరచసాగింది. ప్రైవేటు పెట్టుబడి మదుపులలో కనబడ్డ కొద్దిపాటి పెరుగుదలకు కారణం డివిడెండ్లను అధికంగా ఇవ్వడమే తప్ప కొత్త మదుపులు పెరగడం కాదని ఆర్థిక విశ్లేషకుల అభిప్రాయం. ప్రైవేటు పెట్టుబడులు కొత్తగా మదుపులుగా పెట్టడం జరగడానికి ఇంకా సమయం పడుతుందని ఫిక్కీ వంటి సంస్థలు అంటున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు తమ మిగులు నిధులను వెచ్చించి తమ షేర్లను తామే తిరిగి కొనాలని జైట్లీ సూచించడం గమనార్హం. ప్రైవేటు పెట్టుబడులను కొత్తగా పెట్టకపోవడం వల్ల వినియోగానికి ఊతంగా ప్రభుత్వ వ్యయాన్ని పెంచాల్సి వస్తుంది. అదే జరిగితే కోశ లోటు పెరిగే అవకాశం ఉంది. మరోవంక బ్యాంకులు రుణాలు ఇవ్వడమూ క్షీణిస్తోంది. పైగా మన జీడీపీలో ఐదింట ఒక వంతు కంటే ఎక్కువగా ఉండే ఎగుమతులు వరుసగా 17 నెలలుగా పడిపోతుండటం మరో ఆందోళనకరమైన అంశం. 2015లో 8 కీలక శ్రమ సాంద్ర పరిశ్రమలలో లక్ష ఉద్యోగాల కల్పన మాత్రమే జరిగిందని, 2014లో అది 4 లక్షలని లేబర్ బ్యూరో తెలిపింది. ఈ ఉద్యోగాలు లేని వృద్ధి ఎవరికి ఊరట కలిగించాలి? ప్రపంచంలోనే అత్యధికంగా, 19.46 కోట్ల మంది అన్నార్తులను కలిగిన దేశానికి ఆర్థిక మంత్రి గణాంకాలతో ఆడుకోవడం కాదు ఆచి తూచి మాట్లా డటం మంచిది. నాలుగో భాగంలోని 7.9 శాతం రికార్డు వృద్ధికి సైతం వ్యవసాయ ఉత్పత్తి పుంజుకోవడమే కారణ ంæకావడం విశేషం. జైట్లీ సహా ప్రభుత్వ వర్గాలన్నీ కురవబోయే మంచి వర్షాలు, పండబోయే మంచి పంటల మీద ఆశలు పెట్టుకో వడమే మన ఆర్థిక వృద్ధి బలహీనతను సూచిస్తుంది. -
మైనస్‌లోనే పరిశ్రమలు..!
♦ రెండోనెలా ఐఐపీ తిరోగమనం ♦ డిసెంబర్లో 1.3 శాతం క్షీణత న్యూఢిల్లీ: పారిశ్రామికోత్పత్తి వృద్ధి వరుసగా రెండో నెలా మందగించి మైనస్‌లోనే కొనసాగింది. దీనికి సంబంధించిన సూచీ (ఐఐపీ) డిసెంబర్లో అసలు వృద్ధి కనపర్చకపోగా.. 1.3 శాతం క్షీణించింది. ప్రధానంగా తయారీ, యంత్రపరికరాల రంగాల పనితీరు నిరాశాజనకంగా ఉండటమే ఇందుకు కారణమయ్యాయి. నవంబర్‌లో పారిశ్రామిక ఉత్పాదకత మైనస్ 3.4 శాతంగా ఉంది. కేంద్రీయ గణాంకాల కార్యాలయం (సీఎస్‌వో) శుక్రవారం ఈ మేరకు గణాంకాలు విడుదల చేసింది. వీటి ప్రకారం గతేడాది డిసెంబర్లో ఐఐపీ 3.6 శాతం వృద్ధి నమోదు చేసింది. తాజాగా ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో పారిశ్రామికోత్పత్తి 3.1 శాతం పెరిగింది. గత సంవత్సరం ఇదే వ్యవధిలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి 2.6 శాతమే. ఇక ఐఐపీలోని వివిధ విభాగాల పనితీరు చూస్తే.. ♦ యంత్ర పరికరాల ఉత్పాదకత క్షీణతలోకి జారిపోయింది. డిసెంబర్లో ఏకంగా 19.7 శాతం తగ్గింది. క్రితం ఏడాది డిసెంబర్లో ఇది 6.1 శాతం వృద్ధి నమోదు చేసింది. ♦ సూచీలో దాదాపు 75 శాతం వాటా ఉండే తయారీ రంగం మైనస్‌లో 2.4 శాతం క్షీణించింది. గతంలో 4.1 శాతం వృద్ధి నమోదైంది. ♦ క్రితం డిసెంబర్లో 1.7 శాతం క్షీణించిన మైనింగ్ రంగం ఈసారి 2.9 శాతం వృద్ధి సాధించింది. విద్యుదుత్పత్తి విభాగం వృద్ధి 3.2 శాతానికి పరిమితమైంది. గతంలో ఇది 4.8 శాతం. వినియోగ ఆధారిత వర్గీకరణను బట్టి ప్రాథమిక వస్తువుల ఉత్పత్తి స్వల్పంగా 0.5 శాతం మేర పెరిగింది. వినియోగ వస్తువుల తయారీ 0.6 శాతం నుంచి 2.8 శాతానికి పెరిగింది. కన్జూమర్ డ్యూరబుల్స్ ఉత్పాదకత మాత్రం మైనస్ 9.2 శాతం నుంచి వృద్ధిలోకి మళ్లి, ఏకంగా 16.5 శాతానికి ఎగిసింది. అయితే, కన్జూమర్ నాన్ డ్యూరబుల్ విభాగం ఉత్పాదకత గతేడాది 5.6 శాతం వృద్ధి కనపర్చగా.. ఈసారి మాత్రం మైనస్ 3.2 శాతంగా నమోదైంది. తయారీ రంగంలోని ఇరవై రెండు పరిశ్రమల గ్రూప్‌లో పది ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి. -
పరిశ్రమలు రయ్ రయ్..
అక్టోబర్‌లో పారిశ్రామికోత్పత్తి 9.8% వృద్ధి; ఐదేళ్ల గరిష్టం వినియోగ ఉత్పత్తులు, యంత్రపరికరాల విభాగాల్లో వృద్ధి న్యూఢిల్లీ: వినియోగ ఉత్పత్తులు, యంత్రపరికరాల తయారీ ఊతంతో అక్టోబర్‌లో పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) అయిదేళ్ల గరిష్టానికి ఎగిసింది. 9.8 శాతం వృద్ధి నమోదు చేసింది. దీపావళి కొనుగోళ్లతో డిమాండ్ పెరుగుదల దీనికి తోడ్పడి ఉండొచ్చని అంచనాలు నెలకొన్నాయి. గతేడాది అక్టోబర్‌లో ఐఐపీ వృద్ధి మైనస్ 2.7 శాతంగా ఉంది. కేంద్రీయ గణాంకాల కార్యాలయం (సీఎస్‌వో) శుక్రవారం విడుదల చేసిన వివరాల ప్రకారం అక్టోబర్‌లో ఐఐపీ సూచీ 9.8 శాతం మేర పెరిగి 181.3గా ఉంది. సెప్టెంబర్‌లో ఐఐపీ వృద్ధిని 3.84 శాతానికి సవరించారు. ఇక, ఏప్రిల్-అక్టోబర్ మధ్య కాలంలో ఇది 4.8 శాతంగా ఉంది. తాజా ఐఐపీ గణాంకాలు చాలా మెరుగ్గాను, ప్రోత్సాహకరంగాను ఉన్నాయని ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ తెలిపారు. అయితే, సదరు నెలలో పెరుగుదలకు కేవలం దీపావళి కొనుగోళ్లే కారణమయ్యే అవకాశాలు ఉన్నందున, ఈ గణాంకాలను ఆచితూచి విశ్లేషించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఐఐపీ చివరిసారిగా 2010 అక్టోబర్‌లో గరిష్టంగా 11.36 శాతం మేర వృద్ధి నమోదు చేసింది. తయారీ రంగం జోష్.. ఆర్థిక కార్యకలాపాల తీరుతెన్నులను ప్రతిబింబించే తయారీ రంగం వార్షిక ప్రాతిపదికన అక్టోబర్‌లో 10.6 శాతం పెరగ్గా, విద్యుదుత్పత్తి 9 శాతం, మైనింగ్ రంగం 4.7 శాతం మేర వృద్ధి నమోదు చేసాయి. ఇక, కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగం ఏకంగా 4.2 శాతం ఎగిసింది. అందులో కన్జూమర్ గూడ్స్ విభాగం 18.4 శాతం, నాన్-డ్యూరబుల్స్ విభాగం 4.7 శాతం పెరిగింది. అటు యంత్రపరికరాల విభాగం 16.1 శాతం పెరిగింది. ఇక భారీ వృద్ధి నమోదు చేసిన విభాగాల్లో వజ్రాభరణాలు (372.5 శాతం), చక్కెర తయారీ యంత్రాలు (103.4 శాతం), మొబైల్ ఫోన్లు తదితర టెలికం ఉత్పత్తులు (61.5%), యాంటీబయోటిక్స్ (38.5%), కార్లు (21.4%) ఉన్నాయి. యంత్రపరికరాల విభాగం భారీగా 16.1 శాతం మేర వృద్ధి చెందడం మళ్లీ పెట్టుబడుల పెరుగుదలకు సూచనగా పరిశ్రమల సమాఖ్య అసోచాం పేర్కొంది. -
డిసెంబర్ క్వార్టర్లో 4.7% వృద్ధి
న్యూఢిల్లీ: వ్యవసాయ, సేవారంగాలు మెరుగైన పనితీరు కనబర్చడంతో అక్టోబర్ - డిసెంబర్ క్వార్టర్లో భారత ఆర్థిక వ్యవస్థ 4.7 శాతం వృద్ధిచెందింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఇది 4.4 శాతమని కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) శుక్రవారం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో (ఏప్రిల్ - డిసెంబర్) వృద్ధి రేటు 4.6 శాతంగా ఉంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో వృద్ధి 4.5 శాతం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(ఏప్రిల్ - జూన్)లో 4.4 శాతం, ద్వితీయ త్రైమాసికం(జూలై - సెప్టెంబర్)లో 4.8 శాతం చొప్పున స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిచెందింది. డిసెంబరుతో ముగిసిన క్వార్టర్లో వ్యవసాయ రంగం 3.6 శాతం (అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 0.8 శాతం) అభివృద్ధి సాధించింది. ఇదేకాలంలో తయారీ రంగం 1.9 శాతం క్షీణించగా అంతకుముందు ఏడాది ఇదే వ్యవధిలో 2.5 శాతం వృద్ధిచెందింది. డిసెంబరుతో ముగిసిన 9 నెలల్లో ఈ రంగం 0.7 శాతం క్షీణించింది. డిసెంబర్ క్వార్టర్లో విద్యుత్తు, గ్యాసు, నీటి సరఫరాలు 5 శాతం పెరగ్గా అంతకుముందు ఏడాది ఇదేకాలంలో వృద్ధి రేటు 2.6 శాతంగా ఉంది. ఇదేకాలంలో నిర్మాణ రంగం 0.6 శాతం (అంతకు ముందు ఏడాది 1 శాతం) వృద్ధి నమోదుచేసింది. ఏప్రిల్ - డిసెంబర్ మధ్యకాలంలో ఈ రంగం 2.5 శాతం విస్తరించింది. వాణిజ్యం, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్ల రంగంలో వృద్ధి రేటు మందగించింది. 2012-13 అక్టోబర్ - డిసెంబర్ మధ్యకాలంలో 5.9 శాతంగా ఉన్న వృద్ధి రేటు 2013-14 అక్టోబర్ - డిసెంబర్ మధ్యకాలంలో 4.3 శాతానికి తగ్గింది. ఈ ఏడాది 9 నెలల్లో ఈ రంగం 4.1 శాతం వృద్ధిని తాజా పెట్టుబడులకు సూచీగా భావించే గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ సమీక్షాకాలంలో రూ.5 లక్షల కోట్ల వద్ద స్థిరంగా ఉంది. మౌలిక రంగం అంతంతే న్యూఢిల్లీ: కీలకమైన మౌలిక పరిశ్రమల(కోర్ ఇన్ఫ్రా) ఉత్పాదకత మందగమనంలోనే కొనసాగుతోంది. ప్రధానంగా బొగ్గు, పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తులు, సహజవాయువు రంగాల పేలవ పనితీరుతో ఈ ఏడాది జనవరిలో మౌలిక వృద్ధి రేటు 1.6 శాతానికి పడిపోయింది. క్రితం ఏడాది ఇదే నెలలో ఈ వృద్ధి 8.3 శాతం కాగా, డిసెంబర్లో 2.1 శాతంగా నమోదైంది. కోర్ ఇన్ఫ్రాలో ఇంకా ఉక్కు, ఎరువులు, సిమెంట్, విద్యుత్, ముడిచమురు(మొత్తం ఎనిమిది) పరిశ్రమలు ఉన్నాయి. వీటికి పారిశ్రామికోత్పత్తి వృద్ధి సూచీ(ఐఐపీ)లో 38 శాతం వెయిటేజి ఉంది. కాగా, ఇప్పటికే తిరోగమనంలో ఉన్న పారిశ్రామికోత్పత్తిపై తాజా కోర్ ఇన్ఫ్రా మందగమనంతో మరింత ప్రతికూల ప్రభావం పడే అవకాశాలున్నాయి. రికవరీ ఆశలపై నీళ్లుచల్లుతూ డిసెంబర్లో ఐఐపీ మైనస్ 0.6 శాతం కుంగిన సంగతి తెలిసిందే. జనవరిలో బొగ్గు ఉత్పాదకత మైనస్‌లోకి జారిపోయింది. క్రితం ఏడాది జనవరితో పోలిస్తే 0.7 శాతం క్షీణించింది. పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తుల ఉత్పాదకత మైనస్ 4.5 శాతానికి పడిపోయింది. సహజ వాయువు విభాగం మైనస్ 5.2 శాతానికి కుంగింది.