మైనస్‌లోనే పరిశ్రమలు..!
♦ రెండోనెలా ఐఐపీ తిరోగమనం
♦ డిసెంబర్‌లో 1.3 శాతం క్షీణత
న్యూఢిల్లీ: పారిశ్రామికోత్పత్తి వృద్ధి వరుసగా రెండో నెలా మందగించి మైనస్‌లోనే కొనసాగింది. దీనికి సంబంధించిన సూచీ (ఐఐపీ) డిసెంబర్‌లో అసలు వృద్ధి కనపర్చకపోగా.. 1.3 శాతం క్షీణించింది. ప్రధానంగా తయారీ, యంత్రపరికరాల రంగాల పనితీరు నిరాశాజనకంగా ఉండటమే ఇందుకు కారణమయ్యాయి. నవంబర్‌లో పారిశ్రామిక ఉత్పాదకత మైనస్ 3.4 శాతంగా ఉంది. కేంద్రీయ గణాంకాల కార్యాలయం (సీఎస్‌వో) శుక్రవారం ఈ మేరకు గణాంకాలు విడుదల చేసింది. వీటి ప్రకారం గతేడాది డిసెంబర్‌లో ఐఐపీ 3.6 శాతం వృద్ధి నమోదు చేసింది. తాజాగా ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో పారిశ్రామికోత్పత్తి 3.1 శాతం పెరిగింది. గత సంవత్సరం ఇదే వ్యవధిలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి 2.6 శాతమే. ఇక ఐఐపీలోని వివిధ విభాగాల పనితీరు చూస్తే..
♦ యంత్ర పరికరాల ఉత్పాదకత క్షీణతలోకి జారిపోయింది. డిసెంబర్‌లో ఏకంగా 19.7 శాతం తగ్గింది. క్రితం ఏడాది డిసెంబర్‌లో ఇది 6.1 శాతం వృద్ధి నమోదు చేసింది.
♦ సూచీలో దాదాపు 75 శాతం వాటా ఉండే తయారీ రంగం మైనస్‌లో 2.4 శాతం క్షీణించింది. గతంలో 4.1 శాతం వృద్ధి నమోదైంది.
♦ క్రితం డిసెంబర్‌లో 1.7 శాతం క్షీణించిన మైనింగ్ రంగం ఈసారి 2.9 శాతం వృద్ధి సాధించింది. విద్యుదుత్పత్తి విభాగం వృద్ధి 3.2 శాతానికి పరిమితమైంది. గతంలో ఇది 4.8 శాతం.
వినియోగ ఆధారిత వర్గీకరణను బట్టి ప్రాథమిక వస్తువుల ఉత్పత్తి స్వల్పంగా 0.5 శాతం మేర పెరిగింది. వినియోగ వస్తువుల తయారీ 0.6 శాతం నుంచి 2.8 శాతానికి పెరిగింది. కన్జూమర్ డ్యూరబుల్స్ ఉత్పాదకత మాత్రం మైనస్ 9.2 శాతం నుంచి వృద్ధిలోకి మళ్లి, ఏకంగా 16.5 శాతానికి ఎగిసింది. అయితే, కన్జూమర్ నాన్ డ్యూరబుల్ విభాగం ఉత్పాదకత గతేడాది 5.6 శాతం వృద్ధి కనపర్చగా.. ఈసారి మాత్రం మైనస్ 3.2 శాతంగా నమోదైంది. తయారీ రంగంలోని ఇరవై రెండు పరిశ్రమల గ్రూప్‌లో పది ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి.