గణాంకాలు స్థూల ఆర్థిక వాస్తవాలకు అద్దం పడతాయంటే అంగీకరించని వారున్నారు. అయితే గణాంకాలు పాలకుల అవసరాలకు అక్కరకు వచ్చే సాధనాలు కాగలవని ఆమోదించని వారు ఉండకపోవచ్చు. మంగళవారం కేంద్ర గణాంకాల సంస్థ(సీఎస్‌ఓ) ప్రకటించిన స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు ఎన్డీఏ ప్రభుత్వానికి సరిగ్గా సమయానికి అక్కరకు వచ్చాయి. ప్రత్యేకించి ఆర్థిక వ్యవస్థను చక్కదిద్ది, తిరిగి వృద్ధి పథం పట్టించడంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం గత రెండేళ్లలో విఫలమైందని ఆర్థిక నిపుణులు సహా పలు వర్గాల నుంచి తీవ్ర విమర్శలు ఇటీవల ఎదురయ్యాయి. ఆ గణాంకాల పుణ్యమాని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మన దేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశమని సగర్వంగా ప్రకటించారు.
2015-16 ఆర్థిక సంవత్సరం నాలుగో భాగంలో మన జీడీపీ వృద్ధి 7.9 శాతమని సీఎస్‌ఓ పేర్కొంది. అంచనాకు మించిన ఈ వృద్ధి ఫలితంగా 2015-16 జీడీపీ వృద్ధి 7.6 శాతానికి చేరిందని సీఎస్‌ఓ తేల్చింది. కాబట్టి ఆర్థిక వృద్ధిలో మనం చైనాను అధిగమించిపోయామని జైట్లీ, మంచి రోజులు వచ్చేస్తున్నాయని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు అరవింద్ పనగారియా ప్రకటించారు. ఈ వృద్ధి గణాంకాల సంరంభం నడుమ ఒకటి కాదు రెండు చేదు వాస్తవాలు అదే సమయంలో వెలుగు చూశాయి. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో బానిసలున్న దేశంగా ‘గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్ 2016’ మనకు పట్టం గట్టింది. ఆస్ట్రేలియా కేంద్రంగా పనిచేసే ‘వాక్ ఫ్రీ ఫౌండేషన్’ అనే మానవ హక్కుల సంస్థ మన దేశంలో 1.83 కోట్ల మంది బానిసలున్నారని అంచనా వేసింది. రెండేళ్లకు ఒకసారి అది విడుదల చేసే ఈ సూచీ.. బెదిరింపులు హింస, అధికార దుర్వినియోగం, వంచనలతో చేయించే నిర్బంధ శ్రమను ఆధునిక బానిసత్వంగా నిర్వచించింది.
వెట్టి, వ్యభిచారం, బిచ్చమెత్తడం వంటి వివిధ రూపాలలోని గత్యంతరం లేని నిర్బంధ శ్రమను అది బానిసత్వంగా పరిగణిస్తుంది. వృద్ధి, సంక్షేమ పథకాలు, సామాజిక, చట్టపర సంస్కరణలు, శ్రామిక చట్టాలు, సామాజిక బీమా సదుపాయం అన్నీ ఉన్న భారత్‌లో ఇంత భారీ సంఖ్యలో బానిసలు ఉండటమే మిటని ఆ సంస్థ విçస్తుపోయింది. 2016 గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్‌లో నాలుగో స్థానం సాధించిన మనం మొదటి మూడు స్థానాల్లోని ఉత్తర కొరియా, ఉజ్బెకిస్థాన్, కంబోడియాల సరసన నిలచి ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశమని చాటుకోవడాన్ని మించిన అసంబద్ధ నాటకీయత మరేమైనా ఉంటుందా?
ఉంటుందని బుధవారం నాటకీయంగా 0.2 శాతం విలువను కోల్పోయి బలహీనపడ్డ మన రూపాయి రుజువు చేసింది. 2011-12 తర్వాత అత్యంత అధిక వృద్ధి రేటు (నాలుగో భాగంలో 7.9 శాతం) నమోదైనదన్న కారణంగా బలపడ్డ రూపాయి... ప్రస్తుత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురాం రాజన్ రెండో దఫా ఆ పదవీ బాధ్యతలను స్వీకరించడం పట్ల విముఖత తెలిపారనే ఒక వార్తా కథనం వెలువడటంతో డీలా పడిపోయింది! బడా వ్యాపారవర్గాలు, పెట్టుబడిదారులు రాజన్ ద్రవ్య విధానాల పట్ల అసంతృప్తిని ఎన్నడూ దాచుకున్నది లేదు. వినియోగ దారుల ద్రవ్యోల్బణం అదుపునకు ప్రాధాన్యాన్నిస్తూ పెట్టుబడులను పెట్టడానికి కావాల్సిన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేయడానికి రాజన్ అడ్డంకిగా ఉన్నారని వారు చాలా కాలంగానే వాపోతున్నారు. స్వదేశీ, విదేశీ వ్యాపార పారిశ్రామిక వర్గాలకు రాజన్ విధానాలతో విభేదాలున్నా అస్థిర ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య విధాన నిర్ణేత రిజర్వ్ బ్యాంక్‌కు సమర్థ నాయకత్వాన్ని వహించారనే విశ్వాసం వారిలో ఉంది. ఆయన తిరిగి ఆ బాధ్యతలు స్వీకరించకపోవడం నిజమో కాదో తెలి యని వార్తా కథనమే వారి వ్యాపార స్థైర్యాన్ని దెబ్బతీయగలిగింది. ప్రపంచంలోనే అత్యంత అధిక జీడీపీ వృద్ధి కీర్తి వెలుగులు మాత్రం వారిలో ఆత్మవిశ్వాసాన్ని నెలకొల్పలేకపోయాయి. మన ఆర్థిక వ్యవస్థ క్షేత్ర స్థాయి బలహీనతలను ఎరిగిన వారు ఎవరైనా ఆర్థిక వాస్తవికతకు పాక్షికంగానే ప్రతిబింబించగల జీడీపీ వృద్ధిని చూసి వాటిని విస్మరించలేరు.
క్షేత్ర స్థాయిలో పెడుతున్న పెట్టుబడుల కదలికలకు అద్దంపట్టే స్థూల స్థిర పెట్టుబడి కల్పన (జీఎఫ్‌సీఎఫ్) 2015-16 ఆర్థిక సంవత్సరంలో 3.3 శాతానికి పడిపోయింది. 2014–15లో అది 7.9 శాతం! పెట్టుబడి మదుపుల విషయంలో మన ఆర్థిక వ్యవస్థ బలహీనతను ఇది స్పష్టం చేస్తుంది. 7.6 శాతం వార్షిక వృద్ధిని సాధించడానికి, ప్రత్యేకించి 8 కీలక రంగాలలో వృద్ధికి ప్రధాన కారణం ప్రైవేటు వినియోగం పెరుగుదలే. 2014–15లో 6.2 శాతంగా ఉన్న ప్రైవేటు వినియోగం 2015–16లో 7.4 శాతానికి చేరింది. మరోవంక పారిశ్రామిక వృద్ధి పెరిగినా అల్పస్థాయిలోనే ఉంది. వస్తు తయారీరంగం 9.3 శాతం వృద్ధి చెందినా చివరి క్వార్టర్‌లో తిరిగి క్షీణతను కనబరచసాగింది. ప్రైవేటు పెట్టుబడి మదుపులలో కనబడ్డ కొద్దిపాటి పెరుగుదలకు కారణం డివిడెండ్లను అధికంగా ఇవ్వడమే తప్ప కొత్త మదుపులు పెరగడం కాదని ఆర్థిక విశ్లేషకుల అభిప్రాయం. ప్రైవేటు పెట్టుబడులు కొత్తగా మదుపులుగా పెట్టడం జరగడానికి ఇంకా సమయం పడుతుందని ఫిక్కీ వంటి సంస్థలు అంటున్నాయి.
ప్రభుత్వ రంగ సంస్థలు తమ మిగులు నిధులను వెచ్చించి తమ షేర్లను తామే తిరిగి కొనాలని జైట్లీ సూచించడం గమనార్హం. ప్రైవేటు పెట్టుబడులను కొత్తగా పెట్టకపోవడం వల్ల వినియోగానికి ఊతంగా ప్రభుత్వ వ్యయాన్ని పెంచాల్సి వస్తుంది. అదే జరిగితే కోశ లోటు పెరిగే అవకాశం ఉంది. మరోవంక బ్యాంకులు రుణాలు ఇవ్వడమూ క్షీణిస్తోంది. పైగా మన జీడీపీలో ఐదింట ఒక వంతు కంటే ఎక్కువగా ఉండే ఎగుమతులు వరుసగా 17 నెలలుగా పడిపోతుండటం మరో ఆందోళనకరమైన అంశం. 2015లో 8 కీలక శ్రమ సాంద్ర పరిశ్రమలలో లక్ష ఉద్యోగాల కల్పన మాత్రమే జరిగిందని, 2014లో అది 4 లక్షలని లేబర్ బ్యూరో తెలిపింది. ఈ ఉద్యోగాలు లేని వృద్ధి ఎవరికి ఊరట కలిగించాలి? ప్రపంచంలోనే అత్యధికంగా, 19.46 కోట్ల మంది అన్నార్తులను కలిగిన దేశానికి ఆర్థిక మంత్రి గణాంకాలతో ఆడుకోవడం కాదు ఆచి తూచి మాట్లా డటం మంచిది. నాలుగో భాగంలోని 7.9 శాతం రికార్డు వృద్ధికి సైతం వ్యవసాయ ఉత్పత్తి పుంజుకోవడమే కారణ ంæకావడం విశేషం. జైట్లీ సహా ప్రభుత్వ వర్గాలన్నీ కురవబోయే మంచి వర్షాలు, పండబోయే మంచి పంటల మీద ఆశలు పెట్టుకో వడమే మన ఆర్థిక వృద్ధి బలహీనతను సూచిస్తుంది.
మంచి రోజులు వచ్చేశాయా?
Published Thu, Jun 2 2016 12:18 AM | Last Updated on Sat, Oct 20 2018 5:49 PM
Advertisement
Advertisement