
నాడు–నేడు మూల ధన వ్యయం, పారిశ్రామిక వృద్ధిలో భారీ వ్యత్యాసం
2024–25 బడ్జెట్ కేటాయింపుల్లో మూల ధన వ్యయం కేవలం 27 శాతమే ఖర్చు
2023–24లో జగన్ సర్కారు బడ్జెట్ కేటాయింపుల్లో ఏకంగా 62% ఖర్చు
19 రాష్ట్రాల్లో ఇప్పుడు చివరి నుంచి ఏపీకి మూడో స్థానం
అట్టడుగున జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఏపీ.. ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడి
2023–24లో పారిశ్రామిక వృద్ధి 7.42 శాతం.. 2024–25లో 6.71 శాతమే
పరిశ్రమలు వస్తే వృద్ధి ఎందుకు తగ్గినట్లు?
1,107 ఎంఎస్‌ఎంఈలు మూత.. పట్టణాల్లో పెరిగిన నిరుద్యోగం
4 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదని ఒప్పుకున్న మంత్రి లోకేశ్
గవర్నర్ తెలుగు ప్రసంగంలో అచ్చుతప్పు అని మండలిలో స్పష్టీకరణ
సాక్షి, అమరావతి: అటు మూల ధన వ్యయం, ఇటు పారిశ్రామిక వృద్ధిలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి, ప్రస్తుత చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. మూల ధన వ్యయం ద్వారా సంపద సృష్టిస్తానని పెద్ద పెద్ద మాటలు చెప్పిన చంద్రబాబు తీరా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ విషయంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే బాగా వెనుకబడి ఉన్నారు.
దేశంలో 19 రాష్ట్రాల్లో మూల ధన వ్యయం ఖర్చులో ఏపీ చివరి నుంచి మూడో స్థానంలో ఉందని ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక స్పష్టం చేయడమే ఇందుకు నిదర్శనం. 2023 – 25 ఆర్థిక సంవత్సరాల బడ్జెట్ కేటాయింపుల్లో 9 నెలల్లో చేసిన మూల ధన వ్యయంపై ఇటీవల ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదికను విడుదల చేసింది. 2023–24లో 9 నెలల్లోనే 62 శాతం మూల ధన వ్యయం చేసినట్లు వెల్లడించింది.
అదే చంద్రబాబు ప్రభుత్వం 2024–25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపుల్లో 9 నెలల్లో కేవలం 27 శాతం మాత్రమే మూల ధన వ్యయం చేసిందని తెలిపింది. 2024–25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపుల్లో అతి తక్కువగా మూల ధన వ్యయం చేసిన 19 రాష్ట్రాల్లో అట్టడుగున జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ ఉన్నట్లు నివేదిక పేర్కొంది. బీహార్ కంటే ఆంధ్రప్రదేశ్ అధ్వానంగా ఉందని ఆ నివేదిక స్పష్టం చేస్తోంది. ఈ పరిణామం రాష్ట్ర వృద్ధిపై ప్రభావం చూపుతుందని స్పష్టం అవుతోంది.
తిరోగమనంలో పారిశ్రామిక వృద్ధి
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక పారిశ్రామిక వృద్ధి తిరోగమనంలో పయనిస్తోంది. కొత్త పరిశ్రమలు రాకపోగా, ఉన్న పరిశ్రమలు మూత పడటమే ఇందుకు కారణమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే సీఎం చంద్రబాబు చెబుతున్నట్లు ఈ ప్రభుత్వ హయాంలో కొత్త పరిశ్రమలు వచ్చి ఉంటే పారిశ్రామిక వృద్ధి ఎందుకు తగ్గిందో ఆయనే సమాధానం చెప్పాలి.
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో సీఎం చంద్రబాబు సమాధానం చెబుతూ రాష్ట్ర వృద్ధిపై ప్రజెంటేషన్ ఇచ్చారు. దాని ప్రకారం 2024–25లో పారిశ్రామిక వృద్ధి అంతకు ముందు ఆర్థిక ఏడాది కన్నా తక్కువగా ఉందని పేర్కొన్నారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం పారిశ్రామిక వృద్ధి 7.42 శాతం ఉండగా 2024–25లో కేవలం 6.71 శాతమేనని ప్రజెంటేషన్‌లో సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
కొత్త పరిశ్రమలు రాకపోగా, ఉన్న పరిశ్రమలు మూత పడుతుండటం వల్లే పారిశ్రామిక వృద్ధి తిరోగమనంలో ఉన్నట్లు స్పష్టం అవుతోంది. పారిశ్రామిక రంగంలోకి వచ్చే మైనింగ్, క్వారీయింగ్‌లో వృద్ధి మైనస్ 1.38 శాతానికి పడిపోయింది. రెడ్‌బుక్ పాలన పేరుతో వేధింపుల పర్వం కొనసాగిస్తుండటంతో పాటు బడా పారిశ్రామిక వేత్తలను సైతం భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
సంపద సృష్టి అంటూ జపం చేయడం తప్ప తొమ్మిది నెలల పాలనలో చంద్రబాబు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. 2024–25 ఆర్థిక సంవత్సరం జనవరి నాటికి రాష్ట్రంలో 1107 ఎస్‌ఎంఈలు మూత పడినట్లు కేంద్ర మైక్రో, స్మాల్ మీడియం ఎంటర్ ప్రైజెస్ మంత్రిత్వ శాఖ తెలిపింది. మరో పక్క రాష్ట్రంలో నిరుద్యోగ రేటు పెరిగిందని పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే స్పష్టం చేసింది.
పట్టణ ప్రాంతాల్లో గత ఏడాది జనవరి నుంచి మార్చి వరకు పురుషుల నిరుద్యోగ రేటు 6.3 శాతం ఉండగా, అక్టోబర్ నుంచి డిసెంబర్ నాటికి 7.3 శాతానికి పెరిగిందని సర్వే పేర్కొంది. ఇదే సమయంలో జాతీయ స్థాయిలో నిరుద్యోగ రేటు 6.4 శాతం ఉంది. మహిళల నిరుద్యోగ రేటు 6.4 శాతం నుంచి 7.5 శాతానికి పెరిగిందని సర్వే తెలిపింది.
నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు
తమ ప్రభుత్వం నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదని మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి లోకేశ్ శాసన మండలిలో స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం నాలుగు లక్షల ఉద్యోగావకాశాలు కల్పించిందని గవర్నర్ ప్రసంగంలో చెప్పడంపై మంగళవారం మండలిలో వైఎస్సార్‌సీపీ సభ్యులు నిలదీశారు. దీనిపై మంత్రి లోకేశ్ స్పందిస్తూ.. నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదని, నాలుగు లక్షల ఉద్యోగావకాశాలు వస్తాయని మాత్రమే చెప్పామని తెలిపారు. గవర్నర్ ఇంగ్లిష్ ప్రసంగం ప్రతిలో ఇలానే ఉందని, తెలుగు ప్రసంగం ప్రతిలో ఉద్యోగాలు కల్పించినట్లు అచ్చు తప్పు పడిందని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment