పరిశ్రమలు రయ్ రయ్..
అక్టోబర్‌లో పారిశ్రామికోత్పత్తి 9.8% వృద్ధి; ఐదేళ్ల గరిష్టం
వినియోగ ఉత్పత్తులు,
యంత్రపరికరాల విభాగాల్లో వృద్ధి
న్యూఢిల్లీ: వినియోగ ఉత్పత్తులు, యంత్రపరికరాల తయారీ ఊతంతో అక్టోబర్‌లో పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) అయిదేళ్ల గరిష్టానికి ఎగిసింది. 9.8 శాతం వృద్ధి నమోదు చేసింది. దీపావళి కొనుగోళ్లతో డిమాండ్ పెరుగుదల దీనికి తోడ్పడి ఉండొచ్చని అంచనాలు నెలకొన్నాయి. గతేడాది అక్టోబర్‌లో ఐఐపీ వృద్ధి మైనస్ 2.7 శాతంగా ఉంది. కేంద్రీయ గణాంకాల కార్యాలయం (సీఎస్‌వో) శుక్రవారం విడుదల చేసిన వివరాల ప్రకారం అక్టోబర్‌లో ఐఐపీ సూచీ 9.8 శాతం మేర పెరిగి 181.3గా ఉంది. సెప్టెంబర్‌లో ఐఐపీ వృద్ధిని 3.84 శాతానికి సవరించారు.
ఇక, ఏప్రిల్-అక్టోబర్ మధ్య కాలంలో ఇది 4.8 శాతంగా ఉంది. తాజా ఐఐపీ గణాంకాలు చాలా మెరుగ్గాను, ప్రోత్సాహకరంగాను ఉన్నాయని ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ తెలిపారు. అయితే, సదరు నెలలో పెరుగుదలకు కేవలం దీపావళి కొనుగోళ్లే కారణమయ్యే అవకాశాలు ఉన్నందున, ఈ గణాంకాలను ఆచితూచి విశ్లేషించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఐఐపీ చివరిసారిగా 2010 అక్టోబర్‌లో గరిష్టంగా 11.36 శాతం మేర వృద్ధి నమోదు చేసింది.
తయారీ రంగం జోష్..
ఆర్థిక కార్యకలాపాల తీరుతెన్నులను ప్రతిబింబించే తయారీ రంగం వార్షిక ప్రాతిపదికన అక్టోబర్‌లో 10.6 శాతం పెరగ్గా, విద్యుదుత్పత్తి 9 శాతం, మైనింగ్ రంగం 4.7 శాతం మేర వృద్ధి నమోదు చేసాయి. ఇక, కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగం ఏకంగా 4.2 శాతం ఎగిసింది. అందులో కన్జూమర్ గూడ్స్ విభాగం 18.4 శాతం, నాన్-డ్యూరబుల్స్ విభాగం 4.7 శాతం పెరిగింది. అటు యంత్రపరికరాల విభాగం 16.1 శాతం పెరిగింది. ఇక భారీ వృద్ధి నమోదు చేసిన విభాగాల్లో వజ్రాభరణాలు (372.5 శాతం), చక్కెర తయారీ యంత్రాలు (103.4 శాతం), మొబైల్ ఫోన్లు తదితర టెలికం ఉత్పత్తులు (61.5%), యాంటీబయోటిక్స్ (38.5%), కార్లు (21.4%) ఉన్నాయి. యంత్రపరికరాల విభాగం భారీగా 16.1 శాతం మేర వృద్ధి చెందడం మళ్లీ పెట్టుబడుల పెరుగుదలకు సూచనగా పరిశ్రమల సమాఖ్య అసోచాం పేర్కొంది.