న్యూఢిల్లీ: భారత్ తాజా ఆర్థిక గణాంకాలు కొంత నిరాశ పరిచాయి. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం– ఆగస్టులో పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) వృద్ధి రేటు 4.3 శాతంగా (2017 ఇదే నెలతో పోల్చి చూస్తే) నమోదయ్యింది. మూడు నెలల కాలంలో ఇంత తక్కువ స్థాయిలో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు నమోదుకావడం ఇదే తొలిసారి.
మైనింగ్ రంగం అలాగే భారీ ఉత్పత్తుల యంత్ర పరికరాలకు సంబంధించి క్యాపిటల్ గూడ్స్ విభాగాల పేలవ పనితీరు దీనికి కారణం. జూలైలో ఐఐపీ వృద్ధి రేటు 6.5 శాతంకాగా, గత ఏడాది ఇదే కాలంలో రేటు 4.8 శాతం. ఇక సెప్టెంబర్‌లో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 3.77 శాతంగా నమోదయ్యింది. 2017 ఇదే నెలలో ఈ రేటు 3.28 శాతం. ఈ ఏడాది ఆగస్టులో ఈ రేటు పది నెలల కనిష్ట స్థాయిలో 3.69 శాతంగా నమోదయ్యింది.
పారిశ్రామికం... రంగాల వారీగా..
మైనింగ్: 2017 ఆగస్టులో 9.3 శాతం వృద్ధి రేటు నమోదయితే 2018 ఆగస్టులో అసలు వృద్ధిలేకపోగా, –0.4 శాతం క్షీణత నమోదయ్యింది. అయితే ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో ఈ రేటు 3.2 శాతం నుంచి 3.9 శాతానికి పెరిగింది.
క్యాపిటల్ గూడ్స్: ఈ రంగం కూడా 7.3 వృద్ధిరేటు నుంచి 5 శాతం క్షీణతకు పడిపోయింది.
తయారీ: ఈ రంగంలో వృద్ధి రేటు 3.8 శాతం నుంచి 4.6 శాతానికి పెరిగింది. ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు (ఐదు నెలలు) మధ్య ఈ రేటు 1.7 శాతం నుంచి 5.4 శాతానికి పెరిగింది. తయారీ రంగంలోని మొత్తం 23 పారిశ్రామిక గ్రూపుల్లో 16 సానుకూలంగా ముగిశాయి.
విద్యుత్: ఈ రంగం నిరాశాజనకంగా ఉంది. ఆగస్టులో వృద్ధి రేటు 8.3 శాతం నుంచి 7.6 శాతానికి తగ్గితే, ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య ఈ రేటు 6.2 శాతం నుంచి 5.8 శాతానికి తగ్గింది.
కన్జూమర్: కన్జూమర్ డ్యూరబుల్స్, కన్జూమర్ నాన్–డ్యూరబుల్స్ రంగాల్లో వృద్ధి రేట్లు వరుసగా 5.2 శాతం, 6.3 శాతంగా ఉన్నాయి.
ఐదు నెలల్లో బాగుంది....
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల కాలంలో (ఏప్రిల్–ఆగస్టు) వృద్ధి రేటు 2.3 శాతం నుంచి 5.2 శాతానికి పెరిగింది.
పెరిగిన క్రూడ్, ఆహార ధరలు!
పెరిగిన క్రూడ్, ఆహార ధరలు సెప్టెం బర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపాయి. చేపలు, గుడ్లు, పాలు, పాలపదార్థాలు ధరలు స్వల్పంగా పెరిగాయి. అయితే పండ్ల ధరలు మాత్రం కొంచెం తగ్గాయి. కన్జూమర్ ఫుడ్ బాస్కెట్ ధర 0.51 శాతం పెరిగింది. ఫ్యూయెల్, లైట్ కేటగిరీలో ద్రవ్యోల్బణం రేటు 8.47 శాతం పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment